Home Features ఎపిలో కరోనా అంకెల గారడి : యనమల రామకృష్ణుడు

ఎపిలో కరోనా అంకెల గారడి : యనమల రామకృష్ణుడు

185
0
ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించి చూపేందుకే అంకెల గారడీ చేస్తోంది. కేంద్రాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు శోచనీయం.
మార్చి 14న రాష్ట్రంలో ఒక కేసు ఉంటే, నిన్న ఏప్రిల్ 25కు 1,016కేసులకు చేరినట్లుగా ప్రభుత్వ లెక్కలే చెప్పాయి.
దక్షిణాదిలోనే 2వ గరిష్ట కేసులున్న రాష్ట్రంగా ఏపి మారింది. నెలలోనే కరోనా కేసులు 101% పెరిగాయి. ఇదే వేగంతో విస్తరిస్తే మే 3కల్లా(లాక్ డౌన్ 2 చివరికి) కేసులు 2వేలకు చేరతాయి అనడంలో సందేహం లేదు. అత్యధికంగా టెస్ట్ లు చేశామని చెబుతున్నారే తప్ప, పాజిటివ్ కేసులు అత్యధికంగా పెరిగాయని చెప్పడం లేదు.
ఇన్ ఫెక్షన్ రేటు 1.66%కు తగ్గించి చూపడానికే, పరీక్షలు ఎక్కువ చేశామని చెబుతున్నారు. చేయకుండానే పరీక్షలు చేసినట్లు చూపి, ఇన్ ఫెక్షన్ రేటును తగ్గించి చూపిస్తున్నారు.
పాజిటివ్ కేసులు 100% పెరిగితే, ఇన్ ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుంది? పాజిటివ్ కేసులు 100% పెరిగితే, ఇన్ ఫెక్షన్ రేటు ఎలా తగ్గుతుంది? కేసులు పెరిగితే ఇన్ ఫెక్షన్ రేటు పెరగాలి కదా? ఇదేమి ‘‘రివర్స్’’ లెక్కలో ముఖ్యమంత్రిగారే చెప్పాలి.
రాష్ట్రంలో ఇన్ ఫెక్షన్ అయిన కేసులలో రికవరీ రేటు 16% ఉంటే, తెలంగాణలో 31%, కేరళలో 222%, కర్ణాటకలో 33%, తమిళనాడులో 49% ఉంది. దక్షిణాదిలో రికవరీ రేటు ఏపిలోనే అత్యల్పంగా ఉంది. కేసుల రేటు తగ్గించి చూపడానికే పరీక్షల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు.
కరోనా తీవ్రతపై వైసిపి నేతలకు అవగాహన లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆదిలోనే తప్పటడుగు వేశారు. రికవరీ రేటులో విఫలం చెందారు. ఇన్ ఫెక్షన్ రేటు తగ్గించడంలో వైఫల్యం. వైరస్ వ్యాప్తి నియంత్రణలో విఫలం. క్వారంటైన్ సెంటర్ల నిర్వహణలో విఫలం. లాక్ డౌన్ అమలులో వైఫల్యం.
ఒక నెలలోనే మరణాలలో 5వ స్థానం చేరింది. 30రోజుల్లోనే పాజిటివ్ కేసులలో 8వ స్థానానికి చేరింది. ఈ వాస్తవాలను ప్రభుత్వం చెప్పడం లేదు. నిన్న ప్రభుత్వ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉంది.
వైసిపి మూర్ఖపు చేష్టలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం:
ఏపిలో ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఏపిలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేక పోయింది. పైగా వైసిపి నాయకులే వైరస్ వ్యాప్తికి కారకులు అయ్యారు. వైసిపి మూర్ఖపు చేష్టలతో ప్రజల ప్రాణాలనే బలిగొంటోంది.
ఏ రోజైతే ముఖ్యమంత్రి ఇది మామూలు ఫ్లూ లాంటిదేనని తేలిగ్గా చెప్పారో, ఆ రోజుకన్నా ప్రస్తుతం కేసులు 100% పెరగడానికి జవాబుదారీ ఎవరు…? కరోనాను ఈ ప్రభుత్వం ఎంత తేలిగ్గా తీసుకుందో సీఎం పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలే రుజువు.
సీఎం వ్యాఖ్యలతో, వైసిపి నాయకులంతా తేలిగ్గా తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా గుంపులుగా తిరిగారు. వైసిపి ఫ్లెక్సీలతో ట్రాక్టర్ల ర్యాలీలు జరిపారు. పంపిణీ ముసుగులో వైరస్ వాప్తికి వైసిపి కారణమైంది.
కరోనా ముసుగులో ఓట్లు వెదుక్కోవడానికి ఆరాట పడ్డారు. వైసిపి నేతల తప్పుడు చర్యలవల్లే ఏపిలో కరోనా వైరస్ విస్తరిస్తోంది.
కరోనా పేరుతో నిధులు కేంద్రం నుంచి పొందుతున్నారు. జీతాలు, పించన్లలో కోతలు విధిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెంచుతున్నారు. ప్రజలపై అత్యధిక భారం మోపుతున్నారు. మే 16కల్లా కొత్త కేసులు తగ్గుతాయని నీతి అయోగ్ అంచనా వుంటే, ఏపిలో మాత్రం కొత్త కేసులు రోజురోజుకూ పెరగడం వైసిపి ప్రభుత్వ చేతగానితనమే.
రేపోమాపో కేంద్ర బృందానికి ఫిర్యాదు చేస్తాం:
రేపోమాపో కేంద్ర అధికారుల బృందం ఏపికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 5రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లాయి. ఏవిధంగా విఫలం అయ్యింది, ఏవిధంగా వైసిపి నాయకులు దీనిని తేలిగ్గా తీసుకుంది, ఓట్ల కోసం ఎలా వైరస్ వ్యాపింపజేశారో వీడియోలతో సహా కేంద్ర బృందానికి ఫిర్యాదు చేస్తాం.
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఫలితం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటించాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలి.
-యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్