పౌరసత్వ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సుప్రీంకోర్టు తేల్చాలి: టిఆర్ ఎస్ వినోద్

‘క్యాబ్’ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం,ఉద్దేశ్య పూర్వకంగానే క్యాబ్ తీసుకువస్తున్నారు
కేంద్ర ప్రభుత్వం సిటీజన్స్ అమెండమెంట్ బిల్ ( క్యాబ్ ) ను రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా తీసుకుని వచ్చిందని, ఇది ప్రజల ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగించేదిగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
టిఆర్ ఎస్ సభ్యులు పార్లమెంటులో కూడా ఈ బిల్లును వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
శనివారం హోటల్ కత్రియాలో జరిగిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్యాబ్ ను ఉద్దేశ్య పూర్వకంగానే తీసుకుని వచ్చిందని, ఆర్థిక మాంద్యం వల్ల కానే కాదని స్పష్టం చేశారు.
క్యాబ్ పూర్తిగా రాజకీయ దురుదేశ్యంతో, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేదిగా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
క్యాబ్ ప్రకారం పొరుగు దేశాల నుంచి వచ్చే ముస్లిం శరణార్ధులకు భారత పౌరసత్వ అవకాశం లేదని, ఇది లౌకిక వాదానికి వ్యతిరేకమని ఆయన అన్నారు.
క్యాబ్ అమలులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. క్యాబ్ ను తమ రాష్ట్రాలలో అమలు చేయబోమని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ క్యాబ్ ను అమలు చేయబోమని ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరగా వినోద్ కుమార్ స్పందించి సమాధానం చెప్పారు.
క్యాబ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, రాష్ట్రాల చేతిలో లేనిదని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రకటన తప్ప ఆ ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్ర ఉండదని ఆయన అన్నారు. పోలీస్ వేరిఫికేషన్ లో జాప్యం చేయడం తప్ప క్యాబ్ విషయంలో రాష్ట్రాలు చేసేదేమీ ఉండదన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న క్యాబ్ విషయంలో సుప్రీం కోర్టు తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.