బూందీ పోటు అగ్నిప్ర‌మాదాల నివారణ‌కు చ‌ర్య‌లు :అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌లోని బూందీ పోటులో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గకుండా నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.
స‌మీక్ష అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ పోటులో అగ్నిప్ర‌మాదాల‌ను అరిక‌ట్టేందుకు నేల‌పై, గోడ‌ల‌పై నెయ్యి పేరుకుపోకుండా వేడినీరు, జెట్ క్లీన‌ర్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేయాల‌ని సిబ్బందికి సూచించామ‌న్నారు. బాణ‌లిలో నెయ్యి నింపే స‌మ‌యంలోనే అగ్నిప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని, ఇక‌పై మొక్క‌ల‌కు నీరు పోసే స్టెయిన్‌లెస్ స్టీల్ రోజ్ ట్యాంకుల‌ను ఇందుకోసం వినియోగించాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిపారు.
పోటులో మంట రాని 2 థ‌ర్మోఫ్లూయిడ్ స్టౌలు ప్ర‌యోగాత్మ‌కంగా ఏర్పాటు చేశామ‌ని, ఇవి విజ‌య‌వంతం కావ‌డంతో రానున్న 6 నెల‌ల్లో అన్ని బ‌ర్న‌ర్లను మార్పు చేస్తామ‌న్నారు. పోటులో చేయాల్సిన, చేయ‌కూడ‌ని అంశాల‌పై సిబ్బందికి శిక్ష‌ణ ఇస్తామ‌న్నారు.
తిరుమ‌ల‌ను ప్లాస్టిక్ ర‌హితంగా మార్పు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, త‌ద్వారా ఇప్ప‌టికి దాదాపు 50 శాతం ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల వినియోగం త‌గ్గింద‌ని అద‌న‌పు ఈవో తెలిపారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా త‌గ్గించేందుకు ప‌ది రోజుల్లో తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో 1500 నీటి డిస్పెన్స‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లోని హోట‌ళ్లు, క్యాంటీన్ల‌లో వాట‌ర్ బాటిళ్ల వినియోగం పూర్తిగా త‌గ్గింద‌ని, మూడు రోజుల్లో తోపుడు బండ్ల‌పై కూడా ప్లాస్టిక్ బాటిళ్ల విక్ర‌యాన్ని అరిక‌డ‌తామ‌ని తెలియ‌జేశారు. దీనికి ప్ర‌త్యామ్నాయంగా దుకాణ‌దారులు రాగి, స్టీల్ బాటిళ్ల‌ను విక్ర‌యించేందుకు అనుమ‌తి ఇచ్చామ‌న్నారు. జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామ‌ని తెలిపారు.
ఈ స‌మావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్  జి.రామచంద్రారెడ్డి, ఎస్ఇలు శ్రీవేంక‌టేశ్వ‌ర్లు, నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో మ‌నోహ‌ర్, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.