Home Breaking ఆ విషయంలో కేసిఆర్ కు తొందరెందుకో ?

ఆ విషయంలో కేసిఆర్ కు తొందరెందుకో ?

375
0

తెలంగాణలో కేసిఆర్ కు తిరుగులేదు. ఆయన ప్రజాస్వామ్య పరిభాషలో తెలంగాణకు ముఖ్యమంత్రి. కానీ ఆయన వ్యవహారిక తీరు అంతకంటే ఎక్కువగానే ఉంది. రాచరికంలో రాజులు ఎలాగైతే కనుసైగలతో పాలన చేస్తారో అలాంటి పాలనే కేసిఆర్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాజ్యానికి కేసిఆర్ రాజు.

వాస్తవ పరిస్థితులు కూడా కేసిఆర్ కు అలాగే కలిసొస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అడ్రస్ లేకుండా గల్లంతయ్యేవేళ కేసిఆర్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ బలం మరింత పెరిగింది. 88 సీట్లతో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ పేరు (అనైతికచర్య) తో ఆ సంఖ్యను వంద దాటించారు.

ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు, సారు 16 నినాదం ఎత్తుకున్నారు. ఆ మేరకు ఫలితాలు కూడా రాబోతున్నాయి. కానీ ఈరెండింటి నడుమ కేసిఆర్ కు మింగుడుపడని ఒక చేదుగింజలాంటి వార్త వచ్చిపడింది. అదేంటో కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు. చదువుకున్నోళ్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయినటువంటి సమాజంలో విజ్ఞానవంతులైన వారంతా టిఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఓడిపోయిన అభ్యర్థులు పార్టీకి సంబంధం లేని వారు అని పైకి చెప్పినా పై వర్గాలన్నీ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని తేలిపోయింది. అప్రతిహాసంగా సాగుతున్న కేసిఆర్ జైత్రయాత్రకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిగా బ్రేక్ పడింది.

మరీ విచిత్రం ఏమంటే… కేసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావు లాంటి పెద్ద లీడర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట చిత్తుచిత్తుగా (టిఆర్ఎస్ పరోక్ష మద్దతుదారులైన వారు) ఓడిపోయారు.  దాన్ని కప్పిపుచ్చుకునేందుకే రైతు శరత్ కు కేసిఆర్ స్వయంగా ఫోన్ కాల్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఎలాగైతేనేమీ జనాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తాలూకు ఓటమిపై చర్చ లేకుండా చేయగలిగాయి గులాబీ దళాలు.

ఇక ఇప్పుడు కారు సారు 16 వస్తాయా అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. సమయం ముగిసిన తర్వాత పోలింగ్ పర్సెంటేజీలు పెరిగాయన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో 16 రావొచ్చేమోనన్న చర్చ కూడా ఉంది. లేదంటే మూడు నాలుగు సీట్లు కోల్పోయినా కనీసానికి పది సీట్లు టిఆర్ఎస్ కు పక్కా అన్న వాతావరణమైతే ఉంది. ఇది ఇలా ఉండగానే కేసిఆర్ ఒక విషయంలో మాత్రం చాలా తొందరపడుతున్నారు. ఏవిషయంలో అంటారా? మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే విషయంలోనే.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసి వారం కూడా కాలేదు… అప్పుడే స్థానిక సమరానికి కేసిఆర్ తెర తీశారు. దానికి చెబుతున్న కారణాలేంటంటే… కోడ్ లో కోడ్ తెచ్చి ఎన్నికల కోడ్ క్లోజ్ చేసే ప్రయత్నం అంటున్నారు. అలా ఇక కోడ్ ముగిసిపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉరుకులు పరుగులు పెట్టిస్తామని అంటున్నారు. ఇది పైకి చెప్పే మాటలుగా కనబడుతున్నాయి. అందుకోసమే పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు ఖతం చేసి పారేస్తామని, తర్వాత అన్ని ఫలితాలు రాగానే కోడ్ కష్టాలు తీరిపోయి పాలన మీద పడతామని అంటున్నారు.

ఆగస్టు 2018తోనే ఎంపిటిసి, జెడ్పీటిసిల పదవీకాలం ముగిసిపోయింది. అంటే 8 నెలల క్రితమే ఈ ఎన్నికలు రావాల్సి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ముందస్తు అసెంబ్లీ కంటే ముందే ఈ ఎన్నికలు రావాలి. కానీ అనూహ్యంగా 8 నెలలపాటు వీటిని పెండింగ్ లో పెట్టారు. జరగాల్సిన ఈ ఎన్నికలను పెండింగ్ లో పెట్టి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తెచ్చి పెట్టారు. ఇక ముందస్తు పుణ్యమా అని తెలంగాణలో గత ఆరు నెలలుగా ఎన్నికల కోడ్ అమలులోనే ఉన్నది. అసెంబ్లీ, కౌన్సిల్, సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎంపిటిసి, జెడ్పీటిసిలకు రాబోతున్నాయి.

పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా కొంత విరామం తీసుకుని ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కానీ… కారు సారు 16 నినాదంలో ఏదైనా తేడా కొట్టినా… ప్రతిపక్షాలు పొరపాటున నాలుగైదే సీట్లు గెలిచినా ఆ ప్రభావం స్థానిక సంస్థల మీద పడే ప్రమాదముందని గులాబీ బాస్ మరో ఆలోచనగా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఎవరు అవునన్నా… కాదన్నా శాసనమండలిలో మూడు సీట్లు కోల్పోయిన ప్రభావం సామాన్య మానవుల్లో కూడా పడింది. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లోనూ చూపే అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే పార్లమెంట్ ఫలితాలు రాకముందే ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు ఖతం చేసే యోచనలో గులాబీ నేతలు ఉన్నారు. అందుకే కేంద్ర కోడ్ ముగిసేలోగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఒకవేళ రేపు ప్రతిపక్షంలో ఉన్నవారు నలుగురైదుగురు గెలిస్తే ఆ ప్రభావం జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ ల మీద పడే ప్రమాదముందన్న ఆందోళనతోనే ఫలితాలు రాకముందే ఎన్నికలు పూర్తి చేయాలన్న ప్లాన్ తో ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరో ముఖ్యవిషయం ఏమంటే సెంటిమెంట్ ఆధారంగా నిర్మితమైన పార్టీ టిఆర్ఎస్. ఈ పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం లేదనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా స్థానిక సంస్థల్లో టిఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొన్నటికి మొన్న పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ను కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో అటు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, సర్పంచ్ ఫలితాలు, పార్లమెంట్ ఫలితాల ప్రభావంతో జిల్లా పరిషత్, మండల పరిషత్ లలో దెబ్బ పడే అవకాశాలున్నాయని పసిగట్టిన తెరాస శిబిరం కోడ్ పేరుతో వాటిని ఫలితాల కంటే ముందే పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ వార్త చదవండి…

పోలీసుల్లో చంద్రబాబు కుల సైన్యం దాక్కుని ఉంది, జగన్ ఆరోపణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here