రైతు నాయకుడు కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావుకు నివాళి

(టి లక్ష్మినారాయణ)
ప్రముఖ కమ్యూనిస్టు, రైతు ఉద్యమ నేత,అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు సంస్మరణ సభ‌ జరిగింది.
విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన సంస్మరణ సభకు ఆల్ ఇండియా కిసాన్ సభ, ఉపాధ్యక్షులు కా.ఆర్.వెంకయ్య అధ్యక్షతవహించారు.
కొల్లి నాగేశ్వరరావు జీవిత విశేషాలు:
కమ్యూనిస్టు ఉద్యమ‌ ప్రభావిత గ్రామమైన గుడిపాడు, ముసునూరు మండలం, కృష్ణా జిల్లాలో 1938 ఏప్రిల్ 7న జన్మించారు. 82 సం.ల వయస్సులో 2020 మే 21న మరణించారు.
చిన్నతనంలోనే బాల సంఘంలో చేరారు. మార్క్సిస్టు భావజాలం వైపు ఆకర్షితులైనారు. ముసునూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. చదువుతూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.) కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడి తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన “జై ఆంధ్ర” ఉద్యమంలో విద్యార్థులను కూడగట్టి పాల్గొన్నారు. కమ్యూనిస్టు భావజాలం వైపు విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాడన్న కంటగింపుతో పాఠశాల యాజమాన్యం స్కూల్ నుండి సస్పెండ్ చేసింది. అటుపై ఏలూరులో ప్రయివేటుగా ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి చేసి, విజయవాడ ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో చేరి ఇంటర్మీడియేట్ మరియు బి.ఏ. డిగ్రీ(1956-60) చదివారు. బీహారులోని భగల్పూర్ యూనివర్సిటీ నుండి 1963లో ప్రయివేటుగా ఎం.ఏ. పట్టా పుచ్చుకొన్నారు.

1961 నుండి 65 వరకు ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలంగా పని చేశారు. సిపిఐ, కృష్ణా జిల్లా కార్యదర్శిగా 1978లో ఎన్నికై 1991 వరకు 13 సం.లు పని చేశారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై 2002 వరకు, అటుపై రాష్ట్ర అధ్యక్షులుగా 2006 వరకు, 2007 నుండి దాదాపు దశాబ్ధం పాటు అఖిల భారత కిసాన్ సభ(ఎ.ఐ.కె.ఎస్.) ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా సుదీర్ఘ కాలం ఉన్నారు. కొంత కాలం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా ఉన్నారు.

1966లో జరిగిన “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” ఉద్యమంలో విద్యార్థి – యువజన కార్యాచరణ కమిటీ కన్వీనర్ గా ముఖ్యభూమిక పోషించి, నాటి కేంద్ర ఉక్కు శాఖా మంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కూలగొట్టిన కేసులో ఆరు మాసాలు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. “దున్నే వానికి భూమి” నినాదంతో చల్లపల్లి జమీందారు మిగులు భూముల ఆక్రమణ పోరాటానికి, అలాగే కృష్ణా జిల్లా వ్యాపితంగా 1978-91 మధ్య కాలంలో అవిశ్రాంతగా జరిగిన భూపోరాటాలకు నాయకత్వం వహించారు. వేలాది మంది వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు వేలాది ఎకరాల భూమిని సాధించి, పట్టాలు ఇప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో కంబిరిగాం భూపోరాటానికి నాయకత్వం వహించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు పరిరక్షణ కోసం, పోలవరం, పులిచింతల, చింతలపూడి ఎత్తిపోతల పథకం, శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు, తదితర‌ సాగు నీటి పారుదల ప్రాజెక్టుల సాధన కోసం అలుపెరగని పోరుసల్పారు. గోదావరి జలాలను తెలంగాణ మెట్ట ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిరవధిక‌ నిరాహారదీక్ష చేసి, ప్రభుత్వం గోదావరి జలాల వినియోగ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభలో విస్పష్టంగా ప్రకటించిన మీదట విరమించారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000 సం.లో తొమ్మిది వామపక్ష పార్టీల నేతృత్వంలో జరిగిన చారిత్రాత్మకమైన బషీర్ బాగ్ ఉద్యమంలో పాల్గొని, లాఠీఛార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. అక్రమ కేసులో అరెస్టు అయ్యారు. బహుళజాతి విత్తన కంపెనీ మోన్సాంటో దోపిడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి విజయం సాధించి, రైతాంగానికి వేల కోట్ల రూపాయల లబ్ధిచేకూర్చారు. రైతు సంఘాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రైతాంగ సమస్యల పరిష్కారానికి బలమైన ఐక్య ఉద్యమాలను వివిధ రూపాలలో నిర్వహించారు.

నదీ జలాల సమస్యపై లోతైన అధ్యయనం చేసి, సమగ్ర సమాచారం, విశ్లేషణ, ప్రాజెక్టుల ప్రతిపాదనలతో “ఆంధ్రప్రదేశ్ జలదర్శిని” అన్న శీర్షికతో పుస్తకాన్ని ప్రచురించి, ప్రభుత్వ పెద్దలు, సాగునీటి రంగ ఇంజనీర్స్, రైతు ఉద్యమ నేతల ప్రశంసలను అందుకొన్నారు. రైతాంగాన్ని ఆత్మహత్యలు నుండి మళ్ళించడం పోరుబాట వైపు నడిపించడం, ప్రపంచ వాణిజ్య సంస్థ – ప్రజల అప్రమత్తత, ప్రపంచ వాణిజ్య సంస్థరైతు రక్షణ, డంకెల్ డ్రాప్టులో మార్పులు సాధించాలి, డబ్లు.టీ.ఓ. – వ్యవసాయ సంక్షోభం తదితర శీర్షికలతో పుస్తకాలు రచించి, ప్రచురించారు. కోస్తాలోని పురాతన కృష్ణా డెల్టా, తెలంగాణలోని శ్రీరాంసాగర్, రాయలసీమలోని తెలుగు గంగ ప్రాజెక్టులపై పరిశోధన చేసి “మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ _ఎ కంపారిటివ్ స్టడీ ఆఫ్ త్రీ రీజియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్” అన్న శీర్షికతో పుస్తకాన్ని ప్రచురించారు. రైతు లోకం సంపాదకులుగా సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించారు. రైతన్న డైరీని క్రమం తప్పకుండా ప్రచురించారు. రైతాంగ సమస్యలు, సాగు నీటి పారుదల అంశాలపై అనేక‌ వ్యాసాలు వ్రాశారు.
రైతాంగానికి చేసిన సేవలు, జలవనరులు _సాగునీటి రంగంలో చేసిన కృషిని ప్రశంసిస్తూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2010 సం.లో ప్రతిభా పురస్కారంతో సత్కరించింది.
విదేశీ పర్యటనలు: ప్రపంచ విద్యార్థి-యువజనోత్సవాలలో పాల్గొనడానికి 1962లో ఫిన్లండ్, అదే సందర్భంలో పోలెండ్, సైద్ధాంతిక అధ్యయనం కోసం 1973లో ఏడాది పాటు సోవియట్ యూనియన్, 1975లో చెకోస్లావేకియా, ఎ.ఐ.కె.ఎస్. ప్రతినిథి బృంధం సభ్యుడుగా 2007లో చైనాలో పర్యటించారు.
సంస్మరణ సభ విశేషాలు
“విలక్షణ ఉద్యమనేత కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు” పుస్తకావిష్కరణను సిపిఐ సీనియర్ నేత కా.నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న) చేశారు.
విశాలాంధ్ర విజ్ఞాన సమితి, ఛేర్మన్ కా. ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం, సమన్వయకర్త శ్రీ టి.లక్ష్మీనారాయణ వేదికపై ఆశీనులైనారు.

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీ పేర్ని వేంకటేశ్వరరావ్(నాని), మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరావు, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్, సిపిఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు కా. కె.నారాయణ, ఆ.ప్ర.రాష్ట్ర కార్యదర్శి కా.కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా.చాడా వెంకటరెడ్డి, సిపిఐ(యం) ఆ.ప్ర.రాష్ట్ర కార్యదర్శి కా పి.మధు, విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు, రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి శివాజీ, మాజీ శాసనమండలి సభ్యులు కా.జల్లి విల్సన్, మాజీ శాసనసభ్యులు కా.కె.సుబ్బరాజు, సిపిఐ(యంఎల్) నాయకులు కా.గుర్రం విజయకుమార్, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కా.పశ్యపద్మ, ఆ.ప్ర.రైతు సంఘం అధ్యక్షులు కా.పి.రామచంద్రయ్య, ఆ.ప్ర.రైతు సంఘం (సిపిఐయం) అధ్యక్షులు కా.కేశవరావు, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు శ్రీ ఎర్రేని నాగేంద్రనాథ్, రైతు నాయకులు శ్రీ గోపాల్ కృష్ణ ప్రసాద్, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి కా.అక్కినేని వనజ తదితరులు ప్రసంగిస్తూ అమరజీవి కొల్లి నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. కమ్యూనిస్టు విలువలతో జీవితాంతం శ్రామిక వర్గానికి, ప్రత్యేకించి పేదలకు, రైతాంగం అభివృద్ధికి చేసిన అవిరళ కృషిని కొనియాడారు. నదీ జలాల సమస్యలపై, సాగు నీటి ప్రాజెక్టుల కోసం కొల్లి నాగేశ్వరరావు గారు చేసిన ఉద్యమాలను ప్రశంసించారు.
కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి, కన్వీనర్ శ్రీ కొలనుకొండ శివాజీ, రైతు సేవా సంస్థ, ప్రధాన కార్యదర్శి భవానీప్రసాద్, ఆ.ప్ర.పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.కె. శ్రీనివాసరావు తదితర అనేక మంది వివిధ రంగాలు, సంస్థలు, పార్టీలు, ప్రజాసంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)