డిష్ వాషర్ మా యింట్లో చివరికిలా ఉపయోగపడింది…

(అహ్మద్ షరీఫ్)
మనకు ఇష్టం లేనివీ, అనవసరమైనవీ,  అయిన వస్తువుల్ని వదిలించుకోవడానికి మనం పడే శ్రమ,  మనం ఇష్టపడే, ప్రేమించే వస్తువుల వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించకుండా చేస్తుంది.
“ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం” పేరు తో 1993 లో ఓ కామెడీ (నిజంగానే) సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరో నరేష్. హీరోయిన్ వాణీ విశ్వనాథ్.
ఈ సినిమాలో తమాషా కాన్సెప్టులూ,  తమాషా సన్నివేశాలూ, వున్నాయి. సినిమా మొదలవడమే హీరో గిన్నిస్ బుక్ లో ఎలాగైనా (?) చోటు సంపాదించాలనే తపనతో పడే పాట్లతో మొదలవుతుంది. దీనికి చిటికెన వేలిమీద ఇటుకను నిలబెట్టటం, చిన్న గొడుగు తీసుకుని (పారచూట్ లా) పైనుంచి దూకడం  నరేష్ ఎంచుకున్న కార్యాలు.
ఈ సినిమాలోని పాత్రలు విచిత్రంగా వుంటాయి. ఉదాహరణకి గుండు హనుమంతరావు కి విపరీత మైన మతిమరపు (కొంచం ఎక్కువైందనుకోండి), ఇన్స్టాల్ మెంట్లలో ఇంటికి కావల్సిన వస్తువులన్నీ (టీ వీ, ఫ్రిజ్ వగైరాలన్నమాట). సమ కూర్చుకున్న తరువాతనే పెళ్లి చేసుకోవాలనుకుని వయసు మీరిపోతున్న ధర్మ వరపు సుబ్రమణ్యం. ఇలా…..
ఈ సినిమాలో ముఖ్య పాత్రాధారులంతా బ్రహ్మానందానికున్న ఓ బిల్డింగులో ని ఫ్లాట్ల లో అద్దెకుంటారన్నమాట. సో ఓనరు హోదాలో బ్రహ్మానందం వీళ్లందరి మీద అజమాయిషీ చలా యిస్తూ వుంటాడు. ఏం మాట్లాడితే ఇల్లు ఖాళీ చేయమంటాడో అని అందరూ అతడికి భయపడుతూ వుంటారు. ఈ ఓనర్ షిప్ ను అదను గా తీసుకుని, అతడు, ఇతరుల ఫ్లాట్లలో కి స్వేచ్చగా రావడం పోవడం సాగిస్తూ వుంటాడు.  అంతే కాదు , సదరు ఫ్లాట్లలో ఏది పడితే అది, ఎక్కడ దొరికితే అక్కడ సామాన్లు (టూత్ బ్రష్షులూ, పేస్టులూ, టిఫిన్లూ, చివరికి బేధి మాత్రలూ వగైరాలన్నమాట) స్వాహా చేస్తూ వుంటాడు.
ఇది ఇలా వుండగా, ఇతడి తో విసిగిపోయిన ఫ్లాట్ల టెనెంట్లు ఒక ప్లాను వేసి, ఓ పాత రోడ్డు రోలరు ను అతడికి బహుమతి గా ఇస్తారు (అంటగడతారు)
ఆ బహుమతిని చూసి మురిసి పోతాడు బ్రహ్మానందం, ముందుంది ముసళ్ళ పండగ అని తెలీక.  ఆ రోడ్డు రోలరు సతాయింపుల్ని ఇంపుగా చిత్రించాడు ఈ చిత్ర దర్శకుడు కె వాసు. బ్రహ్మానందానికి ఇది పనికి రాదు, దీన్ని ఎక్కడ వుంచాలో తెలీదు. పార్కింగు ప్రాబ్లం తో సతమతమవుతూ, మున్సిపాలిటీ జరిమానాల బెడదతో దీన్ని అటూ ఇటూ కదులుస్తూ, కదల్చడానికి మాటి మాటికీ రిపేర్లు చేయించుకుంటూ, డబ్బునూ  మనశ్శాంతిని పోగొట్టుకుని సాఫీ గా సాగి పోతున్న జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడు. చివరికి ఆ రోడ్డు రోలర్ అతడి జీవితం లో ఓ నైట్ మేర్ అయిపోతుంది. ఇదీ కథ.
ఇప్పుడింత హఠాత్తుగా ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రోడ్డు రోలరు సమస్య లాంటిదే ఈ మధ్య నాకొక సమస్య వచ్చి పడింది.
నిజానికి ఇలాంటి రోడ్డు రోలర్లు చాలా మది ఇళ్లలో వుంటాయి. అంటే మనం వుపయోగించని (వుపయోగించలేని) వస్తువులు ఎన్నో మన ఇళ్లలో వుంటాయి. అవి వాటి వునికి ద్వారా మనకు అధికృత (extra) సమస్యల్ని సృస్తిస్తూ వుంటాయి.
ఉదాహరణకి ఒక ట్రెడ్ మిల్ (వాకర్). ఇది రాత్రికి రాత్రే బరువును తగ్గించేసి ఆరోగ్యాన్ని పెంపోందిస్తుంది అని  వుత్సాహపడి మనం కొన్నది. అయినా దీన్నిమరీ తీసి పడెయాల్సిన పని లేదనుకోండి, ఎందుకంటే ఇది బట్టలు ఆరేయడానికి పనికి వస్తుంది. అలాగే ఓ కుట్టు మిషను (దీని మీద పుస్తకాలూ, డబ్బాలూ, కొన్ని బట్టలూ)  ఉంచుకోవచ్చు.
కొరోనా సృష్టించిన అనేక సమస్యల్లో పని మనిషి సమస్య కూడా ఒకటి. దీన్ని అధిగమించే ప్రయత్నం లో నేనొక డిష్ వాషర్ కొనాలనుకున్నాను. నేను కొనాలని నిర్ణయించుకున్న వెంటనే అది మార్కెట్లో నుంచి మాయమై పోయింది. ప్రతి రోజూ కొంత సమయం కేటాయించి మార్కెట్ రిసెర్చ్ చేసి చివరికి ఓ కంపెనీ డిష్ వాషర్ ని (రూ. 45000) పట్టుకుని ఆర్డర్ చేసాను.
ఆర్డరు చేసిన తరువాత, డిష్ వాషర్ కంపెనీ కోరినట్లు ఎలెక్ట్రిక్ వైరింగూ, కొళాయి, ప్లంబింగ్ పని చేయించడానికి దాదాపు రూ. 5000 ఖర్చు చేసాను. చివరికి మెషీను వచ్చింది.  మెషీను ఇన్ స్టాల్ చేయడానికి ముందు దాని స్టాండు (ఇది కంపల్సరీ అట, రూ. 2500), ఆ మెషీనులో వాడే డిటర్జెంట్లూ, షైను లిక్విడ్లూ, ఇంకా కొన్ని పేర్లు తెలియని పదార్థాలు(రూ. 1000, ఇవి ప్రతి నెలా కొనాలిట)  కొనాల్సి వచ్చాయి.
ఎందుకైనా మంచిది అడిషనల్ ఏ.ఎం.సీ (రూ. 2500) తీసుకో మన్నారు. తీసుకున్నాం ఓకే! మరి డిష్ వాషర్ వాడే స్థాయి కి ఎదిగిన వాళ్లకి ఆమాత్రం ఖర్చు భరించే శక్తి వుండాలి కదా? అనుకున్నాను.
చివరికి డెమో మొదలయింది. డెమో ఇచ్చే వ్యక్తి ఒక గిన్నె ఇవ్వమని అడిగాడు. మా ఆవిడ అప్పుడే భొంచేసి పెట్టిన ఓ ఎంగిలి పళ్లెం అందించింది. ఆ పళ్లెం చూసి ఆ వ్యక్తి “మెషీన్లో పెట్టే  గిన్నెలు ఇలా వుండరాదు. వాటిని శుభ్రంగా కడిగి పెట్టాలి”  అన్నాడు.
గిన్నెలను ఓ మారు నీటితో శుభ్ర పరిచి మెషీన్లో పెట్టాలి(ట) . సరే మా ఆవిడ ఆ ప్లేటు వెనక్కి తీసుకుని ఓ కడాయి ఇవ్వ బోయింది. అతను ఆ కడాయి కేసి చూసి “దీన్లో నాన్ స్టిక్ వస్తువులు పెట్ట రాదు” అన్నాడు.
మా ఆవిడ ఆ కడాయి వెనక్కి తీసుకుని ఓ అల్యూమినియం బౌల్ ఇవ్వబోయింది. ఆ వ్యక్తి నాకేసి రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీలు తినే వాణ్ణి కారులో వెళుతున్న వాడు నల్ల కళ్లద్దాల్లోనించి చూసినట్లు చూశాడు. తరువాత ” దీన్లో స్టెయిన్ లెస్ స్టీలు గిన్నెలే వుంచాలి అల్యూమినియం గిన్నెలు వుంచరాదు” అన్నాడు.
ఆ తరువాత ఏం జరిగింది?  సదరు మెషీన్లో పెట్టే క్వాలిటీ గిన్నెలు లేక,ఇప్పటికి అయిన ఖర్చును దృష్టిలో వుంచుకుని, ప్రత్యేకంగా కొత్త గిన్నెలు కొనే స్థోమత లేక, కరెంటు ఖర్చు దృష్ట్యా ఒక సారికి రెండు, మూడు గిన్నెల్ని మాత్రమే  డిష్ వాష్ చేయించలేక,  అవసరం వల్ల  తగినన్ని గిన్నెలు  సమకూరేంత వరకూ ఆగలేక,   ఇప్పుడా మెషీను మీద పోపు డబ్బాలూ, బిస్కెట్ పొట్లాలూ, సబ్బులూ, షాంపూ బాటిల్స్   వుంచడానికి వాడుకుంటున్నాము.

(అహ్మద్ షరీఫ్ , ప్రాజక్టు మేనేజ్ మెంట్ కోచ్.రచయిత, సినిమా విశ్లేషకుడు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *