చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అంటారా: కేంద్రానికి హరీష్ చురక

దుబ్బాక : పప్పులో చిటికెడు ఉప్పేసి.. పప్పంతా నాదే అన్నట్లుగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా కూడవెళ్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం దుబ్బాక నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దత్తు ప్రకటించగా.. డీలర్లను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
బాయికాడ మీటర్లు రావొద్దన్నా.., విదేశీ మక్కలు రావొద్దన్నా.., మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా.. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఏస్ అభ్యర్థిని లక్ష మెజారిటీతో గెలిపించి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని నియోజకవర్గంలోని రేషన్ డీలర్లకు మంత్రి పిలుపునిచ్చారు.
మీ సంక్షేమం.. మా బాధ్యతగా చెప్పుకొచ్చారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబరు వన్ గా ఉన్నామని వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని, దుబ్బాక సంక్షేమం, దుబ్బాక అభివృద్ధి టీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందని ప్రజలకు తెలపండని కోరారు.
కేంద్రం NFSA కింద 40 లక్షల కార్డు దారులకు 5 కిలోల చొప్పున్న బియ్యం అందిస్తుందని, కానీ 90 లక్షల రేషన్ కార్డు దారులకు 6 కిలోల చొప్పున్న బియ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని.. బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
11వేల 700 కోట్లు పింఛన్ల కోసం రాష్ట్రం వెచ్చిస్తే.. కేవలం 200 కోట్లు కేంద్రం ఇస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించేలా తెలియజెప్పాలని కోరారు.
రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా.. పరిష్కారం తీసుకుంటానని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, డీలర్లకు మేలు చేసిందని మంత్రి హరీశ్ రావు వివరించారు.