వేమన జయంతి ని ప్రభుత్వం నిర్వహించాలి

వేమన పద్యం ఒకటైనా నేర్చుకోని తెలుగువారుండరు. తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలుకూడా ప్రజల నాలుకలపై నిలిచే ఉంటాయి. కాస్తా అటు ఇటు పదహేడవ శతాబ్దంలో తెలుగు నేలపై నడయాడిన వేమన తెలుగు సాహిత్యానికి ఒక కొండగుర్తుగా ఉంటారు. భాషలో, భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనది. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన కోరుకున్నారు. తర్వాత అనేక తరాల కవులకు మార్గదర్శకంగా నిలిచారు.

కర్ణాటక ప్రాంతంలో వందేళ్ళ నాడే కట్టమంచి రామలింగారెడ్డి తదితరుల ప్రోత్సాహంతో వేమన జయంతిని జనవరి 19 వ తేదిన నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అక్కడి ప్రజల ఆకాంక్షల గుర్తించి కర్ణాటక రాష్ట్రప్రభుత్వం 22 డిసెంబరు 2017 న వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. తాలుకా స్థాయిలో రూ. 25,000, జిల్లా స్థాయిలో రూ.50,000, రాష్ట్ర స్థాయిలో రూ.10 లక్షలు మొత్తం అరవైతొమ్మిది లక్షలు కేటాయించింది. అన్ని ప్రభుత్వ శాఖలు సంయుక్తగా ఇందులో భాగస్వామ్యులవుతారు.

ఆంధ్రప్రదేశ్ లోను సాంస్కృతిక శాఖ వేమన జయంతిని నిర్వహించాలని గత సంవత్సరం సెప్టెంబరు నెలన వేమన సంఘాలు,అభిమానులు కోరారు. వేమన సమాధి ప్రాంతమైన కటారుపల్లి గ్రామం కదిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గం అప్పటి యం.యల్.ఏ అత్తార్ చాంద్ భాష వేమన జయంతి విషయమై 10 సెప్టెంబరు 2019 న అసెంబ్లీలో ప్రశ్నించారు. ప్రశ్న పూర్తిగా అడిగే అవకాశం కూడా సభలో సభలో లేకపోయింది. సమాధానం కూడా లేదు. ఆ తర్వాత సాంస్కృతికశాఖ మంత్రి, సంబంధిత ఆధికారులను కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ విషయమై వేమన సంఘాలు సంప్రదించినా స్పందన లేదు. సాంస్కృతిక శాఖ కోట్లకు కోట్లు వేరు వేరు సాహిత్య, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు చేసింది. అనేకమంది కవుల కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించింది. కనీసం వేమనపై ఒక సదస్సు నిర్వహించమని కోరినా పట్టించుకొలేదు.

*ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా తక్షణం స్పందించి ఈ సంవత్సరం నుండే జనవరి 19న సాంస్కృతిక శాఖ పక్షాన వేమన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం.

*వేమన సమాధి ప్రాంతం కఠారుపల్లిలో పర్యాటకశాఖకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా అర్దంతరంగా వదిలేసింది. పూర్తి స్థాయిలో సమాధి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి.

*వేమన సాహిత్యం పై అధ్యయనానికి,విస్తరణకు ఒక సంస్థను, గ్రంథాలయాన్ని నెలకొల్పాలి.

*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కేంద్రసాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం(రి). అనంతపురము జిల్లా.

Copy to: గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రి మరియు సంచాలకులు సాంస్కృతిక శాఖ.