Home Features ఆ రోజుల్లో అనంతపురం ఇలా ఉండేది, సరదాగా, సిల్లీగా, సీరియస్ గా…..

ఆ రోజుల్లో అనంతపురం ఇలా ఉండేది, సరదాగా, సిల్లీగా, సీరియస్ గా…..

170
0
(బి వి మూర్తి)
ఏడాదికో సారి అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగానో గళ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోనో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా అందులో ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఓటిఆర్ఐ….తైల పరిశోధనా సంస్థ) వారి స్టాల్ ఒకటి ఉంటుండేది. చింతపిచ్చలు మొదలుకొని ఆవగింజలు, జిలకర, యాలకులు, కానుగ, వేప గింజలు వగైరాల నుంచి తీసే నూనెలూ, వాటి ఉపయోగాల తాలూకు తమ పరిశోధనా ఫలితాలను ఓటిఆర్ఐ సిబ్బంది ఆ స్టాల్ లో ప్రదర్శించి సందర్శకులకు వివరించి చెప్పేవాళ్లు.అలరించే వాళ్లు.
జాతీయ స్థాయిలో సుప్రసిద్ధమైన ఆ మహాసంస్థకు డైరెక్టర్ గా పని చేసిన డాక్టరు సర్దేశాయి తిరుమల రావు వృత్తి రీత్యా శాస్త్రవేత్త అయినప్పటికీ గొప్ప అభిరుచీ, అభినివేశం గల మంచి సాహితీవేత్త. ఓటిఆర్ఐకి లాగే ఆయనక్కూడా తన ఉనికి, గుర్తింపు గురించి పెద్దగా పట్టింపు ఉండేది కాదు. పట్టణంలో జరిగే అన్ని సాహిత్య సభలకు ఆయన క్రమం తప్పుకుండా హాజరయ్యేవారు. గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వెళిపోతుండే వారు. మహా మొహమాటస్థులు.
లలితకళా పరిషత్ లో ఓ సాహిత్య సభ జరుగుతుండగా “ఇదిగో ఆయనే సర్దేశాయి తిరుమలరావు అంటే’’ అంటూ మిత్రుడు శివరామ్ (రెడ్డి) దూరం నుంచి చూపించే దాకా మాకూ తెలియదు. `కన్యాశుల్క నాటక కళ’ అనే అద్భుత విమర్శ గ్రంథం రాసిన మహానుభావుడీయనే అని తెలిసి ఉక్కిరి బిక్కిరయ్యాం. కన్యాశుల్కం గురించి చీమ చిటుక్కుమన్నా మాకు చచ్చేంత ఇష్టం. “ఇప్పుడొద్దు. ఇక్కడ మాట్లాడిస్తే ఆయన ఇబ్బంది పడతాడు. రేపు వాళ్లింటికి పోదాం,’’ అని చెప్పి శివరాం ఒప్పించాడు.
సాయినగర్ లో ఓ సందుగొందిలోని ఆయన ఇంటికి శివరామ్, ఇంకో నలుగురైదుగురు వెళ్లి తృప్తిగా మాట్లాడి వచ్చాం. అటుతర్వాత మా మిత్ర బృందం నిర్వహించిన ఓ సాహిత్య సభకు ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో అభిప్రాయాలు పంచుకున్నాం.
తెలుగు ఎంఏ విద్యార్థుల్లో నేనూ, స్వరూప్ (కృష్ణమూర్తి) మాత్రమే టౌన్ లోని ఈ సాహిత్య మిత్ర బృందంలో యాక్టివ్ గా ఉండేవాళ్లం. మేమిద్దరం, రాయుడు, బోస్, గోవాడ రఘుబాబు దాదాపు ప్రతిరోజూ కలిసే వాళ్లం. ఇక శివరామ్ సరేసరి. ఆయన ఒప్పుకునేవాడు కాదుగానీ మా యువ మిత్రబృందాన్ని కలిపి కట్టే సూత్రం ఆయనే. శ్రీరాములు, దేవపుత్ర, నారాయణస్వామి అప్పుడప్పుడూ కలిసేవాళ్లు. రంగుల పక్షి కవితా సంకలనం అచ్చయ్యింది కాబట్టి ఆ సరికే రంగుల పక్షి శ్రీరాములు టౌన్ లెవెల్లో సుప్రతిష్టిత కవే. మిగతా వాళ్లందరూ దిక్కు లేని పక్షులే. చిలుకూరి దేవపుత్ర కథేదీ అప్పటికింకా అచ్చయినట్టు లేదు. బద్వేలు రమేష్, తూములూరు కార్తికేయ శర్మలవి తలా ఒకటి రెండు కథలు పత్రికల్లో వచ్చినట్టున్నాయి.
మన అనంతపురంలో జరిగే ఏ సాహిత్య సమావేశమైనా చెప్పేవాడికి వినేవాడు లోకువన్నట్టు ఏకపక్షంగా ఉండటానికి వీల్లేదనీ, సభికులకు కూడా మాట్లాడే హక్కు నిచ్చే ఓపెన్ సెషన్ ఉండి తీరాలనే కొత్త వరవడిని అప్పట్లో గట్టిగా అమలు చేసేవాళ్లం. ఈ ఓపెన్ సెషన్ బృందానికి కేంద్ర బిందువు శివరామ్ (రెడ్డి). మరీ అంత తెల్లగా ఉండాలన్న నియమమంటూ ఏమీ లేని తెల్ల అడ్డపంచ, పైన తెల్ల చొక్కా వేసుకుని మా లాంటి ఐదారుగురు విద్యార్థి, నిరుద్యోగి సాహిత్యాభిమానుల్ని వెంటేసుకుని తిరుగుతుండే ఆ సన్నటి పొడుగాటి మనిషి శివరామ్. ఆ రోజుల్లో అనంతపురంలో అదో సరికొత్త చైతన్యం.
స్థానిక రొడ్డకొట్టుడు సాహిత్యోపన్యాసకులకు ఆ రోజుల్లో మేమంటే హడల్.
స్టేజీ మీదున్న ఇద్దరు ముగ్గురు పెద్దమనుషులు పరస్పరం పొగుడుకుని, అక్కడ లేని వారెవరినో కూడా పొగిడి, ఇంకెవరి పైనో పనికి రాని వ్యాఖ్యలు చేసి, నాలుగు ఉబుసుపోక మాటలు, ఐదు బూతు జోకులతో సభను `రంజింప’ జేసి దిగిపోతామంటే శివరామ్ ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. నిలయ విద్వాంసుల సంగతటుంచి బయటి నుంచి వచ్చే దిగ్దంతులైన మహా సాహిత్య విమర్శకులూ, ఉపన్యాసకులైనా సరే, ఒక్క పొల్లుమాట మాట్లాడినా ఎంత మాత్రం సహించేవాడు కాదు. ఎడాపెడా దులిపేసేవాడు. “అసంతృప్తి ఉన్నవాడే మనిషంటే. అసంతృప్తీ, అసహనం అణచుకోవాల్సిన పని లేదు. ప్రశ్నించాలన్నా, షర్టు పట్టుకుని ప్రశ్నించా,’’ లని మమ్మల్ని కూడా ప్రోత్సహించేవాడు.
వాదమంటూ మొదలయ్యాక శివరామ్ ఎంతదూరం వెళ్లడానికైనా సిద్ధమే. సాహిత్య సభలకు వచ్చే ఉపన్యాసకులు తగిన హోం వర్క్ చేయకుండా తన అనుభవం, వాగ్ధాటితో నోటికొచ్చినట్టు మాట్లాడి పారితోషికం పట్టుకుపోతానంటే కుదరదు. సాహిత్యం, సాహిత్యోపన్యాసం, చర్చ చాలా సీరియస్ విషయాలని శివరాం గట్టిగా నమ్మేవాడు.
సాహిత్య సభల ఓపెన్ సెషన్లకు ఓ ఊపూ ఉధృతీ ఇవ్వడం అలవాటై పోయాక, ఇంక ఇట్లా లాభం లేదనుకుని మేమే స్వయంగా సభలు పెట్టడం ఆరంభించాం. లిటరరీ వర్క్ షాప్, పొయెట్రీ వర్క్ షాప్, కథానికల వర్క్ షాప్ అలా నిర్వహించినవే.
ఏ ఒక్క ఇజానికో దాస్యం చెయ్యని ఓపెన్ మైండెడ్ నెస్ ఈ అన్ని కార్యక్రమాలకు అంతస్సూత్రం. ఓ సారి మేం జరిపిన సభలో గొల్లాపిన్ని శేషశాస్త్రికి యాదాటి కాశీపతికి మధ్య మనుధర్మంపై పెద్ద యుద్ధమై పోయింది.
“కొట్లాడుకుంటే కొట్లాడుకోనీ అన్నా. తప్పేముంది. భారతిలో జాబులు రాసి కొట్లాడుకుంటుండ్లా, అట్లే ఇది కూడా. కొట్లాడుకుంటేనే ఏదో ఒక కొత్త సంగతి బైటకొచ్చేది,’’  అనే వాడు శివరామ్.
సాయిబాబా కాలేజ్ లెక్చరర్ ఎస్ నారాయణ, పిజి సెంటర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్లు చిరుమామిళ్ల సుబ్బారావు, రామకృష్ణ వంటి వాళ్లను సభలకు పిలిచి సమీక్షలు చేయించడం, ఉపన్యాసాలిప్పించడంతో సాహితీ జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టించినట్టయింది.
ఎస్వీపురం (అది పిజిసెంటర్ టౌన్ షిప్పు పేరు) తెలుగు డిపార్టుమెంటుది ఉత్త `అకడమిక్’ ఇంటరెస్ట్ అని అప్పట్లో ఓ అభిప్రాయం ఉండేది. చాలినంత పేరు ప్రఖ్యాతులో, డాక్టరేట్ డిగ్రీల ప్రిఫిక్సు సఫిక్సులో ఉన్న మహా సాహితీవేత్తలు రాజ లాంఛనాలు, ఖరీదైన వసతి ఏర్పాట్ల సాక్షిగా పిజి సెంటర్ లోనే సభలు తీరేవారు గానీ సాహిత్యం పట్ల చిత్తశుద్దిగల, సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునే అభిమానుల్ని కలుసుకోవాలనుకునేవారు టౌస్ సమావేశాల వైపే మొగ్గు చూపేవారు. కవికాకి కోగిర జై సీతారామ్ నాకు తెలిసి ఒక్కసారైనా ఎస్వీపురం సాహిత్యపీఠం గడప తొక్కలేదు. అయితే ఆ ఐదారేళ్లలో సాహిత్యలోకాన్ని ఆయన ఓ ఊపు ఊపిన సంగతిని ఎవరైనా కాదనగలరా? కవి శివారెడ్డికి సైతం టౌన్ మిత్రబృందంతోనే సాన్నిహిత్యం ఎక్కువ.
పార్ట్ టైమ్ లెక్చరర్ గా ఉద్యోగానికై పెనుకొండకు, అటు తర్వాత జర్నలిస్టు ఉద్యోగానికై హైదరాబాద్ కు వెళ్లిపోయాక అనంతపురం సాహితీ మిత్రులతో సంబంధాలు దాదాపుగా తెరమరుగై పోయాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోయాయి.

(బి వి మూర్తి సీనియర్ జర్నలిస్టు, కాళ్లు బెంగుళూరులో ఉంటాయి. కళ్లు అనంతపురంలో తిరుగుతుంటాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో చాలా కాలం పనిచేశారు. ఇపుడు ఫ్రీలాన్సర్. సోర్ట్స్ రాయడంలో దిట్ట.  సాహిత్యంలో చాలా ప్రవేశం ఉంది. సరదాగా రాయడంలో,కబుర్లాడటంలో ఆయనకు ఆయనే సాటి)