తెలంగాణ బిజెపిలో కనివిని ఎరుగని నూతనోత్సాహం… కారణమేంటంటే…

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎపుడూ లేనంత ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి. హైదరాబాద్  మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలిచినా గెలవకపోయినా, ఈ పరిణామం బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నది.
ఇపుడు భారతీయ జనతా పార్టీ మాత్రమే హైదరాబాద్ లో చర్చనీయాంశమయింది.
ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ గురించి చర్చేలేదు. వార్తలు లేవు. ఒక వేళ ఎపుడైనా కాంగ్రెస్  గురించి వార్త వచ్చిందంటే, మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ గుడ్ బై కొడుతున్నాడనో, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరెడ్డి బిజెపి చూస్తున్నాడనో, లేదా  ఫలానా డివిజన్ లో కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బిజెపిలో చేరాడనో, టిఆర్ ఎస్ లో చేరాడానో.. వంటి నెగెటివ్ వార్తలే.  కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి ఆరోగ్య సూచన కాదు.
వీటన్నింటికితోడు బిజెపిలో ఆనందోత్సవాలకు కారణం టిఆర్ ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కెసిఆర్ లలో కనిపిస్తున్న బెదురు కూడా. ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి మీద అవసరమయిందాని కంటే ఎక్కువ అవేశపడుతున్నారనిపిస్తుంది.
దీనితో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హోదా కూడా పెరిగింది. ఆయనలో ఎంత ఉత్సాహం పెరిగిందంటే కొంతమంది సీనియర్ నాయకులు ప్రతిపాదించిన జనసేనతో పొత్తును ఆయన తిరస్కరించారు.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి గెలవడం, బిజెపి పుంజుకుంటున్నదనే టాక్ తో టిఆర్ ఎస్ లో కొంత కలవరం మొదలయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అవుతుందని, ఆ ప్లేస్ లోకి బిజెపి వస్తున్నదని చాలా మందిజనంతో పాటు టిఆర్ ఎస్ నేతలు నమ్ముతున్నారు. అందుకే జిహెచ్ ఎంసి ఎన్నికల్లో దుబ్బాక నీడ పడరాదని టిఆర్ ఎస్ చూస్తున్నది. ఈ తత్తరపాటుతో క్యాంపెయిన్ మొత్తం బిజెపి మీద గురి పెట్టింది.
ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి  చేస్తున్న ప్రకటనలు, ప్రచారం, అట్లాగే సెకండ్ ఇన్ కమాండ్ కెటిఆర్ చేస్తున్న ప్రచారం తీరు ఒక సారి చూడండి.ఎం జరుగుతున్నదో సులభంగా అర్థమవుతుంది.
 జరిగేది జిహెచ్ ఎంసి లోకల్ ఎన్నికలు. కాని,  బిజెపి జాతీయ వ్యవూహాలను కెసిఆర్ , కెటిఆర్  తప్పుపడుతున్నారు.చీల్చి చెండాడుతున్నారు.
బిజెపి ముస్లింలను తరిమేయాలనుకుంటున్నదని, కేంద్రం నిధులివ్వడం లేదని, ప్రాంతీయ భాషల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని…. ఇలా మొత్తంగా బిజెపి మీద గురిపెట్టడంతో రాష్ట్రంలో బిజెపి హోదా సెన్సెక్స్ లాగా అమాంతం పెరిగి పోయింది.
ధంతేరస్ ముందు బంగారు దుకాణాల వాళ్ల ప్రచారం లాగా టిఆర్ ఎస్ చేస్తున్న బిజెపి ప్రచారంతో  తెలంగాణ-బిజెపి హైప్ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా బిజెపి వస్తాంది, బిజెపి వస్తాందేమో, అదిగో బిజెపి వచ్చేస్తున్నది అనే టాక్ వచ్చింది. తెలంగాణ చరిత్రలో ఎపుడూ లేనంతగా జిహెచ్ ఎంసి ఎన్నికల్లో పార్టీ టికెట్ల కోసం జనం పాకులాడేందుకు ఇదే కారణం.
బిజెపి టికెట్ వస్తే చాలు గెల్చినట్లని ఆశ అందరిలో పెరిగింది.
జిహెచ్ ఎంసిలో ఉండే 150 డివిజన్ల కు 3000 మంది దరఖాస్తు చేశారు.బాగా డబ్బున్న వాళ్లు,చదువుకున్న వాళ్లు, టెకీలు, మహిళలు పెద్ద ఎత్తున బిజెపి టికెట్ కోసం దరఖాస్తుచేశారు. ఆశావహులతో బిజెపి కార్యాలయం కిటకిటలాడింది. అందుకే అభ్యర్థులను పేర్లు ఖరారు చేయడం  ఒక దశలో కష్టమయింది. మొదటు 129 పేర్లు ప్రకటించారు. మిగిలిన 21 పేర్లు ప్రకటించేందకు నానా తంటాలు పడ్డారు.
అన్నింటికంటే ముఖ్యంగా గతంలో టిఆర్ ఎస్ కు  పనిచేసిన స్థానిక నాయకులు కూడా బిజెపి టికెట్ల కోసం ప్రయత్నించారు.
కొన్ని చోట్లపార్టీ టికెట్ కోసం స్థానిక నేతలు ధర్నా చేశారు.కూకట్ పల్లి బిజెపి కార్యాలయం ఎదుట పెద్ద భైఠాయింపు జరిగింది.
టికెట్ రాని వాళ్లు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *