తిరుపతి , విశాఖ మహానగరాలు ఎందుకు కాకూడదు?

(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ ప్రజల నుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. అమరావతి రాజధాని రాష్ట్ర భవిష్యత్ కు ఎలా కీలకం అవుతుందో వివరించారు.
రాజధాని అభివృద్ధి మాత్రమే ఒక రాష్ట్ర లేదా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందా ?
చంద్రబాబు  తన ఉపన్యాసంలో ప్రధానంగా అమరావతిని హైదరాబాదుతో పోల్చి రాష్ట్రానికి ఆదాయ , ఉపాధి కేంద్రంగా ఎలా మారబోతుందో వివరించారు. సాధ్య సాధ్యలు పక్కన పెట్టి అభివృద్ధి చెందిన దేశాలు , రాష్ట్రాల అనుభావాలు చూద్దాం.
అమెరికా…..
అభివృద్ధికి చిరునామా అమెరికా. ఆదేశ రాజదాని వాషింగ్టన్ డిసి కానీ ఆదేశ మహానగరం మాత్రం న్యూయార్క్. అమెరికాలోనే కాలిఫోర్నియా ఒక రాష్ట్రం దాని రాజధాని సాక్రమేంటో అయితే ఆ రాష్ట్ర మహానగరం మాత్రం లాస్ ఏంజెల్స్. అమెరికాలొనే ఉన్న డల్లాస్ కూడా ఉపాధి కేంద్రం ఆనగరం రాజధాని కాదు.
ఆస్ట్రేలియా…
మరో అబివృద్ది చెందిన దేశం ఆస్ట్రేలియా ఆ దేశ రాజధాని కనబెర కానీ మహానగరాలు మాత్రం సిడ్నీ , మేల్ బోర్న్ ఈ రెండు నగరాలు ఆస్ట్రేలియా ఉపాధి. మరియు ఆదాయ కేంద్రాలు అంతే కాదు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహానగరాలు. కానీ రాజధానులు మాత్రం కాదు.
భారతదేశం కూడా మినహాయింపు కాదు…
మనదేశ రాజధాని ఢిల్లీ అంతకు మించిన మహానగరాలు , ఉపాధి కేంద్రాలుగా మారింది ముంబయి , చెన్నై , హైదరాబాద్ , బెంగళూరు. రాష్ట్రాల అనుభవాలు కూడా అదే చెపుతుంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ కాగా ఆ రాష్ట్ర ఉపాధి కేంద్రం అహ్మదాబాద్. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయితే ఉపాధి కేంద్రంగా నోయిడా అభివృద్ధి చెందుతుంది. ఆదర్శంగా కేరళ రాష్ట్రం రాజాదానికి సమనంగా మిగిలిన నగరాలను చూస్తోంది.
తిరుపతి , విశాఖపట్నం మహానగరాలుగా అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతాలు.
తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే ఆటంకాలు అని చెప్పక తప్పుదు. చెన్నై నగరానికి 4 గంటల సమయం , బెంగుళూరుకు 6 గంటల సమయం పట్టే నగరం తిరుపతి. ప్రకృతి వైపరీత్యాలకు నిత్యం గురి అవుతున్న నగరం చెన్నై.
ఫలితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ నేడు ఐటి రంగంలో వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇక్కడ నుంచి చేస్తారు. అందుకు అనువైన ప్రాంతం తిరుపతిగా ఐటి సంస్థలు గుర్తించిన నేపథ్యంలో  ప్రభుత్వం చేయాలసింది కేవలం తగిన ఏర్పాట్లు.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం , విజయవంతమైన శ్రీసిటీ, ఆధ్యాత్మిక నిలయంగా శ్రీవారి ఆలయం ఉండి మహానగరంగా అభివృద్ధి చెందడంతోబాటు రాష్ట్రానికి ఉపాధి, ఆదాయ వనరుగా మారుతుంది.
ఇప్పటికే ఉక్కు నగరంగా పేరుగాంచింది విశాఖపట్నం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వాలు చేయాలసింది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అలా విశాఖపట్నం , తిరుపతి మహానగరాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నా చంద్రబాబు మాత్రం కొత్తగా అమరావతిని మహానగరంగా చేయడానికి మొగ్గుచూపుతున్నారు. హైదరాబాదు తరహా అభివృద్ధి రాష్ట్ర విభజనకు దారితీసింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం ఎప్పుడు ప్రమాదమే అన్న వాస్తవాన్ని చంద్రబాబు గారు గుర్తించాలి.
అమరావతితో బాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహానగరాలను నిర్మిస్తామని చంద్రబాబు చెపుతున్నారు. వినడానికి బాగున్నా అది జరగని పని. 13 జిల్లాలు 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో ఎన్ని మహానగరాలు ఉంటాయి. ఒకటో రెండో అది అందుబాటులో ఉన్న విశాఖపట్నం , తిరుపతి అనువైన నగరాలు. ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త మహానగరం అసాధ్యం. బలవంతంగా నిర్మించాలని చూస్తే అది తిరుపతి , విశాఖ అభివృద్ధికి ఆటంకంగా మారి ఆంద్రప్రదేశ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. అనుభావాలు నేర్పుతున్న వాస్తవాలను గమనించి నూతన ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)