Home Features అమితాబ్ అన్నికష్టాల్లోంచి ఎలా గట్టెక్కాడు?, పాజిటివ్ థింకింగే రహస్యం

అమితాబ్ అన్నికష్టాల్లోంచి ఎలా గట్టెక్కాడు?, పాజిటివ్ థింకింగే రహస్యం

141
0
SHARE
(CS Saleem Basha)
విమర్శలు,అవమానాలు, జీవితంలో ఒక భాగం అన్నది పాజిటివ్ థింకర్స్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే ఎవరైనా విమర్శించినప్పుడు వాళ్ల స్పందన పాజిటివ్ గా ఉంటుంది . అవమానాలను, తిరస్కారాలను హుందాగా స్వీకరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాజిటివ్ థింకర్స్ proactive(సానుకూల్యముగా) స్పందిస్తే, నెగిటివిటీ ఉన్నవారు reactive(ప్రతిక్రియాశీలంగా) గా స్పందిస్తారు.
సినీరంగంలో ఈ విషయంలో మనకెన్నో ఉదాహరణలు కనబడతాయి. అమితాబ్ గురించి తెలియనివారుండరు. అతని జీవితం పాజిటివ్ థింకింగ్ కి ఒక చక్కటి ఉదాహరణ. కెరీర్ మొదట్లో అమితాబ్ ఎన్నోసార్లు అవమానించ బడ్డాడు. తిరస్కరించబడ్డాడు.. కానీ అన్ని తట్టుకుని నిలబడ్డాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. అయినా అన్నింటినీ అధిగమించి ఉన్నత స్థాయికి (బిగ్ బి) చేరడానికి తండ్రి నుంచి, తల్లి నుంచి అంది పుచ్చుకున్న సానుకూల దృక్పథమే కారణం! 1969 లో వచ్చిన తన మొదటి సినిమా “సాత్ హిందుస్తానీ” లో ఏడు మంది లో ఒకడిగా చిన్న పాత్రలో నటించిన అమితాబ్ కోటికొక్కడు గా మారడం వెనక సినిమా కష్టాలే ఉన్నాయి!
అంతకుముందు కోల్కతాలో ఒక కంపెనీలో నాలుగంకెల జీతంతో చక్కటి ఉద్యోగం ఉండేది. దాన్ని వదిలి తన కలను సాధించుకోవడానికి సినిమా రంగంలో అడుగు పెట్టాడు. మొదట్లో ఎన్నో అవమానాలు. సన్నగా పొడుగ్గా జెండా కర్ర కి బట్టలు తొడిగి నట్టు ఉన్నాడని, డబ్బాలో గులకరాళ్లు వేసి ఆడిస్తే వచ్చే గర గర లాడే గొంతు ( అదే గొంతు కావాలని ” లగాన్” సినిమా లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ గా వాడటం విశేషం. చిత్రమేమిటంటే అమితాబ్ అరంగ్రేటం మృణాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన” భువన్ షోం “ అనే బెంగాలీ చిత్రంలో వాయిస్ ఓవర్ ఇవ్వడం తో మొదలైంది!!) అని రకరకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. 30 ఏళ్ల వయసులో (1971) ఒక వర్ధమాన ఫ్లాప్ నటుడిగా గా పేరు తెచ్చుకున్నాడు. సలీం జావేద్ రాసిన ” జంజీర్” సినిమాతో తారాపథంలో కి దూసుకెళ్లి ” యాంగ్రీ యంగ్ మాన్” గా కొన్నేళ్లపాటు జనాలను ఉర్రూతలూగించాడు!
అంతటితో కష్టాల కథ అయిపోలేదు! 1982 ” కూలి’ సినిమా షూటింగ్ లో గాయపడి మరణం అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చాడు. మళ్లీ సినిమాల్లో వచ్చినప్పటికీ ” మయస్తీనియ గ్రేవిస్” అనే ఒక (కండరాల బలహీనత) జబ్బు బారినపడి సినిమా లోనుంచి విరమించాలని అనుకున్నాడు. దరిమిలా పాలిటిక్స్ లోకి వెళ్లి సరిపోక వెనక్కు వచ్చాడు. తర్వాత షహన్ షా సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంతటితో ఆగితే బాగుండేది. ABCL అనే సంస్థను ప్రారంభించి, ఒకటి రెండు సినిమాలు తీసినప్పటికీ, నష్టాల్లోకి వెళ్ళిపోయాడు. దాంతో పెద్ద దెబ్బ తగిలింది. అప్పులు తీర్చడానికి చివరికి అత్యంత ఇష్టమైన ఇల్లు ” ప్రతీక్ష” అమ్మే(తర్వాత తాకట్టు పెట్టానని చెప్పాడు) పరిస్థితి కూడా వచ్చింది. మళ్లీ సినిమాల్లో వేసినా పెద్దగా లాభం లేకపోయింది. 2000 సంవత్సరంలో వచ్చిన ” కౌన్ బనేగా కరోడ్ పతి” తర్వాత మరోసారి విజయపథంలో దూసు కెళ్ళాడు.
ఇంత వివరంగా అమితాబ్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. పాజిటివ్ దృక్పథానికి ఉండవలసిన పట్టుదల, ఆత్మవిశ్వాసం, సహనం, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, నైతిక విలువలు, ముఖ్యంగా పాలన వంటి లక్షణాలన్నీ అమితాబ్ కు ఉండడం వల్ల. ( ఇది రాసేనాటికి అమితాబ్ తనకు, అభిషేక్ కు ” కోవిడ్” పాజిటివ్ గా వచ్చిందని స్వయంగా ప్రకటించారు. కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్యలుకూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అంటేకుటుంబం మొత్తం కోవిడ్ పాజిటివ్ ఎంత టెన్షన్ ఉండాలి. ఆయనేం చేశారు. నిబర్బంగా,  తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థించాడు. అతని విలువలకు, సామాజిక బాధ్యతకు అది నిదర్శనం.)
మహానటి సావిత్రి నటనాకౌశలం గురించి తెలియనివారుండరు (ఈ తరం పిల్లలు తప్ప). ఆ స్థాయిలో ఉన్న సావిత్రి సినీ రంగంలో అడుగు పెట్టిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వాటిని పాజిటివ్ గా తీసుకోకుండా ఉంటే ఒక గొప్ప నటి తెలుగు సినిమా రంగానికి దొరికేది కాదు. మొదట్లో నటనకు ఏ మాత్రం పనికిరావు అని దిగ్గజ దర్శకుల తిరస్కారానికి గురైన సావిత్రి మహానటిగా పేరు తెచ్చుకోవడానికి కారణం పాజిటివ్ థింకింగ్ తో ముందుకు వెళ్ళడమే. పాతకాలం నాటి కాంచనమాల కూడా సినిమాకి పనికిరాని మొఖం అని గూడవల్లి రామబ్రహ్మం ఎద్దేవా చేశాడు. తర్వాత మళ్లీ ఆయనే “మాలపిల్ల” సినిమాలో హీరోయిన్ ని చేశాడు! ఇలా చెబుతూ పోతే సినిమారంగంలో ఉన్న పాజిటివ్ థింకర్స్ గురించి రాయడానికి ఈ వ్యాసం సరిపోదు.
అబ్రహం లింకన్ పరిచయం అవసరం లేని పేరు. 21 ఏళ్ల వయసులో(1831) వ్యాపారంలో దివాలా తో మొదలు పెట్టిన వైఫల్యాల జాబితా అలా అలా 30 ఏళ్లు సాగింది. 1856 ఉపాధ్యక్ష పదవికి ఓటమి, 1858 లో సెనెట్ కి కూడా ఎన్నిక కాని పరిస్థితి. కానీ 1860 లో ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం! దీంట్లో పెద్ద రహస్యమేమీ లేదు ” Winners never quit and quitters never win” అన్నది అబ్రహం లింకన్ సూత్రం. పాజిటివ్ థింకింగ్ లో భాగమైన సహనానికి, పట్టుదలకి ఇంతకన్నా నిదర్శనం అవసరమా!
Saleem Basha CS

(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)