రఘురామకృష్ణంరాజు వెనక టిడిపి బిజెపి ఉన్నాయి: వైసిపి ఎంపిలు

న్యూఢిల్లీ:  వైయస్‌ఆర్‌సిపి ఎంపీగా ఉంటూ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుతో ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్ కు పిటీషన్ ఇచ్చినట్లు వైయస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి తెలిపారు.
లోక్‌సభ స్పీకర్ ను కలిసిన తరువాత ఆయన లోక్ సభ సభాపక్ష నేత  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చీఫ్‌విప్  మార్గాని భరత్, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలసి విలేకరులతో మాట్లాడారు.
రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి, ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం చర్య తీసుకోవాలి కోరామని తెలిపారు. అలాగే వాలంటరీ గివింగ్‌అప్ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ను ఆయనకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.

తాము అందచేసిన పిటీషన్ ను స్వీకరించిన స్పీకర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
 ఏ పార్టీ టిక్కెట్టుపై, ఏ పార్టీ మేనిఫెస్టోకు కట్టుబడి, ఏ పార్టీ గుర్తుతో గెలిచారో అదే పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేయడం దారుణమని అన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, పార్టీ అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం, చివరికి సంస్కారవంతం కాని భాషలో ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యతిరేకమైనవిగా తీవ్రంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.
రఘురామ కృష్ణంరాజు  స్వపక్షంలో విపక్షంగా మారిపోయారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సిపిలో వుంటూనే ఇతర పార్టీలతో మంతనాలు చేస్తూ, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, ఇంతకన్నా ఆయనపై అనర్హత వేటు వేసేందుకు కారణాలు ఏమిటని ప్రశ్నించారు.
పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్‌ఆప్ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ ఆయనకు వర్తిస్తుందని అన్నారు. రఘురామకృష్ణంరాజు పార్టీలో వుంటూ చాలా అసహ్యకరమైన పరిస్థితిని, నైతిక విలువలు కోల్పోయి పార్టీపై వ్యతిరేకతతో, క్రమశిక్షణ లేకుండా, సొంతపార్టీలో వున్న వారినే దూషించడం అత్యంత దారుణమని అన్నారు. ఆయన కొన్ని ఊహాజనిత విషయాలను ఊహించుకుని, ప్రజల్లో తప్పుడు సంకేతాలన పంపే ప్రయత్నం చేశారని అన్నారు.
పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌ను సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు కోర్ట్‌ను ఆశ్రయించారని విలేరులు అడిగిన ప్రశ్నపై స్పందించారు. పార్టీ నుంచి ఇచ్చింది షోకాజ్‌ నోటీస్ మాత్రమేనని, దానిపైనే ఆయన కోర్ట్‌కు వెళ్లారని అన్నారు. ఇప్పుడు స్పీకర్‌కు ఇచ్చింది అనర్హతవేటు పిటీషన్ అని, దీనిపై నిర్ణయం పూర్తిగా స్పీకర్‌కే వుంటుందని అన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజ్యాంగబద్దంగా వున్నదా లేదా అనే అంశాలను కోర్ట్‌లు పరిశీలిస్తాయని తెలిపారు. అంతేకాకుండా పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్‌అప్‌ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ కింద కూడా రఘురామకృష్ణంరాజుపై చర్య తీసుకోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు.రాజ్యసభలో అనర్హత వేటుపై మూడు నెలల్లో చర్య తీసుకోవాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లోక్‌సభ స్పీకర్ కూడా తాము ఇచ్చిన పిటీషన్ పై మూడునెలల్లో చర్యలు తీసుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
 లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ... రఘురామకృష్ణంరాజు మొదటిసారి సభ్యుడు అయినప్పటికీ సీఎం వైయస్‌ జగన్ గారు ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సీనియర్ ఎంపీలు వున్నప్పటికీ ఆయన కోరిన వెంటనే పార్లమెంట్ కమిటీల్లో చైర్మన్ పదవికి అంగీకారం తెలిపారని అన్నారు. సీఎంగారు ఆయనకు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదని అన్నారు. కానీ టిడిపి హయాంలో జరిగిన టిటిడి నిర్ణయాన్ని ఇప్పుడు వివాదం చేస్తూ, ఈ ప్రభుత్వంపై బుదరచల్లే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. నిజంగా ఎంపీగా ఆయనకు అభ్యంతరాలు వుంటే టిటిడి చైర్మన్, అధికారులతో ఏనాడు దీనిపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. బిజెపి, టిడిపి కలిసి వున్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను, ఆ సమయంలో ఆ పార్టీలతో వున్న రఘురామకృష్ణంరాజు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పైకి జగన్ గారు మంచివారు అంటూనే, పార్టీని నష్టపరిచేలా, అందరినీ దూషించేలా బహిరంగంగా ఎలా మాట్లాడతారని అన్నారు. ఆయనకు పార్లమెంట్ లోనూ, బయట కూడా మంచి గౌరవం ఇచ్చామని, కానీ దానిని కాపాడుకోలేక పోయారని అన్నారు.

టిడిపి నాయకుల ప్రోత్సాహంతో, టిడిపి నుంచి బిజెపికి స్వలాభం కోసం వలస వెళ్ళిన నాయకుల ప్రోద్భలంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు : మిధున్ రెడ్డి

ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు కూడా సరైన విధంగా సమాధానం ఇవ్వలేదని అన్నారు. టిడిపి అంటే తెలుగుదేశం, బిజెపి అంటే భారతీయ జనతాపార్టీ అని అలాగే వైయస్‌ఆర్‌సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. దీనిని లీగల్ వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయనపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నిక వస్తుందని, ప్రజలు ఇచ్చే తీర్పును కూడా అందరూ చూస్తానని అన్నారు.
 చీఫ్ విప్ మార్గాని భరత్ మాట్లాడుతూ…
లోక్‌సభ స్పీకర్ ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి పార్టీలో వున్న రఘురామకృష్ణంరాజు మీడియా ద్వారా చేస్తున్న వివాదాలకు, పార్టీని ఇబ్బంది పెట్టే విధానాలకు పూర్తిగా స్వస్తి చెప్పాల్సి వుందని అన్నారు. తనకు పార్లమెంట్ లో ఇచ్చిన పదవిలో పార్టీ పాత్ర పదిశాతం అయితే, తనది తొంబైశాతం అని ఆయన చెప్పుకోవడం దారుణమని అన్నారు. పార్టీ నుంచి స్పీకర్ కు ఇచ్చిన లేఖ ఆధారంగానే ఆయనకు సబార్డినేట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రఘురామకృష్ణంరాజు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. జగన్ గారు మీకు టిక్కెట్టు ఇవ్వబట్టే గెలవగలిగారని అన్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలను దూషించడం సరికాదని అన్నారు. తిరుమల భూముల విషయంలో బిజెపి, టిడిపిలో వున్నప్పుడు ఆరోజు తీసుకున్న జీఓను గురించి ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎంగారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరని స్పష్టం చేశారు. అలాగే రఘురామకృష్ణంరాజు ఇంగ్లీష్ మీడియం గురించి కూడా వివాదాస్పదంగా మాట్లాడారని అన్నారు. వైయస్‌ఆర్‌సిపిలో వుంటూనే టిడిపితో కోవర్డ్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం లేదని చెబుతూనే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఆయన చేసిన నిర్వాకం ఏమిటో ప్రజలు గమనించారని అన్నారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడుతుందని, రానున్న ఉప ఎన్నికల్లో తన బొమ్మతో రఘురామకృష్ణంరాజు పోటీ చేసి తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
 బాపట్ల ఎంపి  నందిగం సురేష్ మాట్లాడుతూ...
వైయస్‌ఆర్‌సిపి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజును ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. త్వరలోనే ఆయనపై అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. కన్నతల్లిలాంటి పార్టీకి రఘురామకృష్ణంరాజు ద్రోహం చేస్తున్నాడని,
పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయాలని సూచించారు. ఆయన ఇప్పటికే ఆయన మూడు పార్టీలు మారాడని, ఇప్పుడు వెళ్లబోయే పార్టీలో అయినా వుంటాడా అనేది అనుమానమేనని అన్నారు. ఒక పార్టీలో వుంటూ మరో పార్టీవైపు దొంగచూపులు చూసే బుద్ది ఆయనది విమర్శించారు. బ్యాంక్‌లకు ఎగనామం పెట్టేవారు బిజెపిలో చేరారని, ఇప్పుడు వారంతా మాతో కలిసిపో అని రఘురామకృష్ణంరాజును ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. పార్టీపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. తన సొంత టాలెంట్ పై గెలిచాను అని చెప్పుకుంటున్న ఆయనకు అంత నమ్మకం వుంటే రాజీనామా చేసి తన బొమ్మ పెట్టుకుని గెలవాలని డిమాండ్ చేశారు. పార్టీపై వ్యాఖ్యలు చేసే సందర్బంలో ఆయన తన
నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. టిడిపి నేతలతో కుమ్మక్కు అయ్యి, ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. ఆయనకు ఇబ్బంది కలిగించే విషయాలు త్వరలో బయటకు రాబోతున్నాయని, కాబట్టి టిడిపి వారి సహకారంతో బిజిపి వైపు పోతే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతానని అనుకుంటున్నారని విమర్శించారు.
నర్సరావుపేట ఎంపి  లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ…
సొంత పార్టీలోని అధినాయకత్వం, పార్టీ ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకుని, తనకు ఓటు వేసిన ప్రజలకు కూడా ఏమీ చేయలేని స్థితిలో రఘురామకృష్ణంరాజు వున్నారని అన్నారు. ఈ వివాదాలతో ఆయన సాధించింది ఏమిటో ప్రశ్నించుకోవాలని సూచించారు. నిజంగా ఈ పార్టీలో వుండలేకపోతే జగన్ గారు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి, బయటకు వచ్చి ఎన్నికల్లో సొంతగా పోటీ చేశారని, అలాగే రఘురామకృష్ణంరాజు కూడా రాజీనామా చేసి, సొంతగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు