ఆంధ్ర మీద ఈ వివక్ష ఏమిటమ్మా? : నిర్మలా సీతారామన్ తో వైసిపి ఎంపిలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్ లోని వెనకబడిన ప్రాంతాలకు నిధులందించడంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని వైసిపి ఎంపిలు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలిపారు. ఎలా వివక్ష చూపుతున్నారో కూడా వారు  ఆమె కు ఒక వినతిపత్రం సమర్పిస్తూ వివరించారు.
ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర సమస్యల గురించి చర్చించేందుకు అవకాశం రాకపోవడంతో వైసిపి ఎంపిలు ఈ రోజు ఆర్థిక మంత్రిని కలుసుకున్నారు. ఈ మధ్య జగన్ రెండు సార్లు ఢిల్లీ వచ్చి వెళ్లారు. ఆయన ప్రధానిని కలుసుకోలేకపోయారు. హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా సమావేశం కాలేకపోయారు.
ఒకపుడు వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో తిష్ట వేసి  కథనడిపించే వాడని చెప్పుకునే వారు. దీని మీద టిడిపి పెద్ద విమర్శులు కూడా  చేసింది. ఇపుడు ఎన్డీఎ ప్రభుత్వం, వైసిసి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చినట్లు ఉంది. వైసిపి నేతలకంటే వైసిపిలో ఉన్న కొంతమంది ఎంపిలకు ప్రధానిమోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంపి లు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలుసుకున్నారు. రాష్ట్రం మీద వివక్ష ఎలాచూపిస్తున్నారో రాతపూర్వకంగా చెప్పారు.
వివక్ష ఎలాగంటే…
1. యూపీ, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌, ఒడిషాలోని కలహండికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశారు. ఆయా ప్రాంతాల్లోని తలసరి ఆదాయం ప్రాతిపదికన ప్యాకేజీ గ్రాంట్‌ను నిర్ణయించడం జరిగింది. బుందేల్‌ఖండ్‌, కలహండి ప్రాంతాల్లో తలసరి ఆదాయం 4 వేల రూపాయలుగా లెక్కగట్టి ప్యాకేజీ అందించారు. అదే ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు వచ్చే సరికి తలసరి ఆదాయాన్ని కేవలం 400 రూపాయలుగా లెక్కించడం జరిగింది. నిర్హేతుకమైన ఈ ప్రాతిపదికను సరిదిద్దాల్సిందిగా విజ్ఞాపన పత్రంలో వైసిపి ఎంపిలు పేర్కొన్నారు.
2. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్‌ కింద 1050 కోట్లు ఇవ్వండని రాష్ట్రం కోరింది.  రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఆరేళ్ళపాటు ప్రత్యేక సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఆ 1050 కోట్లను కూడా విడుదల చేయాలని వారు కోరారు.
3. రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించాలని ఎంపిలు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో జరిపిన సమావేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సవరించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. ఈ అంశానికి త్వరిగతిన పరిష్కారం కనుగొని రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద రాష్ట్రానికి రావలసిన 18,969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి.
4. జీఎస్టీ బకాయిల కింద 1605 కోట్లు వెంటనే విడుదల చేయాలని వైసిపి ఎంపిలు విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు బకాయిల కింద కేంద్రం రాష్ట్రానికి 1605 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంది. నెలల తరబడి ఈ మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టడాన్ని ఎంపీలు ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో జీఎస్టీ బకాయిల చెల్లింపుల్లో అసాధారణ జాప్యం నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమస్యల్లో కూరుకుంటుందో వివరించాల్సిన అవసరం లేదు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతున్నందున ఈ బకాయిలపై తక్షణమే చర్యలు తీసుకుని రాష్ట్రానికి రావలసిన 1605 కోట్ల రూపాయలను విడుదల చేయవలసిందిగా ఎంపీలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజక్టు నిధులెప్పుడిస్తారు?
పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేసిన ఖర్చును వెంటనే తిరిగి చెల్లించాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
కేంద్రం నుంచి అనేక పద్దుల రూపేణా రాష్ట్రానికి రావలసిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఎంపీలందరూ సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని మంత్రికి సమర్పించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,103 కోట్ల రూపాయల రుణం తీసుకుని ఖర్చు చేసింది.
ఈ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలి. అలాగే 55,548 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను వెంటనే ఆమోదించాలి. ప్రాజెక్ట్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును 15 రోజుల గడువులోగా కేంద్రం తిరిగి చెల్లింపులు జరిపేలా ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాలని ఆ విజ్ఞాపన పత్రంలో ఎంపీలు కోరారు. విజ్ఞాపన పత్రంలోని ఇతర ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి, లోక్ సభ పక్ష నేత  మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీ ఎంపీలు బుధవారం పార్లమెంట్‌లోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు.