పవన్ జనసేన తదుపరి అడుగెటు పడుతుంది?

(రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా, ఆంధ్రలో మరొక ప్రాంతీయ పార్టీ ఎదురుగుతుందని చాలా మంది ఆశించారు. డెమెక్రసీలో మరొక పార్టీ సీరియస్ పార్టీ రావడం మంచి పరిణామమే. ఎవరో అన్నారు, వేయిభావాలు ఘర్షించనీ,వేయిపూలు వికసించనీ అని. పార్టీ పెట్టినపుడు ఆయన వపన్ కల్యాణ్ హావభావాలు అమ్మో మరొక కొత్త పార్టీ వచ్చేస్తుందని పించింది. ఆయన ముఖ్యమంత్రి రేస్ లో ఉంటారనపించింది. అభిమానులంతా ‘సీఎం… సీఎం ’ అని అరిచారు. ఇపుడేమో ఆయన అన్ని మర్చిపోయి సొంత ప్రయాణం మానేసి బిజెపితో కవాతు చేయాలనుకుంటున్నారు.అలా సిఎం అవ్వాలనుకుంటున్నారా? ఎందుకలా జరిగింది?సీనియర్ జర్నలిస్టు ఫణికుమార్ కామెంట్  )
 కోపల్లె ఫణి కుమార్ 
అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ జెండాను దించేశారు. ఇలా, బిజెపితో పొత్తులు పెట్టుకోవటం ద్వారా తన భారాన్ని చాలా వరకూ దించేసుకున్నారు. ఎలాగంటే జనసేన పార్టీని సుమారు ఏడేళ్ళ క్రితం ఏర్పాటు చేసినా భిన్నమయిన పార్టీ గా ఎదగ లేకపోయింది. ఒక్కటి చుట్టూ తిరుగుతూ పోయింది. ఇంత వరకూ నడుస్తున్నది వన్ మ్యాన్ షోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. జనసేనలో 1 నుండి 10 వరకూ ఉన్న గట్టి నేతలను చెప్పమంటే క్రింద నుండి పై వరకూ ఒక్క పవన్ మాత్రమే కనబడతారు.
ఏడేళ్ళ క్రితం పార్టీ పెట్టారన్నమాటే కానీ ఏ స్ధాయిలోను కార్యవర్గం ఏర్పాటు కాలేదు. ఏ పార్టీకైనా పిరమిడ్ స్టైల్లో అంటే రాష్ట్ర కార్యవర్గం నుండి గ్రామస్ధాయి వరకూ ఏర్పాటు చేసే కార్యవర్గాలే బలమన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపార్టీ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తుంది. ఇందుకు జనసేన మాత్రమే మినహాయింపు అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది.
ఏ స్ధాయిలో కూడా పార్టీకి కార్యవర్గం అన్నది లేకపోవటంతో పార్టీకి కర్త, కర్మ, క్రియ మొత్తం పవనే. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ జరిగినా స్పందించాల్సింది పవన్ మాత్రమే. ఇటువంటి మోయలేని భారమున్నా పవన్ మాత్రం కలుగులో నుండి ఎలుక బయటకు వచ్చినట్లు తానిష్టం వచ్చినపుడు మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ అడ్రస్ కనబడరు.
ఇటువంటి నేపధ్యంలోనే పార్టీని నడపటానికి పవన్ పనికిరాడనే ప్రచారం బాగా పెరిగిపోయింది. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఫలితం కూడా దీనికి ఊతమిచ్చింది. ఇటువంటి పరిస్ధితుల్లోనే పవన్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. కమలం పార్టీకి గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయి వరకూ కార్యవర్గాలున్నాయి కాబట్టి పార్టీ పరంగా ఇబ్బంది లేదు. అందుకనే రెండు పార్టీలను నడిపే భారాన్నంతా పవన్ కమలం పార్టీపై వేసేసినట్లే అనిపిస్తోంది. తొందరలోనే జనసేనను బిజెపిలో విలీనం ఖాయమనే అంటున్నారు. ఈ లెక్క చూస్తుంటే పవన్ జనసేన గుడారం ఎత్తేసినట్లే అనిపిస్తోంది.