హారీష్ రావు బాటలో కవిత, పదవులకు రాజీనామా

నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆరేళ్లుగా టిబిజికేఎస్ కు కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ప్రతి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ టిబిజికేఎస్ ను కవిత విజయపథంలో నడిపారు. టిఆర్ఎస్ లో పదవులలో ఉంటూ ఇతర కార్మిక, ప్రజా, కుల సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నవారు రాజీనామా చేయాలని సీఎం కేసీఆర్ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నేతలంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని సమాచారం.

గురువారం మాజీ మంత్రి హారీష్ రావు కూడా టిఎంయూకి రాజీనామా చేశారు. ఆర్టీసీ, సింగరేణి లాంటి పెద్ద సంస్థలలో సమ్మెలు జరిగినప్పుడు టిఆర్ఎస్ అనుబంధ సంఘాలు సమ్మెకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. దీంతో అది పార్టీకి, కార్మిక నాయకులకు పెద్ద తలనొప్పిగా మారింది. పలువురు నాయకులు టిఆర్ ఎస్ లో చేరడంతో వారికి ఈ పదవులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అప్పటికే ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్నవారు కార్మిక సంఘాలలో ఉండడం కూడా మంచిది కాదని కేసీఆర్ భావించారని తెలుస్తోంది.

హారీష్ రావు రాజీనామా చేసిన మరుసటి రోజే కవిత కూడా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బొగ్గుగని, కార్మిక సంఘం, విద్యుత్ సంఘం, అంగన్ వాడీ సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, హెల్పర్స్  అసోసియేషన్ సంఘాలకు కవిత అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పదవులన్నింటికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను ఆయా సంఘాల కార్యదర్శులకు పంపించారు. కవిత ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. సంఘం బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించినట్టు సమాచారం.

హారీష్ రావు, కవితల రాజీనామాలతో టిఆర్ ఎస్ లో ఇతర సంఘాలకు నాయకులు గా ఉన్న వారు కూడా త్వరలోనే రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఈటెల రాజేందర్, నాయిని నర్సింహ్మారెడ్డి, కేటిఆర్, జగదీష్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఇతర సంఘాలకు గౌరవ అధ్యక్ష హోదాలో పని చేస్తున్నారు. వారు కూడా త్వరలోనే తమ పదవులుకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. టిఆర్ఎస్ లో కి అధిక మంది నాయకులు వలసలు రావడంతో వారందరికి పదవులు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారి చేత రాజీనామాలు చేయిస్తున్నారని నేతలు అంటున్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశ్యం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *