సారా రహితంగా పంచాయతీ ఎన్నికలు: విజయనగరం ఎస్ పి

విజయనగరం జిల్లాలో 2, 3, 4 విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలను మద్య రహితంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్ బి రాజకుమారి కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో  ప్రత్యేకంగా ఇపుడు దీని మీదే  దృష్టి పెట్టింది.

రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్ ఇ బి పోలీసులే అత్యధికంగా నాటు సారా, మద్యం స్వాధీనం చేసుకుని, 70వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి అగ్రభాగాన ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా తరలించే వారిపై 56 కేసులను నమోదు చేసి 42మందిని అరెస్టు చేశారు.

అంతేకాకుండా, స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంటు బ్యూరో సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించి 1222 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడం, 25, 830 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికలను మద్యరహితంగానిర్వహించేందుకుగాను గతంలో మద్యం కేసుల్లో అరెస్టు కాబడిన 529 వ్యక్తులను బైండోవరు చేశారు.

వీరందరిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు కోర్టుల్లో మంచి ప్రవర్తనకు, మద్యం అమ్మకుండా ఉండేందుకు గాను బాండులను కూడా
తీసుకున్నారు.

ఈ కారణాలతో ఈ పంచాయతీ  ఎన్నికలను జిల్లాలో సారా రహిత ఎన్నికలు నిర్వహించ గలుగుతామని  జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ధీమాగా ఉన్నారు.

దీనికోసం మద్యం, నాటు సారా అక్రమ తయారీ, రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఎస్ ఇబి కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేశారు. ప్రజలు మద్యం, నాటుసారా అక్రమ తయారీ, రవాణా సమాచారాన్ని .  08922-274865కు లేదా 94409 02363 కు అందించవచ్చు అని జిల్లా  రాజకుమారి ప్రకటించారు.

ఇందుకు సంబందించి ఎస్ ఈబి పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా ఎస్పీ రాజకుమారి తన చాంబరులో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఈ కంట్రోల్ రూమ్ కు  సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అక్రమార్కులపై దాడులు నిర్వహించి, ఎన్నికలను మద్యరహితంగా నిర్వహిస్తామని రాజకుమారి తెలిపారు.

ఇందుకు గాను 6 ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టులను, మరో 9 అంతరాష్ట్ర, అంతర జిల్లా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశామని,  వాహన తనిఖీలను నిరంతర పర్యవేక్షణకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్ పి చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నందున ఓటర్లుకు ‘బహుమతులు’గా ఇచ్చేందుకు ఎటువంటి వస్తువులను తరలించకుండా నిరంతరం వాహన తనిఖీలను చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఎ ఈ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, ఎఆర్డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు, ఎస్ ఈ బి ఎస్ ఈ బి ఎస్ఐ పి. పాపారావుమరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *