వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణం రాజుకు షోకాజ్ నోటీస్, వేట్టుపడ్డట్లే…

తాడేపల్లి: తొలినుంచి వైసిపి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటమేకాకుండా  పార్టీ అధినేత ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకుండా మాట్లాడుతున్న నర్సాపురం ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు మీద క్రమశిక్షణ చర్యకు రంగం సిద్దమయింది. పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నందుకు ఈ రోజు వైసిపి  ఎంపికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.వైసిపి లో ఇంతవరకు రఘరామరాజులాాగా ఎన్నికల్లో గెలిచాక తిరుగుబాటు చేసిన వాళ్లు లెవరు? గతంలో కొందరు నాయకులు అధినేత జగన్ విధాానాలు వ్యతిరేకించివెళ్లినా, గెలిచిన వాళ్ల నుంచి ఎలాంటి సమస్య పార్టీ కి ఎపుడూ ఎదురు కాలేదు.  దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయింది
Vijayasai Reddy
 పార్టీ గుర్తు మీద గెలిచి, పార్టీని అవమానించే విధంగా ప్రవర్తించడంపై   రఘురామకృష్ణ రాజుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. షో కాజ్ నోటీసు పూర్తిపాఠం:
ఆ నోటీసులో ముఖ్యాంశాలు ఏమిటంటే… 
ఇటీవల మీ ప్రవర్తన మరియు పార్టీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న బహిరంగ ప్రకటనలపై పార్టీ తరుపున షో కాజ్ నోటీసు ఇస్తున్నాం. 2019 ఏప్రిల్ లో మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నర్సాపురం నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. అలాగే లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యునిగా కూడా ఎన్నికకాబడ్డారు.
ఇటీవలి కాలంలో, మీరు పార్టీ యొక్క ప్రాథమిక సభ్యునిగా ఉండటానికి పలు సందర్భాలలో మీ అయిష్టతను వ్యక్తం చేస్తున్నట్టు మీ చర్యల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై మీరు చేసిన వాఖ్యలను బట్టి మీరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసమ్మతితో ఉన్నట్లు బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు.
మీ ప్రవర్తనకు-పార్టీ వ్యతిరేక ప్రకటనలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇవి…
1. వైయస్ఆర్సీపీ తన ఎన్నికల మేఫెస్టోలో, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రజలు ఈ చర్యకు మద్దతుగా నిలిచారు. అయితే, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా, ఇంగ్లీషు మీడియంపై మీరు వైయస్ఆర్సీపీ, ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. దీనికి సంబంధించి మీ వ్యాఖ్యలను ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల క్లిప్పింగ్స్, టీవీల్లో ప్రసారం అయిన మరికొన్ని వీడియోలను కూడా జత చేశాం.
2. అలానే, రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుంటున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు.
3. మీ ఎన్నికల విజయానికి వైయస్ఆర్సీపీ లేదా శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కారణం కాదంటూ.. పార్టీని, పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం జరిగింది. బహిరంగ ఉపన్యాసంలో పార్టీ ప్రాథమిక నిబంధనలను అవమానించడమే కాకుండా, పార్టీ నుండి దూరంగా ఉండటానికి మరియు పార్టీ నుండి విడిపోవడానికే మీరు ఇదంతా చేస్తున్నారని మీ చర్యలు స్పష్టంగా సూచిస్తున్నాయి.
4. వివిధ టీవీ చానల్స్ చర్చలలో.. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా.. పలు విమర్శలు చేశారు.
5. ఒక టీవీ చర్చలో మాట్లాడుతూ.. పార్టీ శాసనసభ్యులను పందులతో పోలుస్తూ అవమానించారు.

https://trendingtelugunews.com/telugu/breaking/will-ysrc-expel-narsapur-rebel-mp-raghuramakrishnam-raju-from-the-party/

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. పైన పేర్కొన్న ప్రతి చర్యా.. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల మీ యొక్క వ్యతిరేక ప్రవర్తనను ప్రతిబింబిస్తు్న్నాయి.
కాబట్టి, ఈ షోకాజ్ నోటీసులపై సమాధానం చెప్పటానికి మీకు 7 రోజులు గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్టీ మరియు పార్లమెంటరీ పార్టీ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.