ఆంధ్రలో న్యాయవ్యవస్థే దాడికి దిగడం ఏమిటి? : రాజ్యసభలోవిజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిష్పాక్షికతను విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం పై దాడి చేసిందని  వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు.
అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెల్లడించిన తాత్కాలిక ఆదేశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అమరావతి భూముల కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ ఇతరులపై సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తూ ఈ ఆదేశాలు జారీచేసిందని ఆయన అన్నారు.
ఆయన ఏమన్నారంటే…
ఎఫ్ఐఆర్ వివరాలకు సంబంధించి ఎలాంటి వార్తలు, సమాచారం మీడియా, సోషల్ మీడియాలో ప్రచురణ కాకుండా నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాను ఎందుకు సెన్సార్ చేయాలని ప్రశ్నిస్తూ పిటిషనర్ ఎలాంటి రుజువులు, ఆధారాలు చూపలేదు.  కేవలం పిటిషనర్ ఆరోపణల ఆధారంగా కోర్టు మీడియాపై సెన్సార్షిప్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పైగా సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అసాధారణంగాను, అత్యంత సందేహాస్పదంగా ఉన్నాయి. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పిటిషనర్‌ ఆరోపించినట్లుగా ప్రభుత్వం తమని వేధిస్తునట్లయితే అటువంటి అంశాలకు విస్తృత మీడియా ప్రచారం ద్వారా పిటిషనర్‌కు మేలు జరుగతుంది.
కానీ ఈ కేసులో మీడియాపై ఆంక్షలు విధించాలని పిటిషనర్‌ కోరడం కోర్టు ఆమేరకు ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు సందేహాస్పదంగా ఉన్నయి.
మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించడం సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో దీనికి భిన్నంగా అసాధారణ రీతిలో న్యాయవ్యవస్థ మీడియాపై ఆంక్షలు విధించడం విడ్డూరంగాను, రాజ్యంగ స్పూర్తికి విరుద్దంగా ఉంది.
 ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ నిష్పాక్షింగా వ్యవహరించడం లేదు. ఒక వైపు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే మరోవైపు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాపై విజయవంతంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చడానికే న్యాయవ్యవస్థ ఇలా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ప్రబలిపోయింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి బాగోతాలపై మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ జరగకుండా నిరోధించేందుకు పరోక్షంగా పిటిషనర్లకు సహకరిస్తూ ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకతోను, పక్షపాత ధోరణితోను న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అటు ఆర్థిక రంగం సృష్టించిన సంక్షోభంతోపాటు ఇటు న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోంది.