ఆంధ్ర-తెలంగాణ నీళ్ల గొడవ సృష్టిస్తున్న ఎపి జివొ నెం.203లో ఏముంది?

(రాయలసీమ సాగునీటి సాధన సమితి)
జి వో నెంబర్ 203 ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ  మే 5 తేదీన విడుదల చేసింది. ఈ జివొ విడదలయిన వారం రోజులకు తెలంగాణ ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జివొని విమర్శించారు. ఉపసంహరించుకోవాలన్నారు. అది చెల్లదన్నారు. ఇందులో పేర్కొన్నా పోతిరెడ్డి పాడు అప్ గ్రెడేషన్ కు గాని, రాయలసీమ పింపింగ్ సిస్టమ్ పేరుతో చేపడుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాగానికి కృష్ణ నది మేనేజ్ మెంట్ బోర్డు (KRMB) నుంచి అనుమతులు లేవని అన్నారు. అంతేకాదు, దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. అయితే, ఆంధ్రలో అన్ని రాజకీయ పార్టీలు జీవొకు మద్దతుతెలిపాయి. జివొ గురించి రాయలసీమ సాగునీటి సాధన సమితి వాదన ఇది.
జివొ లోని కీలక అంశాలు
* పోతిరెడ్డి పాడు హెడ్రెగ్యులేటర్ నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు వున్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) సామర్థ్యాన్ని 80000 క్యూసెక్కులకు పెంచడానికి పాలనాపరమైన అనమతులు ఇవ్వడం.
* పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నీటి విడుదల సామర్థ్యం 44000 క్యూసెక్కులు మాత్రమే ఉన్నందున, 3 టి ఎం సిల (సుమారు 35000 క్యూసెక్కులు) సామర్థ్యంతో సంగమేశ్వరం నుండి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) కు నీరు ఎత్తి పోయడానికి వీలుగా ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వడం.
ఈ జి వో ఎందుకు ?
* కింద పేర్కొన్న రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాలలోని తాగు, సాగు నీటి ప్రాజక్టులకు నీరు తీసుకొనడం కోసం
# నికర జలాల అనుమతులున్న ఎస్ ఆర్ బి సి
# నికర జలాలున్న చెన్నై నగర త్రాగునీటి ప్రాజక్టు (తెలుగుగంగ ప్రాజక్టు ద్వారా)
# మిగులు జలాల అనమతులున్న తెలుగుగంగ ప్రాజక్టు
# రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచిన గాలేరు నగరి, హంద్రి నీవా ప్రాజక్టు
# నెల్లూరు, చిత్తూరు జిల్లాల త్రాగు, సాగు నీరు
ఈ ప్రాజక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ?
* ఈ ప్రాజక్టుకు కృష్ణా నది యాజమాన్య బోర్డ్ (KRMB) , అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని
* రాయలసీమ ఎక్కువ నీటిని వినియోగించు కుంటుందేమోనన్న అనుమానం వలన
* తెలంగాణా ప్రాజక్టులకు నీరు అందదేమోనన్న అనుమానం వలన
వాస్తవాలు ఏమిటి ?
* పూడిక చేరడం వలన శ్రీశైలం రిజర్వాయర్ నీటి నిలువ సామర్థ్యం 92 టి ఎం సి లు (308 టి ఎం సి ల నుండి 215 టి ఎం సి లకు) తగ్గింది. తగ్గిన సామర్థ్యం నీటిని వృధాకాకుండా కాలువల సామర్థ్యం పెంచడం, నిలువ చేయడం అత్యంత అవసరం.
* తగినంతగా నీటి నిలువ సామర్థ్యం లేకపోవడం వలన గత 30 సంవత్సరాలలో (1990 – 91 నుండి 2019 – 20 వరకు) సగటున ప్రతి సంవత్సరం 420 టి ఎం సి ల నీరు సముద్రపాలు అయ్యింది.
* పోతిరెడ్డిపాడు ద్వార తీసుకున్న నీరు గత 23 సంవత్సరాలలో (1997 – 98 నుండి 2019 – 20 వరకు) సగటున ప్రతి సంవత్సరం 68 టి ఎం సి లు మాత్రమే.
* పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం 11000 క్యూసెక్కుల నుండి 44000 క్యుసేక్కులకు పెంచిన గత ఆరు సంవత్సరాలలో (2014 – 15 నుండి 2019 – 20 వరకు) పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకున్న నీరు సగటున ప్రతి సంవత్సరం 85 టి ఎం సి లు మాత్రమే.
* శ్రీశైలం రిజర్వాయర్ లో పూర్తి స్థాయి (885 అడుగులు) నీరు వున్నప్పుడు మాత్రమే 44000 క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ తీసుకునే అవకాసం వుంటుంది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సిల్ లెవెల్ (పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్ల అడుగు భాగం) 841 అడుగులు. శ్రీశైలం రిజర్వాయర్లో 841 అడుగులలో నీరు వుంటే పోతిరెడ్డిపాడు నుండి ఒక చుక్క నీరుకుడా తీసుకొనే అవకాసం ఉండదు.
* రాయలసీమలో 90 లక్షల వ్వసాయ యోగ్య భూమి వుంది . ఇందులో 20 లక్షల ఎకరాలకు చిన్న, మధ్య, పెద్ద సాగు నీటి ప్రాజక్టుల ద్వారా సాగునీటి వసతి కల్పించడం జరిగింది. కానీ గత పది సంవత్సరలుగా సగటున 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు లభిస్తున్నది.
* 800/805 అడుగుల సముద్ర మట్టం నుండి కృష్ణా నది నీటిని ఎత్తిపోయడానికి పాలమూరు, దిండి ఎత్తిపోతల ప్రాజక్టులను అంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన తరువాత కృష్ణా నది యాజమాన్య బోర్డ్ (KRMB), అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణా రాష్ట్రం నిర్మించింది.
* పైన రెండవ అంశంలో పొందపరిచిన రాయలసీమ ప్రాజక్టులు 854 అడుగుల పైన కృష్ణా నదిలో నీరు ఉన్నప్పుడు మాత్రమే నీరు తీసుకునే అవకాసం వుంది. కానీ తెలంగాణాలో వరద జలాలపైన నిర్మించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) 825 అడుగులు, కల్వకుర్తి లిఫ్ట్ 802 అడుగులు, నెట్టెంపాడు 825 అడుగులు, పాలమూరు లిఫ్ట్ 800 అడుగులు, దిండి లిఫ్ట్ 805 అడుగుల నుండి నీరు తీసుకునే అవకాసం వుంది.
* కృష్ణా నది వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ -1 (KWDT -1) నీటిని సముద్రం లోనికి వృధాగా పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణా నది వరద నీటిని నిలువ వుంచుకొనడానికి క్యారీ ఓవర్ నిలువలు చేయడానికి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని వివరించింది.
పరిష్కార సూచనలు
* రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి, ప్రకృతి ప్రసాదించిన నీటిని సమగ్రంగా వినిగొంచుకోనడానికి రాజకీయ పరిణత ప్రదర్శించాలి.
* కృష్ణా వరద జలాలు సముద్రం లోనికి పోతున్నాయి. అదే సంధర్బంలో వరద జలాల పైన రాయలసీమలో నిర్మించిన ప్రాజక్ట్లు నీరు పొందలేక పోతున్నాయి. ఈ పరిస్థితికి కారణం శ్రీశైలం రిజర్వాయర్ బాక్ వాటర్ నుండి 854 అడుగుల పైననే రాయలసీమ ప్రాజక్టులకు నీరు తీసుకొనే అవకాసం వుండటం మరియు కాలువల మరియు రిజర్వాయర్ల నీటి నిర్వహణ సామర్థ్యం తక్కువగా వుండటమే. దీనికి పరిష్కారం వరద వున్నప్పుడు అధికంగా నీరు తీసుకోనేలగా కాలువల సామర్థ్యం పెంచడం.
* తుంగబద్ర నదిలో సంవృద్దిగా నీరు ప్రవహిస్తున్నా, తెలంగాణా లోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (RDS), రాయలసీమ లోని కే సి కెనాల్ ప్రాజక్టులు కేటాయించిన నీటిని కుడా వినియోగించలేక పోతున్నాయి. ఈ ప్రాజక్టులకు సక్రమంగా నీరు లభించడానికి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. దీనికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.
* శ్రీశైలం రిజర్వాయర్లో పూడిక చేరి ప్రాజక్టు జీవిత కాలం తగ్గిపోకుండా ఉండటానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడం అత్యంత అవసరం.
* గౌరవ ప్రధాన మంత్రి మే 12, 2020 న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మనం “స్వయం సంవృద్ధి” సాదించాలని ప్రకటించారు. భారత దేశం వంట నూనెలు, పప్పు ధాన్యాలు సుమారు 80000 కోట్ల రూపాయల దిగుబడి చేసుకుంటున్నది. ఈ ఆహార పంటలు పండే భూమి, వాతావరణం, పండించే నైపుణ్యం మరియు కష్టపడే రైతులు, రైతు కూలీలు భారత దేశంలో వున్నారు. కావలసినదంతా పొలాలకు నీరు. దేశంలోని వెనకబడిన, వర్షాధారిత ప్రాంతాలకు ఆరుతడి పైర్లకు నీరందిస్తే కరువు పీడిత ప్రాంతాలు బాగుపడతాయి. దేశం ఆహార ఉత్పత్తిలో స్వావలంబన పొందుతుంది. ఈ దిశగా కేంద్రప్రభుత్వం చొరవ చూపాలి.