ఆంగ్లం చదివితేనే గొప్ప ఉద్యోగాలు వస్తాయనేది అపోహ మాత్రమే…

(గొబ్బూరి గంగరాజు *)
భాష మన భావాలను వ్యక్తీకరించడానికి 
భాష సమాజం మనుగడ సాధించడానికి 
 భాష సాంస్కృతిక  వారసత్వానికి చిహ్నం 
జంతువులనుండి మానవుని వేరు చేసింది భాష ఒక్కటే. భాష లేకపోతే మన భావాలను ఇతరులతో వ్యక్తీకరించలేము భాష మన చరిత్ర గమనానికి సామాజిక పరిణామాలకు చాలా ముఖ్యం
మాతృ భాష అనగా శిశువుకు తల్లి ఉగ్గు పాలతో నేర్పినటువంటి భాష. ఈ మాతృ భాష ప్రతి శిశువుకు అలవోకగా వస్తుంది. అంటే ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగా నేర్చుకుంటాడు అలా నేర్చుకునేదే మాతృ భాష
మాతృ భాష ద్వారా నేర్చుకున్న  విద్య విద్యార్థికి సులభంగా అవగతమౌతుంది. మరియు వారిలో ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీయవచ్చును.
మాతృ భాష తల్లి పాలవంటిది. పరభాష  పోతపాలవంటిది. ఎవరికైనా తల్లి పాల కంటే ఏ పాలు బలమునీయగలవు. అలాగే మాతృభాషలో పట్టుఉంటే ఏ భాషనైనా సులువుగా నేర్చుకోవచ్చు.
 ప్రాధమిక స్థాయిలోనే తెలుగును నేర్పించినట్లైతే భావి భారత పౌరులకు తెలుగు పట్ల గౌరవం ఏర్పడుతుంది
 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ నేపధ్యాన్ని తెలుసుకోవాలంటే బంగ్లాదేశ్లో భాష గురించి జరిగిన పోరాటాన్ని తెలుసుకోవాలి
దేశ విభజన జరిగిన తరువాత బంగ్లాదేశ్ ను తూర్పు పాకిస్తాన్  గా పిలిచేవారు వారి మాతృ భాష బెంగాలీ. కానీ వారి భాషకు తగిన గుర్తింపు లేదు. అందువలన బాంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్ అధికార భాషల్లో బెంగాలీని ఒకటిగా గుర్తించాలని ఉద్యమాన్ని ప్రారంభించారు  బాంగ్లాదేశ్ ప్రజల పోరాటం ఉద్యమ రూపం దాల్చింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచి వేయాలని చూసింది. ఈ ఉద్యమం నాలుగు సంవత్సరాలు చాలా తీవ్రంగా కొనసాగింది. 1952 ఫిబ్రవరి 2 న ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో అనేకమంది భాష కోసం బలైపోయారు
 ఈ ఉద్యమ ఫలితంగా 1956 లో పాకిస్తాన్ రాజ్యాంగం బెంగాలీ, ఉర్దూ భాషలను అధికార భాషలుగా ప్రకటించింది 1953 నుండి ఇప్పటివరకు ఫిబ్రవరి 21వ తేదీని బాంగ్లాదేశ్ ప్రభుత్వం మృతవీరుల దినంగా పాటిస్తుంది. ఈ ఉద్యమ ప్రేరణ బాంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి పునాదులయ్యాయి.
 ఈ ఉద్యమ ఫలితంగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ డిసెంబర్ 16, 1971న విడిపోయింది 1972లో బాంగ్లాదేశ్ తన రాజ్యాంగంలో బెంగాలీని గణతంత్ర రాజ్య భాషగా ప్రకటించుకొన్నది
1999లో యునెస్కో సభ్యత్వానికి బాంగ్లాదేశ్ ఎన్నిక కావడంతో బెంగాలీ భాషను రక్షించుకోవడం కోసం మాతృభాషా పరిరక్షణ దినోత్సవం గురించి ప్రతిపాదన చేసింది
 ఐక్యరాజ్యసమితి యూనెస్కోను ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ  మాతృ భాషా దినోత్సవంగా ప్రకటించాలని బాంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది. భారత్, పాకిస్తాన్, శ్రీలంకతో సహా 28 ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికాయి
1999 నవంబర్ 17 న జరిగిన యునెస్కో 30 వ సాధారణ సమావేశంలో ఫిబ్రవరి 21 ని అంతర్జాతీయ మాతృ భాషా దినముగా పాటించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది
 ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నప్పటికీ ఆచరణలో మన మాతృభాష తెలుగు పట్ల చిన్న చూపు పోలేదు
ఆంగ్ల మాధ్యమంలో చదివితే చాలా గొప్పవారు అవుతారని తెలుగు మాట్లాడితే చులకన అనే భావన వలన ఆంగ్లం చదివితేనే గొప్ప గొప్ప ఉద్యోగాలు వస్తాయనే అపోహ వలన తెలుగు భాష నిర్లక్ష్యానికి గురవుతున్నది.
 మన భాషను నీకొలై కొంటి   “ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని 1402 లోనే ప్రసంశించారు.
 తెలుగు ముందు తక్కిన భారతీయ భాషలు ఎందుకూ పనికిరావు. భారతదేశానికి అధికార భాష కాదగిన అర్హత యోగ్యత ఉన్నది  ఒక్క తెలుగు భాషకే అని ప్రఖ్యాత బ్రిటీష్ జీవశాస్త్రవేత్త J. B.. S. హాల్డేన్ అన్నారు.
 మాతృభాషలో విద్యార్థులు చదవడం వలన సృజనాత్మక శక్తులు అభివృద్ధి చెందుతాయి. మరియు వేరే భాషలు నేర్చుకోవడానికి మాతృభాష సహాయకారిగా ఉంటుంది
 మాతృభాషలో చదవడం వలన సరైన ఉపాధి దొరకదనే అపోహ ఉన్నది కానీ అది నిజం కాదు. మాతృభాషలో చదవడం వలన న్యూస్ రీడర్స్ గాను, వార్తా ఛానల్స్ లో వ్యాఖ్యాతలుగాను, కవులు, రచయితలుగాను మాతృభాషా ఉపాధ్యాయులుగాను రాణించవచ్చును. కావునా మాతృభాషను ఎప్పుడూ చులకనగా చూడరాదు
ప్రభుత్వాలు కూడా మాతృభాషా అభివృద్ధికి పూనుకోవాలి. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ ఆదేశాలన్ని తెలుగులో ఉండేలా చూడాలి
1నుండి 12 తరగతుల వరకు మాతృభాషను తప్పనిసరిగా చదవాలనే నిబంధనను తీసుకురావాలి. ఆంగ్లంలో ఉన్న పదాలను యధాతధంగా వాడకుండా వాటికి సరియైన తెలుగు భాషా పదాన్ని సృష్టించి వాడుక భాషకు అనుకూలంగా ఆ పదాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
ఈ ప్రయత్నాన్ని ఈనాడు దినపత్రిక, తెలుగు వెలుగు మాసపత్రిక నెరవేరుస్తున్నాయి. అందులో చాలా ఆంగ్ల పదాలను తెలుగులో అనువదించి ప్రజలకు చేరువ చేస్తున్నాయి.
  టీవీ సినిమా చాల బలమైన మాధ్యమం కాబట్టి వీటిలో తెలుగును వాడినట్లైతే త్వరగా ప్రజలకు భాషా పదాలు చేరువ అవుతాయి
(* గొబ్బూరి గంగరాజు, తెలుగు పండితులు, పాల్వంచ, చేపలుకి :9032273064)

(telugumaata@googlegroups.com నుంచి తీసుకున్నది)