Home Breaking కాంగ్రెస్ లో కుంపటి పెడుతున్న ఆ సొంత నేత ఎవరు?

కాంగ్రెస్ లో కుంపటి పెడుతున్న ఆ సొంత నేత ఎవరు?

527
0

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో కకావికలం అవుతున్నది హస్తం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ చావుకొచ్చినయా అన్నట్లు ఉంది పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎన్నికల నాటి వరకు కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా టిఆర్ఎస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2023 నాటికి కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలే చాన్స్ ఉంటుందేమో అని సొంత పార్టీ నేతలు సెటైర్స్ వేసుకుంటున్నారు. ఇంతకూ కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెడుతున్న నాయకుడు ఎవరబ్బా అని రాజకీయ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఎవరా నేత? ఆయన ఎందుకు పార్టీకి ఎసరు పెడుతున్నారు?

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి చేరిక అధికారిక నిర్ణయం జరగలేదు. మిగతావారంతా చేరతామని ప్రకటించారు. రేపో మాపో సబిత కూడా కారెక్కే తేదీని ప్రకటించవచ్చని చెబుతున్నారు. తన కొడుకు కార్తీక్ రెడ్డికి ఎంపీ సీటు, తనకు మంత్రి పదవి ఇస్తారని, ఆ రెండు అంశాలపై క్లారిటీ వస్తే ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పవచ్చని అంటున్నారు. వీరే కాకుండా టిడిపికి సంబంధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా కారెక్కుతానని విస్పష్ట ప్రకటన చేశారు. మరో టిడిపి ఎమ్మెల్యే అశ్వరావుపేటకు చెందిన మెచ్చా నాగేశ్వరరావు కూడా కారెక్కే చాన్స్ కనబడుతోంది.

సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి

ఆపరేషన్ ఆకర్ష్ తో విలవిల…

ఇక కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకుల్లో సింహ భాగం ఎమ్మెల్యేలు కారెక్కవచ్చని టాక్ వినబడుతోంది. బంగారు తెలంగాణ, నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా అభివృద్ధి లాంటి అందమైన మాటలు చెబుతూ ఎమ్మెల్యేలంతా గులాబీ గూటిలో కలిసిపోతున్నారు. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ 19 గెలిస్తే ఇప్పుడు ఐదుగురు టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సన్నాాహాలు చేసుకుంటున్నారు. మిగిలిన 14 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మరో 11 మంది కూడా గులాబీ తీర్థం పుచ్చుకోవచ్చన్న చర్చలు సాగుతున్నాయి.

అయితే కాంగ్రెస్ పార్టీలో నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత టిఆర్ఎస్ కు అనుకూలంగా చక్రం తిప్పుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని తన సన్నహితులందరినీ ఇంటికి పిలిపించుకోవడం, పార్టీ వీడిపోవాలని వత్తిడి చేస్తున్నట్లు పార్టీ నేతల్లో సైతం టాక్ వినబడుతోంది. ఇప్పుడు పార్టీ మారుతున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యేల్లో సగానికి పైగా సభ్యులు నల్లగొండ కీలక నేత సలహాలు, సూచన మేరకే పార్టీ మారినట్లు చెబుతున్నారు. తన కుటుంబానికి టిఆర్ఎస్ లో ఎంపీ సీటు దక్కించుకోవడంతోపాటు ఒక మంత్రి పదవి కూడా వారు ఆశిస్తున్నట్లు నల్లగొండ రాజకీయాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా ఆశించే సొంత పార్టీలో కుంపటి రగిలిస్తున్నారని పిసిసి నేత ఒకరు పేర్కొన్నారు.

హరిప్రియ నాయక్ చేరికలో హైడ్రామా ?

ఇల్లెందు ఎమ్మెల్యే హరి ప్రియా నాయక్

ఇల్లెందు ఎమ్మెల్యే హరి ప్రియా నాయక్ కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరడంలో పెద్ద హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. పార్టీ మారాలన్న ఆసక్తి ఆమెకు ఏమాత్రం లేదని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తనకు గుర్తింపును ఇచ్చినందున కాంగ్రెస్ లోనే కొనసాగాలని ఆమె ఆసక్తితో ఉన్నారని కూడా అంటున్నారు. కానీ ఆమెపై వత్తిడి పెంచడం కోసం ఆమె కుటుంబసభ్యులను రంగంలోకి దింపినట్లు ఆరోపణలున్నాయి. అంతిమంగా హరిప్రియ కుటుంబసభ్యుల మీద వత్తిడి తెచ్చి ఆమెను బలవంతంగా పార్టీ మార్పిస్తున్నట్లు చెబుతున్నారు. చిరుమర్తి లింగయ్య కానీ, ఆత్రం సక్కు, రేగా కాంతారావుకానీ వారు బాజాప్తా తాము టిఆర్ఎస్ లో చేరబోతున్నామని, కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వారు లేఖలు రాసి ప్రకటించారు. కానీ హరి ప్రియ నాయక్ మాత్రం అలాంటి లేఖ కాకుండా ఏ ఆధారం లేకుండా ఒక లేఖను వెలువరించారు. అందులో ఆమె పేరు కానీ, లెటర్ హెడ్ కానీ ఏవీ లేకుండానే లేఖను రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో సదరు నల్లగొండ కీలక నేత వత్తిడి తీవ్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. హరి ప్రియ నాయక్ రాసిన లేఖ కింద ఉంది చూడండి.

అప్పుడు ఎర్రబెల్లి… ఇప్పుడు ఈయన

తెలంగాణ తొలి అసెంబ్లీలో టిడిఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి పంపించినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక్కొక్కరిని టిడిపి సైకిల్ మీదినుంచి దింపి టిఆర్ఎస్ కారు ఎక్కించారని ప్రచారంలో ఉంది. అలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయడంలో ఎర్రబెల్లి కీలక పాత్ర పోశించారని టిడిపి నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. టిఆర్ఎస్ బలోపేతం చేయడం ద్వారా ఎర్రబెల్లి దయాకర్ రావు కు రెండు రకాల ప్రయెజనాలు కలిగాయని అంటున్నారు. అందులో ఒకటి మంత్రి పదవి లభించడమైతే, రెండోది తన కుల ప్రభావం పెంచడం గా అభివర్ణిస్తున్నారు.

అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ వ్యూహం అయితే అనుసరించారో ఇప్పుడు నల్లగొండ కీలక నేత అదే వ్యూాహాన్ని అనుసరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సదరు నల్లగొండ కీలక నేత వ్యవహారం కారణంగా టిఆర్ఎస్ నేతలు చేతికి మట్టి అంటకుండానే, ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం విజయవంతంగా చేపడుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఆ నల్లగొండ నేత ఎవరు? అనేది పార్టీ పెద్దలకు సమాచారం ఉన్నప్పటికీ మింగలేక కక్కలేక అన్నట్లు వారి పరిస్థితి ఉందని గాంధీభవన్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

ఆత్ర సక్కు, రేగా కాంతారావు

 

 

ఈ వార్త చదవండి…

తొలిజాబితాలో 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here