తెలంగాణ చేనేత జాతి రత్నం చిలువేరు రామలింగం

(అయినంపూడి శ్రీలక్ష్మి)

‘నువ్వు పట్టుచీర కడితేను పుత్తడిబొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ ‘ అన్నాడో సినీకవి . రామలింగం నేసిన చీర కడితే తప్ప అమ్మవారికి ‘బోనాల ‘ పండుగ ముగిసినట్లుగా అన్పించేది కాదు . రామలింగం నేసిన నూలుదండ పడితే తప్ప రాజకీయ నేతలకి సత్కారం అన్పించేది కాదు . రామలింగం వేసిచ్చిన పోట్రేట్ ఉంటే తప్ప ఏ ఇంటికైనా , ఏ కళాకారుడికైనా మనసుకైనా అంతటి ఆనందం చేకూరేది కాదు .అంతటి చరిత్ర అల్లిన నేతగాడు మన రామలింగం .సాంప్రదాయాన్ని , నమ్మకాల్ని , గ్రామీణ జీవన విధానాన్ని ,భారతీయ పురాణ ఇతిహాసాలని వంటబట్టించుకున్న రామలింగం మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని భవిష్యత్ తరాలకు పాఠ్యగ్రంధంగా చెప్పాల్సినంత గొప్ప నేతకారుడు .

అప్పుడెప్పుడో అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర గురించి ,ఉంగరంలో నుండి దూరిపోయే 9 గజాల చీర గురించి చెప్పుకున్నాం .కానీ యావత్ భారత దేశమే చేతులెత్తి మొక్కే సినీ దిగ్గజం శ్యాం బెనగల్ వచ్చి నేలమీద కుర్చుని ఆ వ్యక్తీ చెప్పే విషయాలన్నీ ఆసక్తిగా రాసుకుని వెళ్ళేవాడని ఎందరికీ తెలుసు ?
గొప్పవాళ్ళు అందరికీ తెలియరు .తెల్సిన వాళ్ళందరూ గోప్పవాళ్లనుకుని పోవడం తప్ప చరిత్రను శోధించి తెలుసుకోవాలన్న తపన చాలా తక్కువ మందిలో ఉంటుంది .అందుకు మన తెలుగువాళ్ళేం మినహాయింపు కాదు .ఆస్ట్రేలియా , ఫ్రాన్స్ , స్విట్జర్లాండ్ వంటి సుదూర దేశాల ప్రజలకు తెలిసిన మన సాటి కళాకారుడి ప్రతిభ గురించి మనవాళ్ళు మర్చిపోయారు . అలాంటి మహోన్నత పద్మశాలి ముద్దుబిడ్డ చేనేత రత్నం మన చిలువేరు రామలింగం.
అప్పటి నల్గొండ ( ఇప్పటి యాదాద్రి భువనగిరి ) జిల్లా .జూలూర్ గ్రామంలో 1942 వ సంవత్సరం జూన్ నెలలో జన్మించారు . వీరి తండ్రి రామస్వామి , తల్లి మణెమ్మ , పద్మశాలి కుటుంబంలో పుట్టిన రామలింగం చిన్నప్పటినుండి వినూత్నమైన వాటిపట్ల ఎక్కువగా ఆసక్తి కనబరిచేవారు .
పుట్టి పెరిగింది అంటా పోరాటాల పోతుగడ్డ పోచంపల్లి గ్రామమంలోనే . ఉమ్మడి పద్మశాలి కుటుంబంగా ఉన్న ఆ గ్రామంలో భుక్తి కోసం అందరూ చీరలు నేస్తుంటే రామలింగం మాత్రం కళల పట్ల అనురక్తిని పెంచుకున్నారు .తనకు తానే గురువుగా , తన మార్గమే ప్రయోగశాలగా ఎంచుకుని ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు . కళాకృతులకు ప్రాణం పోశారు .తనవృత్తి కడుపుకింత కూడు పెట్టలేదు ,మేడలు కట్టే రూకలు ఇవ్వలేదు . కానీ ప్రపంచం యావత్తు గుర్తుంచుకునే ఖ్యాతిని అందించింది .భారత దేశ చిత్రపటంలో ‘పోచంపల్లి ‘ ఎక్కడుందో అని వెతుక్కునే పరిస్థితిని విదేశీయులకు కలిగించింది .

చిత్రమైన విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావించాలి.
రామలింగంకి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు అందులో ఇద్దరూ ఆర్టిస్టులే .ఒకరు మృత్యుంజయ్ – కార్టూనిస్ట్ , రెండవ వారు దత్తాత్రేయ ,యానిమేషన్ ఆర్టిస్ట్,
మృత్యుంజయ్ ఇంటర్నెట్ లో కార్టూనిస్టుల క్యారికేచర్లు వేసే ప్రఖ్యాత కళాకారుల సైట్లు చూస్తూ అథారిటీ సంపాదిస్తున్న రోజుల్లో ‘బెల్జియం అబ్దివిక్’ సైట్ లో చక్కని క్యారికేచర్లు చూస్తూ వారితో సంభాషించడం మొదలు పెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి అయినప్పటికీ జాన్ కి ఎంతో ఓపిక ఉండేది.కొంతకాలం తరువాత మృత్యుంజయ్ కేరికేచర్ కూడా గీసిచ్చాడు జాన్. దానికి కృతజ్ఞతగా మృత్యుంజయ్ ‘ మా ఇండియాలో మీకేవరన్నా తెలుసా మీకేదైనా కావాలా “ అని అడిగాడు . అందుకు సమాధానంగా జాన్ “ నేను ఒక వ్యక్తి గురించి ఇంటర్నెట్ లో చదివాను .మిత్రుల దగ్గర విన్నాను .మంచి ఆర్టిస్ట్ “ తేలియా రుమాల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ “ అనే సచిత్ర వ్యాసం ఉంది .దాన్ని చదివి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను .ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంది ‘ అన్నాడు.ఈ సారి ఆశ్చర్యపడటం మృత్యుంజయ్ వంతైంది. ఆనందంతో ‘వారు మా నాన్నగారే ‘ అని జాన్ తో చెప్పారట. ‘అంత గొప్ప ఆర్టిస్ట్ కొడుకువా నువ్వు ‘ అని ఆనంద పడ్డారట జాన్ .

 

 

ఎవరు మెచ్చుకున్నా ఎందరు అనుసరిస్తున్నా అవేమి పట్టని నిరాడంబరులు రామలింగం గారు . గాంధీ నెహ్రూ ,ఇందిరాగాంధీ ,రాజీవ్ గాంధీ ,ఎన్టీఅర్ , అంజయ్య ఇలా ఎందరివో పోట్రేట్లు వేశారు.అవి వారికి బహూకరించడం తనకిష్టం. నిజానికి పేదరికంలో పుట్టిన రామలింగానికి అవి తలకు మించిన భారమే అయ్యేది.ఒక్కో బొమ్మ నేయాలంటే రెండు మూడు నెలలు పట్టేది .తాను కనుక్కున్న స్వంత టెక్నిక్ తో వాటిని తయారు చేసేవాడు.పోచంపల్లికి ఏ రాజకీయనాయకుడు వచ్చినా రామలింగం పూలదండలకు బదులు నూలు దండలతో ఆహ్వానం పలికేవాడు .

మూడు కొంగుల చీర, కుట్టు లేకుండా షర్టు, కత్తిరింపులు అతికింపులు లేకుండా కుర్తా పైజామా,గాంధీ టోపీలు తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు .గొడుగు నేయడం రామలింగానికి ఏంతో ఇష్టం .టై అండ్ డై పధ్ధతి అంటే రామలింగమే అన్నంత గుర్తింపు తెచ్చుకున్నారు.విదేశాల నుండి కేవలం అయన పనితనాన్ని చూసేందుకు ఆర్టిస్టులు పోచంపల్లికి వచ్చేవారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయనెంత నేతగాడో !

ఉత్తరాదిలో ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా రామలింగానికి అవార్డ్ తప్పకుండా వచ్చేది.ప్రశంసలు వర్షంలా కురిసేవి .వైట్ హౌస్ ను సైతం ఆకర్షించిన డిజైన్ల సృష్టి కర్త రామలింగం కావటం మనం గర్వించాల్సిన విషయం .ఢిల్లీ ,హర్యానా సూరజ్కుండ్ , గుజరాత్ , కలకత్తా. మద్రాస్,
బెంగళూరు ,హైదరాబాద్ లలో జరిగే చేనేత ప్రదర్శనలలో ఎన్నెన్నో ప్రశంశలను పొందారు .

ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఓ టెక్స్టైల్ నిపుణుడు ‘డానామేకౌన్’ రామలింగం పనితనాన్ని మీద పెద్ద వ్యాసమే రాశాడు . అది ‘అలి జారిన్ డైతో’ ప్రత్యేకంగా రంగులు దిద్దే రామలింగం పనితనం మీద వ్యాసం ఉండటం విశేషం .ఎంతోమంది వీరు సమకూర్చిన పనితనం అన్నో పేటెంట్ లు సాధించి పెడ్తుందని విశ్వాసంతో ఉండేవారు .కానీ కళను అమ్ముకోవటం తెలీని రామలింగం నమ్ముకున్న కళ కోసం ఉన్నఊరిని దాటి ఎక్కడికీ వెళ్ళకుండా తనకు తోచిన మార్గంలోనే తానే నేతదారిని వెతుక్కుంటూ ముందుకెళ్ళారు. ఆ దారిలో ఎందరు నడిచినా,
ఇప్పటికీ నడుస్తున్నాపాపం వాళ్ళకే తెలియదు దీన్ని నిర్మించుకోవడం కోసం ఓ వ్యక్తి తన జీవితాన్ని మొత్తం ‘నేత’ కే అర్పితం చేశాడని. శ్యాం బెనగల్ మాట వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం చెప్పాలి .

సరికొత్త డిజైన్ల నిత్యన్వేషి అయిన ఈ నేతకారుని గురించి తెలిసింది .అంతే ఆంధ్రప్రదేశ్ కి వచ్చి బండి కట్టుకుని పోచంపల్లి ఊర్లోకి వాలిపోయాడు.అప్పుడు బోనాల రోజులు .రామలింగం ఇంటిముందు ఊరంతా గుమిగూడి ఉంది .బండిలో మగ్గం పెట్టబడి ఉంది. చేనేతబండిగా జనం దండిగా సాగుతూ ఉంటే రామలింగం బండి ఎక్కాడు .అమ్మవారి గుడికి బండి బయలు దేరింది.నేతచీర బండిమీద నేయడం మొదలైంది. డప్పులు , పోతురాజు విన్యాసాలు, శివసత్తుల ఊపులు,జనాల తీన్మార్లు ఒక్కటేమిటి ఊరంతా సందడే సందడి .చివరికి బండి అమ్మవారి గుడిముందు ఆగింది.రామలింగం చేతిలో అమ్మవారి చీర కూడా పూర్తయింది .ఊరి జనమంతా భక్తిగా చూశారు .శ్యాం బెనగల్ మాత్రం అబ్బురంగా చూశాడు ..ఇంకేముంది ఆ కంట్లో పడ్డ కథావస్తువుగా ‘సుష్మన్ ‘ సినిమాని తీశారు శ్యాం బెనగల్ . ఆ చిత్రంలోని కలాకృతి చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుంది .

షబానా అజ్మీ ,పల్లవి జోషీ నటించిన ఈ చిత్రం కళాకారుల జీవితాల్లోని చీకటి వెలుగుల్ని ఎత్తి చూపాయి.నిజానికి ఈ సినెమా రామలింగం సహకారంతోనే రూపుదిద్దుకుందన్న సంగతి ఈనాటి తరానికి తెలియదు .ఆ సినెమా తీస్తున్నప్పుడు శ్యాం బెనగల్ రామలింగానికి 10,000/- రూపాయలు బహూకరించడం అప్పట్లో ఊళ్ళన్నీ గొప్పగా చెప్పుకున్నాయి .అలాగే స్విట్జర్లాండ్ దేశస్తులు వచ్చినపుడు పచ్చీస్ ఆడుకునే గుడ్డను రంగులతో తయారు చేసి అందిస్తే ముచ్చట పడి 300 రూపాయలు ఇవ్వడం మరో విశేషం. నిజమైన కలాకరుదికే అసలైన కళాకారుడి ప్రతిభా పాటవాలు అర్తమౌతాయన్న సత్యాన్ని ఈ సంఘటనల ద్వారా మనం గ్రహించాలి. పత్రికలూ ,టీవీలు , వారి మీద ఎన్నో వ్యాసాలు ప్రసారాలు చేశాయి . తెలుగు ప్రజల్లో ఉన్న ఓ కళాకారుడి గురించి ఆంధ్రప్రదేశ్ గురించీ అందరికీ తెలిసింది .

నూలుపోగుల మేలుకలయికతో వస్త్రాలలో చిత్రాలను నేసే రామలింగం.కళను అడ్డుపెట్టుకుని అవార్డ్ల కోసం పాకులాడలేదు.తాకంటే తనూరు వేలగాలనుకున్నాడు .తనపేరు కంటే తన పనితనం పదిమందికి తెలియాలని కలలు కన్నాడు.

చిన్నతనంలో విద్యాబుద్దులు నేర్పిన యాకూబ్ అనే టీచర్ ప్రోత్సాహం వల్లనే ఈ నేతకళలో అద్భుత పనితనం అలవడిందని ఏంటో వినయంగా చెప్పుకునే స్నేహశీలి రామలింగం.

ఏ నేత కార్మీకుడికైనా అండగా ఉండాల్సిన వీవర్స్ సొసైటీల అనైక్యతల పట్ల అమితంగా ఆవేదన చెందినా వీరు నేతన్నల బతుకులు మారాలంటే నేతబట్టలేసుకునే నాయకుల ధోరణీ మారలనేవాడు .కళాకారుడికి తగినంత ప్రోత్సాహం ఉండాలని అలా ఉన్నప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకోగాలుగుతాడనీ తరచూ అంటుండేవాడు .తనజీవిత కాలమ్లో వేసిన నేత బొమ్మల్లో పండిట్ నెహ్రూ చిత్రాన్ని వస్త్రం పై నేసేందుకు 246 కొయ్యలను ఉపయోగించడం మరిచిపోలేనని ,గుండెపై గులాబీని అత్యంత ఆకర్షణీయంగా మలిచేందుకు ఆరు రోజులు పట్టిందని చెప్పేవారు . కార్పోరేట్ కంపనీలకు లోగోలు , ప్రపంచ అద్భుత కట్టడాల ప్రతిరూపాలను వస్త్రం పై ఆవిష్కరించడం గొప్ప అనుభూతని గుర్తు చేసుకునేవారు .కొంతమంది అవకాశ వాదుల అసలు రంగు తెలుసుకోకుండా రంగుల కలల్లోనే తనదనుకున్న కళా ప్రపంచంలోనే మగ్గమే బతుగుగా గడిపిన రామలింగం కళ్ళనుండి రాలేటి బొట్టంత స్వచ్చమైన వ్యక్తి. సాలి మగ్గంలో జాలువారే కళాకృతులను ఆవిష్కరించి అంతలోనే అదృశ్యమైన ఈ చేనేత తపస్వికి తెలంగాణా రాష్ట్రం ఎంతో రుణపడి ఉన్నది .

బట్టనేద్దామని నూలు వడుకుతుంటే వస్త్రానికి బదులు కన్నీటి హారం తయారయ్యింది .అన్నట్లుగా నేతన్న బతుకు దినదిన గండంగా గడుస్తున్న రోజులలో చితికిన ఇంటికంటే .గడ్డుగా బతుకీడుస్తున్న రోజులకంటే రేపటి రోజున నిలబడే చరిత్ర కోసం తానూ నిలబడ్డాడు .తనని కళా రంగానికి అంకితమిచ్చి ఆ కుటుంబం గొప్ప త్యాగమే చేసింది . ఆ త్యాగానికి ప్రతిఫలం దక్కకున్నా కనీసం గుర్తింపును కూడా కోరుకొని మనస్తత్వం ఆ కుటుంబానిది .
ప్రతి సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా ఎడ్లబండి మీద మగ్గం పెట్టి విరామం ఎరుగక సవారి చేసే నేసిన చీరను సారిగా చేసి అందించే రామలింగం లేకపోవడంతో ఏటేటా పుట్టింటి చీరను అందుకున్న అమ్మవారు చిన్నపోయారు .ఆరుదశాబ్దాల మూడేళ్ళ కాలెండర్ కి కలకి తేడా తెలియక వెలుగు నీడలా జోలికెళ్ళకుండా రంగుల కళలోనే కాలం గడిపిన రామలింగం మగ్గం ఆగిపోయింది .ఆ నేతబడి నిలిచిపోయింది .ఆయనెంత సంపాదించుకున్న ఘనమైన కీర్తిని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాడు .తానె ఒక నేత చరిత్రగా నిలిచి తన ‘టై అండ్ డై’ నీడను ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు.

కుంచెతో కాన్వాస్ పై రంగులద్ది నూలుపోగుల మేలు కలయికతో మగ్గం మీద నేతల చిత్రాలు అలవోకగా నేసే
రామలింగం తన చిత్రపటానికి తానే నేసిన నేతతో ఉన్న పూలమాలని సెప్టెంబర్ 12, 2003 లో వేయించుకున్నారు .ఓ మనిషి చరిత్ర ముగుసింది .

ఇప్పుడే ఓ కళా చరిత్రకు తెర లేచింది .ఇప్పటికైనా వీరిని గురించిన సమగ్రమైన సమాచారం ,వారి విలువైన ‘డై విధానం ‘ పై పరిశోధనలకు పూనుకోవాల్సిన అవసరం ఉంది .పోచంపల్లి కమాన్ లోకి అడుగుపెడితే చాలు కమాన్ అంటూ పిలిచే ఆ నేత పనితనంతో ఇప్పటికైనా మనం కరచాలనం చేద్దాం .అది మన కళా తెలంగాణ ఓ నిఖార్సైన నేతకారుడికిచ్చే నిజమైన నివాళి .

(ఇది ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా రాసిన వ్యాసం. వాట్సాప్ గ్రూపుల్లో ఇపుడు తాజాగా వైరలవుతున్నవ్యాసం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *