మోదీ ప్రభుత్వ బడ్జెట్ మీద విజయసాయి అసంతృప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: జీవిత బీమా సంస్థ (LIC) లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన చారిత్రక తప్పిదం కాగలదని వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. నిధుల సమీకరణ కోసం జోరుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న ప్రతిపాదనలు శ్రేయస్కరం కావని ఆయన అన్నారు.
వార్షిక బడ్జెట్‌పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌కు తమ మద్దతును ప్రకటిస్తూనే పన్నుల ద్వారా కాకుండా పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే….
‘పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుతం వస్తున్న 65 వేల కోట్ల రూపాయలకు బదులుగా 2020-21లో 2 లక్షల 10 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని బడ్జెట్‌లో నిర్దేశించుకోవడం జరిగింది. అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు రెట్లు ఆదాయం పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.  ప్రధానంగా దశాబ్దాలుగా ప్రజాదరణను చూరగొన్న అత్యంత విలువైన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించాలన్న నిర్ణయం చారిత్రక తప్పిదంగా మిగిలిపోగలదు. పన్నుల వసూళ్ళ ద్వారా లక్షా 50 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని గత ఏడాది బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో దారుణంగా విఫలమైంది. పైగా కార్పొరేట్ పన్నులలో కోత విధించిన కారణంగా ఖజానాపై లక్షా 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ ఆ చర్య వలన ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. కార్పొరేట్‌ టాక్స్‌లో కల్పించిన రాయితీ వలన కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా లేవు.
 బడ్జెట్‌ను ఐసీయూలో ఉన్న పేషంట్‌గా అభివర్ణిస్తూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. 2013-14లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు  ద్రవ్యలోటు 5.2 శాతం ఉంటే ప్రస్తుతం 3.8 శాతం ఉంది. ఆదాయ లోటు 3.9 శాతం ఉంటే ప్రస్తుతం అది 2.4 శాతం ఉంది. సబ్సిడీలు మొత్తం అప్పట్లో 1 కోటి 90 లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం 2 లక్షల 62 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.
చిదంబరం హయాంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 292 బిలియన్‌ డాలర్లు ఉండగా ప్రస్తుతం ఆ నిల్వలు 450 బిలియన్‌ డాలర్లకు చేరింది. విదేశీ పెట్టుబడులలో 5 శాతం అభివృద్ధి నమోదు కాగా ప్రస్తుతం అది 16 శాతం ఉంది. ఉపాధి హామీ పథకానికి 33 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా ఈ బడ్జెట్‌లో అది 66 వేల కోట్ల రూపాయలకు చేరింది. 2013-14లో ద్రవ్యోల్బణం 10.5 శాతానికి చేరగా ప్రస్తుతం అది 4.5 శాతం ఉంది. అప్పుడు 5 లక్షల వేతనం వచ్చే వ్యక్తి ఏడాదికి 30 వేల రూపాయల ఐటీ చెల్లించగా ప్రస్తుతం అది సున్నాకు చేరింది.
దేశ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్న విషయం వాస్తవమే అయినప్పటికీ కేవలం మందులతో మాత్రమే రోగానికి చికిత్స సరిపోదని స్వస్థత చేకూరుతుందన్న ఆశ కూడా రోగి కోలుకునేలా చేస్తుంది.
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం అసంతృప్తి మిగిలించింది.  జీఎస్టీ ఆదాయంలో వచ్చిన నష్టం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 నవంబర్‌-డిసెంబర్‌ కాలానికి రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం విచారకరం.  జీఎస్టీ బకాయిలను ఆయా రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేలా పర్యవేక్షించేదుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది.
పోలవరం ప్రాజెక్ట్‌ డీపీఆర్‌పై నిర్ణయం ఎప్పుడు?
పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3,283 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్రానికి చెల్లించాల్సి ఉన్నా దాని గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు.  అలాగే పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 55,548 కోట్ల రూపాయలతో సవరించిన అంచనా వ్యయంతో డీపీఆర్‌ను సమర్పించి నెలలు గడుస్తున్నా కేంద్రం తుది నిర్ణయం ప్రకటించకుండా జాప్యం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం వెంటే స్పందించాలి.