తిరుమ‌ల‌లో అమెరికా జంట పెళ్ళి ముచ్చ‌ట్లు (తిరుపతి జ్ఞాప‌కాలు-29)

(రాఘ‌వ‌శ‌ర్మ‌)

తిరుమ‌ల‌లో ఒక క్రైస్త‌వ జంట‌ పెళ్ళి చాలా ముచ్చ‌ట‌గా జ‌రిగింది. వేద మంత్రాల మధ్య చాలా మురిపెంగా ఆ అమెరికా జంట పెళ్ళి జ‌రిపించుకున్నారు. ప్ర‌పంచ వాణిజ్య‌స‌ముదాయంపై అల్ ఖైదా దాడి వల్ల ఆగినా ఈ పెళ్ళి ఆరు నెల‌ల‌ ఆలస్యంగా జ‌రిగింది.

రెండు ద‌శాబ్దాల క్రితంనాటి మాట ఇది.

అది 2002 జనవరి. వర్షం పడుతున్నా రెయిన్ కోట్ వేసుకుని స్కూటర్లో తిరుమల వెళ్ళాను. ఆ రోజు శ‌నివారం ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌వుతోంది.

శంక‌ర‌మ‌ఠంలో భాజాబజంత్రీలు మోగుతున్నాయి. ల‌య‌బ‌ద్ద‌మైన శ‌బ్దాల్లో వేద‌మంత్రాలు క‌లిసిపోతున్నాయి. అంద‌రి ముఖాల్లో న‌వ్వుల పువ్వులు విరిశాయి. క‌ళ‌క‌ళ‌లాడుతున్న క‌ల్యాణ వేదిక‌పై పెళ్ళిపీట‌ల‌మీద ఎదురెదురుగా ఎడ్విన్, మేరీ బెత్‌లు కూర్చున్నారు.వారి మ‌ధ్య‌లో తెల్ల‌ని తెర‌. తెర‌కు ఆవ‌ల ఆమె సిగ్గుతో త‌ల‌దించుకుని ఉంది.

ఆ క్ష‌ణాల కోస‌మే అతను ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నాడు. తెర ‌కింద నుంచి అత‌ని తెల్ల‌ని చేతులు జీల‌క‌ర్ర‌, బెల్లాన్ని ఆమె నెత్తిన‌ పెట్టాయి. ఆమె కూడా అత‌ని నెత్తిన పెట్టింది. కాస్త ఎత్తిన తెర‌కింద నుంచి ఓర కంటితో ఒక్క‌సారి చూసింది. ఇదివ‌ర‌లో అత‌న్ని ఎప్పుడూ చూడ‌న‌ట్టు, ఆనందంలో ఆమె త‌ల‌ మున‌క‌లై పోయింది. అత‌ను కూడా ఆమెను చూసి ఉబ్బిత‌బ్బిబ్బైపోయాడు.

ఇంత‌లో తెర‌ తొల‌గింది. ఆమె సిగ్గుతో త‌ల‌దించుకుంది. ఆమె మెడ‌లో తాళి క‌ట్టాడు. డమడమ డమడమ అంటూ మృదంగం మోగుతోంది. అంతా అక్షిత‌లు వేశారు.

ఎడ్విన్ మేరీ బెత్‌ల ప‌ద‌హారేళ్ళ‌ ఏకైక కుమారుడు ఎడ్లి కెమెరాతో క్లిక్ మ‌నిపించాడు. త‌న త‌ల్లిదండ్రుల పెళ్ళిలోని ప్ర‌తి దృశ్యాన్నీ అత‌ను కెమెరాలో బంధించాడు. ఎడ్విన్ మేరీబెత్‌ల రెండేళ్ళ క‌ల ఆ రోజు అలా సాకార‌మైంది.

అమెరికాలోని క్యాన్న‌న్ సిటీలో ఉన్న‌ ప్ర‌జారోగ్య శాఖ‌లో ఎడ్విన్‌, మేరీబెత్‌లు ప‌ని చేస్తున్నారు. స్ప్రింగ్ ఫీల్డ్‌లో స్థిర‌ప‌డిన వారి మిత్రుడు డాక్ట‌ర్ రామ‌య్య కుమారుడి వివాహం అంత‌కు రెండేళ్ళ ముందు తిరుమ‌ల‌లో జరిగింది. ఆ పెళ్ళికి ఎడ్విన్ మేరీబెత్‌లు హాజ‌ర‌య్యారు.

ఆ పెళ్ళి చూసి ఆ అమెరికా జంట చాలా ముచ్చ‌ట‌ ప‌డిపోయింది. ‘ మేం కూడా మ‌ళ్ళీ అలా పెళ్ళి చేసుకోవాలి ‘ అని రామ‌య్య‌తో అన్నారు. ‘తిరుమ‌లేశుని స‌న్నిధిలోనే హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్ళి చేసుకోవాల‌’ ని కోరారు. ఎడ్విన్ మేరీల‌కు ఇంతకు ముందే పెళ్ళి అయిపోయింది. ప‌జ్జెనిమిదేళ్ళ‌ కొడుకు కూడా ఉన్నాడు.

‘ఈ వ‌య‌సులో ఈ పిచ్చేమిటి? ‘ అనుకుని రామ‌య్య ఆశ్చ‌ర్య‌పోయారు. ఏం చేస్తాం వెర్రి వేయిర‌కాలు. అందులో ఇదొక‌టిఅని. ఎడ్విన్ మేరీ బెత్‌లు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా కూర్చున్నారు. చివ‌రికి స‌రేన‌ని, అధికారుల‌తో మాట్లాడి, 2001 సెప్టెంబ‌ర్‌లో పెళ్ళి చేయాల‌ని ఏర్పాట్లు చేశారు.

‘వినాయ‌కుడి పెళ్లికి వేయి విఘ్నాలు’ అన్న‌ట్టు వీరి పెళ్లికి కూడా ఆటంకం ఏర్ప‌డింది. న్యూయార్క్‌లోని ప్ర‌ప‌పంచ వాణిజ్య‌ స‌ముదాయంపై 2001 సెప్టెంబర్ 1 వ తేదీన ఆల్‌ఖాయిదా ఉగ్ర‌వాదులు దాడి చేసి పెద్ద విధ్వంసాన్ని సృష్టించారు.

దాంతో ఎడ్విన్ మేరీబెత్‌ల పెళ్ళి ఆరు నెల‌లు వాయిదా ప‌డింది.ఎట్ట‌కేల‌కు 2002 జ‌న‌వ‌రిలో పెళ్ళి జ‌రిపించాల‌ని నిశ్చ‌యించారు.

పెళ్ళి కొడుకు ఎడ్విన్ పక్కన కన్యా దాతలుగా కూర్చున్న డాక్టర్ రామయ్య దంపతులు.

పెళ్ళి కుమార్తె త‌ల్లిదండ్రులుగా డాక్ట‌ర్ రామ‌య్య దంప‌తులు పెళ్ళి పీట‌ల‌ పైన కూర్చున్నారు. ప్ర‌తి అంశాన్నీ ఎడ్విన్ మేరీల‌కు రామ‌య్య ఇంగ్లీషులో చ‌క్క‌గా వివ‌రించారు. ఆరోజు ఉద‌యం ప‌సుపు, ప‌చ్చ‌ క‌ర్పూరంతో ఇద్ద‌రి చేత మంగ‌ళ స్నానాలు చేయించారు. ఒక ర‌కంగా అది శానిటైజేష‌న్.ఆరోజు ఉద‌యం ఎడ్విన్ చేత స్నాత‌కం చేయించారు. స్నాత‌కం చేయిస్తే పెళ్ళి పూర్త‌య్యేవ‌ర‌కు ఏరుదాట‌కూడ‌దు. ఎడ్విన్‌, మేరీబెత్‌ల తెల్ల‌ని కాళ్ళ‌కు ఎర్ర‌ని పారాణి పెట్టారు. వారి నుదుట‌న క‌ల్యాణ తిల‌కం దిద్దారు.

ఎడ్విన్ కు తెల్ల‌ని ప‌ట్టుపంచె క‌ట్టించారు. తెల్లని ప‌ట్టు లాల్చీతొడిగారు. త‌ల‌కు జరీ అంచు తెల్లని ప‌ట్టుపాగా క‌ట్టారు. మేరీ బెత్‌కు ఎర్ర‌ని జ‌రీ అంచుగ‌ల తెల్ల‌ని ప‌ట్టుచీర క‌ట్టించారు.ఎర్ర‌ని జ‌రీ అంచు జాకెట్ తొడిగారు.

ఎడ్విన్ కుడిబుగ్గ‌న‌, మేరీబెత్‌కు ఎడ‌మ బుగ్గ‌న కాటుక‌తో దిష్టి చుక్క పెట్టారు. మేరీబెత్‌ను మేద‌ర బుట్ట‌లో కూర్చోపెట్టి గౌరీపూజ చేయించారు. ఎడ్విన్‌తో వ‌ర‌పూజ చేయించారు.

ఎదురుకోళ్ళు ;మొహాల క‌డిగింపులు పూర్త‌య్యాక పెళ్ళిపీట‌ల‌పైన ఎడ్విన్‌ను కూర్చోబెట్టారు. మూహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.

డాక్ట‌ర్ రామ‌య్య బావ‌మ‌రిది మేరీబెత్ ను ( మేన‌మామ‌) బుట్ట‌లో తీసుకొచ్చి పెళ్లిపీట‌ల మీద కూర్చోబెట్టారు. అంత‌కు ముందే వారిద్ద‌రి మ‌ధ్యా తెల్ల‌ని తెర క‌ట్టారు.రామ‌య్య దంప‌తులు క‌న్యాదాత‌లుగా ఎడ్విన్ కాళ్ళు క‌డిగి త‌ల‌పై చ‌ల్లుకున్నారు.

తలలపై జీలకర్ర, బెల్లం పెట్టుకుంటున్న ఎడ్విన్, మేరీ బెత్ లు

ముహూర్త స‌మ‌యానికి ఒక‌రి త‌ల‌పై మ‌రొక‌రి చేత జీల‌క‌ర్ర‌బెల్లం పెట్టించారు. ముహూర్త స‌మ‌యంలో జీల‌క‌ర్ర ‌బెల్లం పెట్టించ‌డ‌మే ముఖ్యం. నిజానికి అదే పెళ్ళి జ‌రిగిన‌ట్టు లెక్క‌. త‌రువాత వెంట‌నే తాళి క‌ట్టించారు.

అక్షిత‌లు వేయ‌డం, త‌లంబ్రాలు పోయించ‌డం అన్నీ వ‌రుస‌గా జ‌రిగి పోయాయి. ఒక‌రి కొంగు ఒక‌రికి ముడి వేసి హోమం చుట్టూ ఏడుసార్లు ప్ర‌ద‌క్షిణ చేయించారు.ఈ ప్ర‌ద‌క్షిణ స‌మ‌యంలో ఆ పంచతో నడవడానికి ఎడ్విన్ ఎంత అవ‌స్థ ప‌డ్డాడో!

మేరీ బెత్‌ కూడా ఆ చీర‌తో అంతే అవ‌స్థ‌ ప‌డింది.ఒక ఇల్లాలు మేరీబెత్ కుచ్చెళ్ళు ప‌ట్టుకుని న‌డిపించింది.

ఆ స‌మ‌యంలోనే ‘ ధ‌ర్మేచ‌, అర్ధేచ‌, కామేచ‌, మోక్షేచ నాతి చ‌రామి ‘ అంటూ ఎడ్విన్ చేత పంచ‌భూతాల సాక్షిగా పురోహితుడు ప్ర‌మాణం చేయించాడు.

నేను పుట్టిన ధ‌ర్మాన్ని అనుస‌రించ‌డంలో, ఆర్థిక విష‌యాల్లో, భౌతిక కోర్కెలు తీర్చ‌డంలో, ఈ శ‌రీరాన్ని వ‌దిలేసి మోక్షాన్ని పొందే స‌మ‌యంలో నిన్ను ఒదిలిపెట్టి ఒక్క‌ణ్ణే ఏమీ చేయ‌ను ‘ అని దాన‌ర్థం అంటూ డాక్ట‌ర్ రామ‌య్య వివ‌రించారు.

ఈ తంతు అంతా పూర్త‌వ‌డానికి మ‌ధ్యాహ్నం ప‌న్నెండు దాటుతోంది. పంచెక‌ట్టుకుని, పాంకోళ్ళు తొడుక్కొన్న ఎడ్విన్‌, మోయ‌లేని చీర క‌ట్టుకుని మేరీ బెత్‌ ఆరు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

‘ఆకాశంలో వ‌శిష్టుడి పక్కనున్న అరుంధ‌తీ న‌క్ష‌త్రాన్ని చూడండి. అలా జీవితాంతం ఒక‌రిని వ‌ద‌ల‌కుండా మ‌రొక‌రు క‌లిసి జీవించాల‌’ని పురోహితుడు చెప్పాడు.

కానీ, సూర్యుడు న‌ డినెత్తికి వ‌చ్చిన మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల వేళ. ఆ స‌మ‌యంలో వాళ్ళ‌కు ఆ న‌క్ష‌త్రాన్ని ఏం చూపించాడో!? వారికి ఆ అరుంధ‌తీ న‌క్ష‌త్రం ఏం క‌న‌ప‌డిందో? ప్ర‌తి పెళ్ళిలోనూ ఇదే తంతు!

ఈ పెళ్ళి తంతులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎడ్విన్ మేరీబెత్‌లు మాత్రం చాలా ఆనందంప‌డిపోయారు. ఆ రోజు సాయంత్రం తిరుమ‌ల‌లో స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. మ‌ర్నాడు ఆదివారం బ‌య‌లుదేరి అమెరికాకు ప‌య‌న‌మ‌య్యారు.

మేరీ బెత్ మెడలో తాళి కడుతున్న ఎడ్విన్

మా బంధువుల‌లో జ‌రిగిన చాలా పెళ్ళిళ్ళు చూశాను. ఈ పెళ్ళిళ్ళ‌లో చాలా ముచ్చ‌ట్లు ఉంటాయి. ఇవ్వన్నీ సామాజిక, సాంస్కృతిక జీవితంలో భాగం. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా, అన్నీ వేడుక కోసం చేసేవే.

కొన్ని పెళ్ళిళ్ళ ప్లాష్‌బ్యాక్‌కు వెళదాం. మా త‌మ్ముడి పెళ్లి 1993లో జ‌రిగింది. పెళ్ళి అంతా అయిపోయాక ఒక మాట అన్నాడు. ‘ఇంత తంతు ఉంటుంద‌ని తెలిస్తే అస‌లు పెళ్ళే చేసుకునే వాడిని కాదు బాబోయ్’ అని!

మంగ‌ళ‌గిరిలో మా బాబాయి ధర్మవరపు రాంగోపాల్ పెళ్ళి 1970లో జ‌రిగింది. మా బాబాయి అంటే, మానాన్న‌కు పిన్ని కొడుకు. మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చ‌దువుకున్నాడు. మంచి రంగ‌స్థ‌ల న‌టుడు. కొన్ని సినిమాల్లో కూడా న‌టించాడు.

ఉన్న‌వ మాల‌ప‌ల్లి న‌వ‌ల‌ను ఏ. ఆర్‌.కృష్ణ నాట‌కంగా రూపొందించి ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌డు , అందులో సంగ‌దాసు పాత్ర వేశాడు. చోరామ రామ‌స్వామి తుగ్ల‌క్ నాట‌కంలో ‘ తుగ్లక్ ‘ గా న‌టించాడు. ఈ రెండు నాటకాలూ వంద పైగా ప్రదర్శనలు జరిగాయి. ‘మా భూమి ‘ సినిమాలో కార్మిక నాయ‌కుడిగా న‌టించాడు.

చిరంజీవి హీరోగా న‌టించిన ‘స్టూవ‌ర్ట్‌పురం పోలీస్ స్టేష‌న్‌’లో దొంగ‌గా న‌టించాడు. మృణాల్ సేన్ 1977లో తీసిన ‘ఒక ఊరిక‌థ‌ ‘లో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించాడు.

పెళ్ళ తంతు అంతా అయ్యాక పెళ్ళి కొడుకు అల‌క‌పాన్పు ఎక్కుతాడు. పెళ్ళి కొడుకు ఏదో ఒక కోరిక కోరాలి. కోరిక తీర్చందే అల‌క‌పానుపు దిగ‌డు. చుట్టూ ఉన్న మ‌గ పెళ్లివారి వ‌త్తిడి మేర‌కు గ‌డియారం ఇమ్మ‌ని కోరాడు.

ఆరోజుల్లో చేతికి వాచీ పెట్టుకోవ‌డం చాలా గొప్ప‌! ఎంత‌కీ మొండిప‌ట్టు వ‌ద‌ల‌లేదు. మావ‌గారికి ఒళ్ళుమండింది. పెళ్లి ఖ‌ర్చు అప్ప‌టికే త‌డిసి మోపెడైన‌ట్టుంది.

‘గ‌డియారం కొనుక్కోలేనివాడివి పెళ్ళాన్నేం పోషిస్తావ్ ‘ అన్నాడు.మగ పెళ్ళి వారికి నోటమాట రాలేదు. మారుమాటాడ‌కుండా అల‌క‌పానుపు పైనుంచి ట‌క్కున లేచేశాడు.

అనేక‌ సినిమాలలో న‌టించిన మా బాబాయికి వాళ్ళ మావ‌గారు పెళ్ళిలో ఇలా సినిమా చూపించాడు.

కన్న తల్లిదండ్రుల పెళ్ళి ఫోటోలు తీసి, పెళ్లిని చూసి ఆనందిస్తు న్న ఎడ్లే. ఎంతమంది పిల్లల కొస్తుంది ఎడ్లీ లా తల్లిదండ్రుల పెళ్ళి చూసే అవకాశం!?

మా అక్క పెళ్లి వ‌న‌ప‌ర్తిలో 1966లో జ‌రిగింది. మా అక్క‌కు ప‌ద్నాలుగేళ్లు, మా బావ‌కు ప‌దిహే డేళ్లు. పెళ్ళి ముహూర్తం అర్ధ‌రాత్రి దాటాక ఒక‌టిన్న‌ర‌కు పెట్ఠారు. కృష్ణాజిల్లా క‌పిలేశ్వ‌ర‌పురం నుంచి వ‌చ్చిన మ‌గ‌పెళ్ళి వారంతా ఆద‌మ‌ర‌చి నిద్ర‌పోతున్నారు.

మా నాన్న భ‌గ‌వ‌ద్గీత చ‌దువుతో కాలాన్ని మ‌ర్చిపోయాడు.తెల్ల‌వారు జామున మూడున్న‌ర‌కు పెళ్లి ముహూర్తం గుర్తొచ్చింది. ముహూర్తం కాస్తా త‌ప్పిపోయింది. అంతా గంద‌ర‌గోళం.

ఏం చేయాలి? ఏం చేయాలి?

అంద‌రిలో అదే సందేహం. ముహూర్తం దాటిపోయాక‌, తెల్ల‌వారు జామున 4 గంట‌ల‌కు పెళ్ళి చేసేశారు. దుర్ముహూర్తం అనుకున్న స‌మ‌యంలో ఆ పెళ్ళి జ‌రిగింది. వాళ్ళు ఇప్ప‌టికీ బాగానే ఉన్నారు.

చక్కని ముహూర్తం చూసి చేసిన పెళ్ళిళ్ళు ఎన్ని పెటాకుల‌వ‌డం లేదు! మా తాత సంస్కృత పండితుడు. బాగా చదువుకున్నాడు. శంకుచ‌క్రాలు వేయించుకుని వైష్ణ‌వ మ‌తాన్ని స్వీక‌రించాడు.సంప్ర‌దాయాల అమ‌లులో చండ‌శాస‌నుడు. త‌న ఏకైక కూతురు(మా మేన‌త్త‌)ను తన బావ‌మ‌రిదికి ఇచ్చి వివాహం చేశాడు.పెళ్ళి కూతురు (మామేన‌త్త‌)కు అయిదేళ్ళ‌వ‌య‌సు. పెళ్లి కొడుకు(మా నాయ‌న‌మ్మ సొంత త‌మ్ముడు)కు ప‌న్నెండేళ్ళ వ‌య‌సు.

పెళ్ళి అయిన ఆరేళ్ళ‌కు, అంటే పెళ్లికొడుకుకు ప‌జ్జెనిమిదేళ్ళు వ‌చ్చేస‌రికి ‘ఈ గ‌య్యాళి నాకొద్దు ‘ అన్నాడు. అల్లుడిపైన మా తాత కోర్టులో కేసు వేశాడు. కేసు దాదాపు ఇర‌వై ఏళ్ళు సాగింది. భ‌ర్త‌పేరున ఉన్న ప‌న్నెండు ఎక‌రాలు భార్య పేరును పెట్టి, భార్యే భ‌ర్త‌కు భ‌ర‌ణం ఇచ్చేలా తీర్పు వెలువ‌రించారు. ఆస్తి కోసం ఆమెను చంప‌డానికి విఫ‌ల‌య‌త్నం చేశాడు. మా మేన‌త్త అలా ఉండిపోయింది.

ఇదంతా నేను పుట్ట‌క‌ముందు జ‌రిగిన సంగ‌తి. ‘ధ‌ర్మేచ‌, అర్ధేచ‌, కామేచ‌, మోక్షేచ నాతి చ‌రామి’ అని వేదోక్తంగా ప‌లికించిన చిలకపలుకులు ఏమ‌య్యాయో తెలియదు!

వేద‌పండితుడైన మా తాత వేదోక్తంగా ద‌గ్గ‌రుండి చేయించిన‌ పెళ్ళి ఏమ‌య్యింది? ఏ పంచ‌భూతాలు సాక్ష్యంగా నిల‌బ‌డ లేదు! పెళ్ళిళ్ళ‌లో జ‌రిపే సంగ‌తుల‌న్నీ స‌ర‌దాలే.ఆర్థిక, సామాజిక ప‌రిస్థితులు, ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న మాత్ర‌మే కుంటుంబాల‌ను నిల‌బెట్ట‌గ‌లుగుతాయి.

Aluru Raghava Sarma

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *