అమరావతి ఆందోళన: పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తారా?: టి. లక్ష్మినారాయణ

(టి లక్ష్మినారాయణ)
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం 330 రోజులుగా అలుపెరగని పోరు సాగిస్తున్న రైతులు, మహిళా ఉద్యమకారుల దీక్షా శిబిరాలను సందర్శించినప్పుడు పలు శిబిరాలలో చిన్నారులు ప్లెకార్డులు పట్టుకొని కూర్చొని, నినాదాలతో స్వాగతం పలికారు. ఈ ఉద్యమం ఎందుకు జరుగుతున్నదో మీకు తెలుసా? అని అడిగాను. క్షణం ఆలోచించకుండా తెలుసని సమాధానం చెప్పారు.
ఒక చిన్నారిని మీ తల్లిదండ్రులు ఎంత భూమి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని అడిగితే దానికీ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే సమాధానం చెప్పింది. మీ అమ్మా నాన్నలు శిబిరంలో ఉన్నారా అని అడిగితే వాళ్ళమ్మను చూపించింది. ఏమ్మా మీరు సంపాదించిన భూమిని ఎవరికైనా ఇచ్చే హక్కు మీకు ఉన్నది, కానీ, వారసత్వంగా సంక్రమించిన భూమిని ఇచ్చే హక్కు మీకు లేదు కదా! ఎలా ఇచ్చారు? ఉన్న భూమినిచ్చేసి మా భవిష్యత్తును ఎందుకు అంధకారం చేశారని పిల్లలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని అడిగా. ఆ తల్లి నోట మాట పెగల్లేదు. మౌనంగా తలదించుకొని రోధించింది.
మీ మనవళ్ళు, మనవరాళ్ళు ఈ ప్రశ్న సంధిస్తే మీరేం సమాధానం చెబుతారని ఆ శిబిరంలో కూర్చొని ఉన్న వృద్ధులను అడిగినప్పుడు ఆవేదనా భరితమైన వారి గుండె చప్పుడు వినిపించింది. తమ జీవనాధారమైన భూమిని పణంగా పెట్టడమే కాదు, తమ పిల్లల, మనవళ్ళు, మనవరాళ్ళ భవిష్యత్తును రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పణంగా పెట్టిన రైతులు త్యాగధనులు.

రైతు సంఘాల బృందం అమరావతి రాజధాని పరిరక్షణ కోసం 330 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు, మహిళలకు వెన్నుదన్నుగా మేమున్నామంటూ దీక్షా శిబిరాలను రెండవ రోజు సందర్శించింది.
బృందంలో నాతో పాటు ఆల్ ఇండియా కిసాన్ సభ, ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షులు శ్రీ వై.కేశవయ్య, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగు రైతు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్, నాయకులు శ్రీ నరహరిశెట్టి నరసింహారావు, ఆ.ప్ర.రైతు సంఘం, కార్యదర్శి శ్రీ మల్నీడు యలమందరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ వెంకటేశ్వరావు, ఆ.ప్ర.ప్రజానాట్య మండలి, నాయకులు శ్రీ కాశీ, అమరావతి రాజధాని పరిరక్షణ సమితి, నాయకులు శ్రీ గద్దె బుచ్చి తిరుపతిరావు, తదితరులతో కూడిన రైతు సంఘాల బృందం అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, అనంతవరం, పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాలను ఈ రోజు సందర్శించి, సంపూర్ణ మద్ధతు తెలియజేయడం జరిగింది.

తెలుగు ప్రజలను రెండు ముక్కలు చేసి, రాజధాని కూడా లేని దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ ను దుష్టరాజకీయ శక్తులు నెడితే, రాజధాని నిర్మాణానికి భూసేకరణే అతిపెద్ద సమస్యని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో పేర్కొంటే, మేమున్నామంటూ ముందుకొచ్చి 34,000 ఎకరాల భూములను అమరావతి రాజధాని పరిథిలోని 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ త్యాగధనులు నేడు న్యాయం కోసం 330 రోజులుగా వివిధ రూపాలలో శాంతియుతంగా ఉద్యమం చేస్తూ, అవమానాలను, పోలీసుల నిర్భందాలను, అక్రమ కేసులను, లాఠీఛార్జీలను, కడకు చేతులకు బేడీలు వేసి జైలుకు పంపినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమ బాటను వీడని ధీరోదాత్తులు.
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమకారులకు బాసటగా నిలవడం ఆంధ్రప్రదేశ్ సమాజం బాధ్యత. ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఈనెల 10,11 తేదీలలో దీక్షా శిబిరాలను రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఐక్యమైన రైతు సంఘాల బృందం సందర్శించింది.
మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరావు, రాష్ట్ర రైతాంగ సమాఖ్య, అధ్యక్షులు శ్రీ ఎర్నేని నాగేంద్రనాథ్, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఉపాధ్యక్షులు శ్రీ ఆర్.వెంకయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అధ్యక్షులు శ్రీ వై.కేశవరావు, తెలుగు రైతు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్, నాయకులు శ్రీ నరహరిశెట్టి నరసింహారావు, ఎ.ఐ.హెచ్.యం., రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కార్యదర్శి శ్రీ మల్నీడు యలమందారావు గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీ యార్లగడ్డ వెంకటేశ్వరావు, శ్రీ సాంబిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నాయకులు శ్రీ కాశీ, అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు శ్రీ గాదె బుచ్చితిరుపతిరావు, కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త/ ఒక సామాజిక ఉద్యమకారుడుగా నేను ఆ బృందంలో భాగస్వామినైనాను.
T Lakshminarayana
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *