Home Breaking రాజకీయ నాయకుల విచారణ తొందరగా పూర్తికావాలి: ఉప రాష్ట్రపతి

రాజకీయ నాయకుల విచారణ తొందరగా పూర్తికావాలి: ఉప రాష్ట్రపతి

139
0

చెన్నై, ఫిబ్రవరి 27:ప్రజాప్రతినిధుల మీద నమోదయిన  కేసుల విషయంలో న్యాయ ప్రక్రియను తొందరగా ముగించే  విషయం మీద కోర్టులు  దృష్టిసారించాలని ఉప రాష్ట్రపతి  ఎం వెంకయ్యనాయుడు అన్నారు.

రాజకీయ నాయకుల మీద నమోదయిన కేసులతోపాటు ఎన్నికల వివాదాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు .

శనివారం చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ న్యాయ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా వచ్చారు. తనసందేశమిచ్చారు.

చట్టసభల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులను కూడా నిర్దిష్ట సమయంలో విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయ పడ్డారు.

కేసుల పరిష్కారంలో ఆలస్యం, న్యాయ ప్రక్రియ అందుబాటులో ఉండకపోవడం, ఖర్చు పెరగడం తదితర కారణాలతో సామాన్యుడికి సరైన న్యాయం అందడంలో సమస్యలు ఎదురౌతున్నాయని ఆయన పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీతో పాటు వివిధ రాష్ట్రాల చట్టసభల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఉన్నతమైన విలువలను, ప్రమాణాలను పాటిస్తూ, ప్రతి వేదికపైనా ఆదర్శవంతమైన ప్రవర్తనను కనబరచాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో ప్రతి అంశానికీ చర్చలే అసలైన పరిష్కారమని, సభా కార్యక్రమాలకు విఘాతం కల్పించడం ద్వారా సాధించేది ఏదీ ఉండదన్నారు.

స్వరాజ్యం సముపార్జించి 75 ఏళ్ళ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలోనూ, ఇంకా వలసపాలకుల పద్ధతులనే స్నాతకోత్సవంలో, కోర్టుల వ్యవహారాల్లో అమలుచేస్తున్న తీరులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

న్యాయం, ధర్మం వంటివి భారతీయ నైతిక విలువల్లో ప్రధానపాత్ర పోషిస్తాయన్న ఉపరాష్ట్రపతి, భారత రాజ్యాంగ పీఠికలోని ‘న్యాయవ్యవస్థను కాపాడే సంకల్పం’ (రిసాల్వ్ టు సెక్యూర్ జస్టిస్)ను ఉటంకించారు. తిరుక్కురళ్‌లోని ‘పారదర్శక, నిష్పాక్షిక విచారణ ఆధారంగానే న్యాయవ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సమన్యాయం అందుతుంది’ అన్న వాక్యాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మన రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ కీలకమైన అంగమన్న ఉపరాష్ట్రపతి, ఉన్నతమైన విలువల ద్వారా సమన్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందని  అందరికీ న్యాయం అందుబాటులోకి వచ్చేందుకు లోక్ అదాలత్‌లు, మొబైల్ కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.

దీనికితోడు స్థానికులకు మాతృభాషలో న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం కూడా అత్యంత అవసరమన్నారు.

పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లు (ప్రజాప్రయోజన వ్యాజ్యం PIL)ను ప్రయివేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (వ్యక్తిగత ప్రయోజన వ్యాజ్యం)గా మార్చే ప్రయత్నం కూడా సరికాదని హెచ్చరిక చేస్తూ  విస్తృత ప్రయోజాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే పిల్స్‌ ను మాత్రమే అనుమతించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

బడుగు, బలహీన వర్గాలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను కూడా త్వరితగతిన విచారించాలని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

కార్యక్రమ ప్రారంభానికి ముందు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ఉపరాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ ఫలాలను సమర్థవంతంగా అందించడం ద్వారానే గణతంత్ర స్వప్నాలను చేరుకోగలమన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరీలాల్ పురోహిత్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టీఎస్ఎన్ శాస్త్రితోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here