ఒక హైజాక్ కథ

(తోట భావనారాయణ)

2000 సంవత్సరం ఫిబ్రవరి 26. మధ్యాహ్నం ఒకటింబావు.

శనివారం కావడంతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది హాఫ్ డే ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. న్యూస్ స్టాఫ్ మాత్రమే మిగిలాం. ప్రశాంతంగా ఉన్న ఫ్లోర్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. కారణం ఒక ఫ్లాష్ న్యూస్. “చెన్నై రావలసిన జెట్ ఎయిర్‍వేస్ విమానం బెంగళూర్ విమానాశ్రయంలో హైజాక్ అయింది. విమానాన్ని సింగపూర్ తరలించేందుకు హైజాకర్లు నిర్ణయించుకున్నారు.” యు ఎన్ ఐ ఫ్లాష్ వార్త చూడగానే అందరం అలర్ట్ అయ్యాం. చెన్నై సన్ నెట్‍వర్క్ కార్యాలయంలోని నాలుగు చానల్స్ ( సన్, జెమిని, ఉదయ, సూర్య ) న్యూస్ విభాగాల్లో హడావిడి మొదలైంది. ప్లే ఔట్ వైపు పరుగులు. క్షణాల్లో ఆ ఫ్లాష్ వార్త బుల్లితెర మీద పరుగులు తీస్తూ కనిపించింది. సంఘటన జరిగింది బెంగళూరులో అయినా ఉదయ ( కన్నడ) చానల్ తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మలయాళ చానల్స్ లో స్క్రోల్ మొదలైంది.
***
అప్పటికి సరిగ్గా రెండు నెలలక్రితం ( 1999 డిసెంబర్ 24 న) ఖాఠ్మండు నుంచి 178 మందితో ఢిల్లీ బయలుదేరిన విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళారు. దేశ భద్రతను సవాలు చేస్తూ, ప్రతిష్టకు భంగం కలిగించిన ఘట్టమది. కరడుగట్టిన ముగ్గురు తీవ్రవాదులను విడిపించుకోవటానికి తీవ్రవాదులు ఈ హైజాకింగ్ కుట్రపన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం డిసెంబర్ 31 న వారిని ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళి మరీ అప్పగించాల్సి వచ్చింది. వారిలో ఒకడైన మౌలానా మసూద్ అజార్ ఆ తరువాత కాలంలో జైషే మహమ్మద్ పేరిట ఒక తీవ్రవాద సంస్థను ప్రారంభించటం తెలిసిందే. ఆ విధంగా కాందహార్ హైజాకింగ్ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ప్రజలు ఈ ఘటనను మరిచిపోకముందే ఈ వార్త. అందుకే దీనికంత ప్రాధాన్యం.
***

ఒకే తెర మీద నాలుగు చానల్స్ ఒకేసారి చూస్తున్న సన్ నెట్‍వర్క్ అధిపతి కళానిధి మారన్ కి ఉదయ టీవీ (కన్నడ) తెర మీద ఫ్లాష్ కనిపించలేదు. వార్త తెలియాల్సిన కన్నడ ప్రజలకు ఉదయ చానల్ ద్వారా తెలియక పోవటం సహజంగానే ఆయనకు కోపం తెప్పించింది. ఆ వైపు కళానిధి మారన్ ఫోన్ ట్రై చేస్తుంటే ఇక్కడ ఈయన ఫోన్ బిజీ. మా ఫ్లోర్ లో ఉన్న ఉదయ న్యూస్ ఎడిటర్ ముంజానే సత్య గారు మాత్రం బెంగళూరుకు ఫోన్ చేసేపనిలో బిజీగా ఉన్నారే తప్ప యు ఎన్ ఐ ఫ్లాష్ గురించి పట్టించుకోవటం లేదు. మరోవైపు సత్య గారి అసిస్టెంట్లు ఫ్లాష్ న్యూస్ రాసిన పేపర్ పట్టుకొని ఆయన ఆదేశాలకోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ పెట్టేసిన సత్య ఆ వార్త వేయవద్దని తన జూనియర్లకు తేల్చి చెప్పారు. మాకు అర్థం కాలేదు. ఏజెన్సీ వార్త కనుక ఒకవేళ తప్పయినా మా బాధ్యత ఉండదనేది మా ధీమా.

అంతలో ఆయనకు ఫోన్ రానే వచ్చింది. ఒకసారి చెప్పినా ఇంకా వేయలేదేమిటని కళానిధి మారన్ గట్టిగా అడుగుతున్నారు. బెంగళూరులోని ఉదయ రిపోర్టర్ ఆ వార్తను ధ్రువీకరించలేదనేది సత్య గారి వివరణ. అవతలివైపున కళానిధి చాలా అసహనంతో ఉన్నారు. ఇక్కడ సత్య మాత్రం వినయంగానే సమాధానమిస్తున్నారు. తాను చేస్తున్నది సరైనదేనన్నట్టు ఆయన ధీమాగా కనిపించారు. “హైజాక్ జరగలేదని మా రిపోర్టర్ చెబుతున్నారు. మా రిపోర్టర్ మీదనే నమ్మకం ఎక్కువండీ ” అని సమాధానం చెప్పగానే, “యు ఎన్ ఐ కంటే మీ రిపోర్టర్ గొప్పవాడా ” అన్నారు కళానిధి మారన్ వెటకారం, కోపం కలిసిన స్వరంతో. “రిపోర్టర్ కాదని చెప్పినా వేస్తే ఎలా? అయినా, మన రిపోర్టర్ ని మనమే నమ్మకపోతే….” అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయబోయారుగాని ఫలితం లేదని కూడా అర్థమైంది. ఇక్కడ ఈయన సమాధానాలను బట్టి అటువైపునుంచి వస్తున్న ప్రశ్నలను ఊహించుకుంటూ ఆయన వైపే నిశితంగా చూస్తూ ఉన్నా. మారన్ కోపంతో ఫోన్ పెట్టేశారు. అయినా ఏమాత్రం తొణకని సత్య గారిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు.

                                                              ***

ముంజానే సత్య గారి వయసు 55-60 ఏళ్ళ మధ్య ఉంటాయి. కన్నడలో ఆయన కాకలు తీరిన జర్నలిస్టు. స్వచ్ఛమైన తెల్లటి జుట్టుతో నిజంగానే తల పండింది. ఆయన పనిచేసిన పత్రిక ముంజానే పేరుతోనే ఆయన పేరు ప్రసిద్ధమైంది. ప్రసారమయ్యే ప్రతివార్తా, ప్రతి అక్షరం తానే చదివి దిద్దుతారు. వయసు పెరగటం వలన వచ్చిన ఆ చాదస్తం మీద జోక్ చేస్తే ఆయన కూడా సరదాగా నవ్వేస్తారు. అసలు టీవీ మాధ్యమానికి వృద్ధులను తీసుకుంటే కాలంతో పరుగెట్టటం వీళ్ళకు తెలియదని మారన్ పదే పదే చెప్పే మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. 2000 సంవత్సరం నాటికి సన్ టీవీ ఉద్యోగుల సగటు వయసు 30 మాత్రమే . ఆ రోజు సత్య గారి ధోరణి మీద నవ్వు రావటం లేదు… చిరాకుపుట్టింది. మరో వైపు యు ఎన్ ఐ కనెక్షన్ లేని ఈటీవీ అసలా వార్తనే ప్రసారం చేయలేకపోయింది. జెమినీలో మాత్రమే వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది.

                                                               ***

బెంగళూరు రిపోర్టర్ రుద్రప్పకు మళ్ళీ ఫోన్ చేశారాయన. కనీసం బెంగళూరులో ఆయనకు తెలిసిన మరెవరైనా రిపోర్టర్ కు ఫోన్ చేయకుండా మళ్ళీ అదే రుద్రప్పను పట్టుకొని ఎందుకు వేళ్ళాడుతున్నారో అర్థం కావటం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మొత్తం రాసి ఫాక్స్ పంపమన్నారు. “హైజాక్ జరగలేదని చెబుతూ ఉంటే ఆ రిపోర్టర్ ఇంకా రాసి పంపటానికేముంటుంది?” ఆయన వినేలా పైకే అనేశా. పదినిమిషాలు కూడా కాకముందే రుద్రప్ప నుంచి ఫాక్స్ అందింది. ఆ ఫాక్స్ సారాంశం తెలుగులో ఇది:

ఈరోజు మధ్యాహ్నం 1.06 నిమిషాలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పోలీసు కమిషనర్ టి. మడియాల్ కు ఫోన్ చేసి విమానం హైజాక్ అయినట్లు చెప్పారు. ఆయన ఎయిర్‍పోర్ట్ కు బయలుదేరుతూ యు ఎన్ ఐ కి ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు ఆ ఫ్లాష్ వార్తను పత్రికలు, చానల్స్ మీదికి వదిలారు. ఆ సమయంలో నేను ఎయిర్‍పోర్ట్ లోనే ఉన్నా. భద్రతాధికారుల అప్రమత్తత పరీక్షించటానికి ఒక ఉత్తుత్తి హైజాక్ నాటకం మొదలైందక్కడ. నేనక్కడ ఉండగానే అక్కడికి చేరుకున్న మడియాల్ అది ఉత్తుత్తిదని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారే తప్ప యు ఎన్ ఐ లేనిపోని కలకలం రేపిందన్న విషయం గ్రహించలేకపోయారు. కనీసం యు ఎన్ ఐ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పకపోవటం వలన ఈ గందరగోళం కొనసాగుతోంది. దయచేసి అది మాక్ హైజాక్ అనే విషయం వెంటనే ప్రజలకు తెలియజేస్తే మంచిది.

                                                             *** 

సత్య ఈ ఫాక్స్ సమాచారం చదివి వినిపించగానే మేం మళ్ళీ స్క్రోల్ దగ్గరికి పరుగులు తీశాం. హైజాకింగ్ ఉత్తుత్తిదేనని, స్క్రోల్ మార్చాం. విమానం హైజాక్ అయినట్టు వస్తున్న పుకార్లు నమ్మవద్దంటూ ఉదయ టీవీ స్క్రోల్ నడిపింది. సరిగ్గా అప్పుడే ఈటీవీలో స్క్రోల్ … బెంగళూరు విమానాశ్రయంలో విమానం హైజాక్ అయిందని. వాళ్ళకు పి టి ఐ కనెక్షన్ మాత్రమే ఉండగా అది అప్పుడే మేల్కొంది. హైజాకింగ్ జరగలేదని జెమినీ, జరిగిందని ఈటీవీ దాదాపు ఆర్థగంట సేపు స్క్రోల్ నడిపాయి. ఈటీవీ మళ్ళీ తప్పుదిద్దుకునేసరికి ఇంకో అరగంట పట్టింది.


నేను సత్య గారి వైపు చూడలేకపోయా. ఈ మధ్యలోనే ఆయనకు కళానిధి మారన్ నుంచి ఫోన్. అభినందించినట్టు తెలుస్తూనే ఉంది. రుద్రప్ప నంబర్ కూడా అడిగి తీసుకుని మారన్ అతనికి ఫోన్ చేసి అభినందించారు. నేను వెళ్ళి సత్య గారి ముందు కూర్చున్నా. ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు. “రుద్రప్పను ఫాక్స్ పంపమని ఎందుకడిగారు ?” అన్నాను. ” నిజంగా హైజాకింగ్ జరిగి ఉంటే అతని ఉద్యోగం పోయేది. నైతిక బాధ్యత తీసుకుని నేనూ తప్పుకునేవాణ్ణి” అన్నారాయన ద్రుఢంగా. నాకు నోట మాట రాలేదు. ” వేగమే కాదు విశ్వసనీయత కూడా ముఖ్యం మనకు. ప్రేక్షకులకు తప్పుడు సమాచారం ఇవ్వటం ఎంత తప్పో, పుకార్లతో తప్పుదారిపట్టించటమూ అంతే తప్పు, మన రిపోర్టర్ మీద మనకు నమ్మకముండాలి” అన్నారు. ఎంతయినా అనుభవం అనుభవమే.

( 2007 లో సత్య గారు రాజీనామా చేసినప్పుడు ఆయనబకాయిలు ఎగ్గొట్టటానికి ఆయన హోదా చీఫ్ ఎడిటర్ కాదని, చీఫ్ సూపర్ వైజర్ అని బుకాయించబోయిన సన్ నెట్ వర్క్ మీద కేసువేసి వడ్డీతో సహా వసూలు చేశారు. కర్నాటక ప్రజలు అత్యంత విశ్వసనీయమైనదిగా భావించే ” సంయుక్త కర్ణాటక ” పత్రికలోనే సత్య, రుద్రప్ప ఇద్దరూ కొంతకాలం పనిచేసి ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు.)

(తోట భావనారాయణ, టెలివిజన్ జర్నలిస్ట్, మీడియా కన్సల్టెంట్. ఆంధ్రప్రభ, వార్త దినపత్రికలతోబాటు జెమిని, మా టీవీ, హెచ్ ఎం టీవీ, తులసి న్యూస్ తదితర చానల్స్ లో పనిచేశారు. ‘టెలివిజన్ జర్నలిజం, కేబుల్ టీవీ డిజిటైజేషన్’ అనే పుస్తకాలు వెలువరించారు.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *