టైటానిక్ ట్రాజెడి రియల్ హీరో ఎవరో తెలుసా?

(CS Saleem Basha)
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు “సర్ ఆర్థర్ హెన్రీ రోస్ట్రాన్ “. ఒక ఉత్కంఠభరితమైన, సాహసోపేతమైన పని చేసి ఎంతో మందిని రక్షించిన సాహసికుడు. ఒక ఉత్కంఠభరితమైన సినిమా కథను తలపించేలా ఉన్న రెస్క్యూ ఆపరేషన్ ద్వారా 700 పైగా ప్రయాణికులను రక్షించిన రియల్ హీరో. అతని పక్కనే మహిళ పేరు మిసెస్ బ్రౌన్.ఆమే ప్రాణాలను కాపాడినందుకు ఒక బంగారు పతకం ఇస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.
అందరికీ టైటానిక్ ప్రమాదం గురించి తెలుసు, తర్వాత వచ్చిన సినిమా గురించీ తెలుసు. కానీ మునిగిపోతున్న టైటానిక్ లోనుంచి 705 ప్రయాణికులను లని రక్షించిన హీరో గురించి చాలా మందికి తెలియదు. అతనే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి, 42 ఏళ్ళ ఆర్థర్ హెన్రీ రోస్ట్రాన్
నిజానికి ఈ కెప్టెన్ చేసింది తక్కువ అడ్వెంచర్ కాదు. టైటానిక్ ప్రమాదం జరిగినప్పుడు ” కార్పతియ ” అనే ఒక ఓడకి అతనే కెప్టెన్. న్యూయార్క్ నుంచి క్రొయేషియా లోని ఫ్లూమ్ నగరానికి కార్పతియ తీసుకొని బయలుదేరాడు. అది రెగ్యులర్ రూట్. టైటానిక్ ప్రమాదం జరిగిన అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ కన్న కార్పతియ దాదాపు వందకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉంది.
టైటానిక్ మునిగిపోతున్నపుడు రక్షించమని ( ఎస్ వో ఎస్) పంపించిన సిగ్నల్ అందుకున్నది మూడు ఓడలు. ఇందులో సాంసన్ ఒకటి. రెండవది ఎస్ఎస్ కాలిఫోర్నియన్. మూడోది కార్పతియ. సాంసన్ కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ స్పందించలేదు. అలాగే ఎస్ఎస్ కాలిఫోర్నియన్ కూడా దగ్గర లోనే ఉన్నా స్పందించలేదు. ఎందుకంటే దాని చుట్టూ మంచు పేరుకొని ఉంది. అందుకే అది సాహసం చేయలేదు. తెల్లవారిన తర్వాత చూద్దాం అని మిన్నకుండి పోయింది. 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్పతీయ మళ్లీ వెనక్కి రావాలి. అయినా సరే రావాలని నిర్ణయం తీసుకున్నాడు.
దాదాపు 12 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్న తరుణంలో వైర్లెస్ ఆపరేటర్ హెరాల్డ్ కొట్టం పరిగెత్తుకుంటూ రోస్ట్రాన్ క్యాబిన్ కి వచ్చాడు. విషయం చెప్పాడు. అంతే రోస్ట్రాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చకచకా ఆర్డర్ లు పాస్ చేశాడు. సిబ్బందిని అందరినీ విధుల్లోకి దింపాడు. అంత రాత్రి సమయంలో 107 కిలోమీటర్లు వెనక్కి వచ్చి టైటానిక్ లాంటి ఓడలో ఉన్న వారిని కాపాడడం ఒక సాహసమే. ఎందుకంటే కార్పతియ చాలా చిన్న ఓడ. అయినా సరే రోస్ట్రాన్ టైటానిక్ లో ఉన్న ప్రయాణికులను కాపాడాలని నిశ్చయించుకున్నాడు.
ఈ రెస్క్యూ ఆపరేషన్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందులో ముఖ్యమైనది
కార్పతియ వేగం కేవలం గంటకు 14 నాట్స్ మాత్రమే. ఆ వేగంతో వెళితే టైం పడుతుంది. అందుకే తన ఇంజనీర్లతో కలిసి చర్చించి రిస్కు తీసుకొని తన ఓడ వేగాన్ని 17.5 నాటి పెంచాడు. ఆ చీకటి రాత్రి ఎన్నో కష్టాలకు ఓర్చి దాదాపు మూడున్నర గంటల తర్వాత టైటానిక్ ని చేరుకున్నాడు. దానికోసం ఓడ హీటింగ్ సిస్టంను కొద్దిగా తగ్గించి దాన్ని ఇంజిన్ వైపు మళ్ళించాడు! నాలుగు గంటల 15 నిమిషాలకు మొదలైన రెస్క్యూ ఆపరేషన్ 8:30 కి ముగిసింది. కార్పతియ చాలా చిన్నది. దాదాపు 700 మంది ప్రయాణికులు ఎక్కి నందుకు ఓవర్లోడ్ అయినప్పటికీ ఏప్రిల్ 18 వ తారీకు న ఓడను సురక్షితంగా న్యూయార్క్ కి తీసుకెళ్లాడు.
రోస్ట్రాన్ కి తర్వాత ఎన్నో అవార్డులు, బహుమతులు, పురస్కారాలు వచ్చాయి. “సర్” బిరుదు కూడా వచ్చింది. పెద్దగా పొంగిపోలేదు. రోస్ట్రాన్ కి దైవభక్తి ఎక్కువ. చాలా సింపుల్ వ్యక్తి. అంత చిన్న ఓడ తో ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలిగారు అన్న ప్రశ్నకు సమాధానంగా ” ఆరోజు నాతోపాటు ఓడ స్టీరింగ్ దగ్గర మరో అదృశ్య హస్తం ఉంది” అని చెప్పడం దైవ భక్తికి, సాధారణమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.

(Saleem Basha is a Kurnool based short story writer and laugh therapist. Mobole:0393737937)