కెన్నెత్ యాండర్సన్ కథల్లో విహరిస్తారా, అయితే మామండూరు అడవికి రండి…

కెన్నెత్ యాండర సన్  (Kenneth Anderson:1910-1974) పేరు విన్నారా? బ్రిటిష్ జంగిల్ హంటర్.
ఆయన దక్షిణ భారతదేశపు ఫారెస్ట్ అడ్వెంచర్స్ మీద చాలా కథలు రాశారు. Mamandur Man-Eater, Striped Terror of Chambal Valley, The Evil on the Umbalmeru  వంటి కథల నేపథ్యం మన ఈ శేషాచలం ఫారెస్టే. ట్రెకింగ్ కు, విహారయాత్రకు, ప్రకృతి అరాధనకు అద్భుతమయిన ప్రదేశం. ఇక్కడ అటవీ శాఖ వాళ్ల అందమయిన గుడారాలు కూడా  అద్దెకు దొరుకుతాయి. ఆహారం ఏర్పాట్లు కూడా ఉన్నాయి  కెన్నెత్ పాత పుస్తకం  Man-Eaters and Jungle Killers  ఇక్కడి బంగళాలో చూడవచ్చు.
Man-Eaters and Jungle Killers (Credit: Amazon)
మామండూరుకు సాంస్కృతిక ప్రాధాన్యం కూడా ఉంది.  ఈ మార్గం గుండానే వాగ్గేయ కారుడు అన్నమాచార్య వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమల వెళ్లాడని చెబుతారు.

తిరుపతి  సమీపంలోని మామండూరు  అడవిలో బ్రహ్మ తీర్ధం దగ్గిర ట్రెకింగ్.

ఈ కింది ఫోటోలో ఉన్న ఫారెస్టు బంగళాని 1920 లో నిర్మించారు. ఈ  బంగాళాలలో అయిదారు రోజులుఉండి పులి జాడ కనుక్కోవాలనుకున్నాడు కెన్నెత్ యాండర్సన్. పులి వేటలో అడవులన్నీ తిరుగుతున్నాడు. పులుల సమాచారం తెలుసుకుని ఈ అడవికి వచ్చారు. అందులో నరభక్షకి అయిన పులి ఒకటి ఉందని అక్కడ జనం చెబితే విన్నాడు. అపులి ని చూడాలనుకున్నాడు.
Credits: Kallivalli blogspot
 ఒక పులి,అందునా ఆడపులి పశువుల కాపరి మీద దాడి చేసి ఎలా చంపిందో  Mamandur Man-Eater లో  కెన్నెత్ గొప్పగా వర్ణించారు.
“ఇది బాగా వయసులో ఉన్న ఆడపులి. ఇంకా మనుషుల మీద దాడి జరపలేదు. అయితే, అనుకోకుండా ఎదురయిన సంఘటనలో మామండూరు సమీపంలో ఈ పులి ఒక పశువుల కాపరి మీద దాడి చేసింది.ఆరోజు ఈ పులి నిజానికి, ఒక మాంచి నిఘనిఘాలాడే ఆవుమీద దాడి చేయాలనుకుంది.  అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. ఆసమయంలో అవుల మంద రానే వచ్చింది. దానికొక పశువుల కాపరి ఉన్నాడు. పులి వెంటనే ఒక అవు మీదికి కుప్పించి దూకింది. అయితే, దీన్ని పశువుల కాపరి గమనించాడు. గట్టిగా పులి… పులి అని కేకలేశాడు. కర్రతో పులి అదిలించే పని చేశాడు. సాధారణంగా ఇలా అల్లరి  చేస్తే పులి బెదిరిపోయి పారిపోతుంది. కాని, ఈ పులి దానికి బెదిరిపోలేదు. దీనికి తోడు తన నోటికాడి కూడు తీసేయాలనుకుంటున్నందుకు పశువుల కాపరి మీద పగబట్టింది. కసితో ఆవును నోట కరుచుకుని లాక్కు పోయేందుకు బదులు పశువుల కాపరి మీద దాడి చేసింది. పులి తన మీద ఆగ్రహించిందని పశువుల కాపరి గ్రహించాడు. వెనుదిరిగి పరిగెత్తేందుకు ఉద్యుక్తుడయ్యాడు. సరిగ్గా అపుడే పులి ఆయన విపు మీద పంజాతో దాడి చేసింది. అంతే… పశువుల కాపరి భుజాల దగ్గరి  నుంచి పిర్రల దాకా కండ వూడొచ్చింది. పశువుల కాపరి కింద పడిపోయాడు. పులి ఆగ్రహం చల్లారింది. తాను చేయాలనుకున్నది చేసింది. వాడి మీద పగదీర్చుకుంది. ఇక వాడితో పనిలేదు. పులి మెల్లిగా తాను దాడి చేసిన అవుదగ్గరికి వెళ్లింది. అవును కసకస కొరికి తింటూ ఉంది. పులి ఆవు ఎముకలను కొరికితింటున్నట్లు కరకర మని శబ్దాన్ని పశువుల కాపరి విన్నాడు. నొప్పితో బాధపడుతున్నాడు. అయితే తలపైకెత్తకుండా అలాగే పడివున్నాడు….”
తర్వాత ఏమయింది..ట్రెకింగ్ కు వెళ్లేముందు ఆ పుస్తకం ఒక సారి చదవి వెళ్లండి ధ్రిల్లింగ్ గా ఉంటుంది.
 ఆ రోజుల్లో  పులి గురించి తెలుసుకున్న కెన్నెత్ యాండర్సన్ ఏమయినా సరే,  దాన్నిచూడాల్సిందే అనుకున్నాడు. బంగాళాలో బస చేశాడు. రేయింబగళ్లు కాపలా కాశాడు.మగపులి అరుపు నేర్చుకున్నాడు. ఒక జంతువును చంపి  దాని పక్కన మాటు వేసి ఎదురుచూశాడు. రాత్రిపూట ధైర్యంగా అడవిలో సంచరించాడు. చివరకు ఒక రోజున,  ఆ ప్రాంతంలో పులి ఆచూకి కోసం తారాట్లాడుతున్నపుడు, అక్కడి రైలు పట్టాల సమీపంలో ఒక పొదలో నుంచి  ఆడపులి అరుపు వినిపించింది. దానికి స్పందిస్తూ కెన్నెత్ యాండర్స్ మగ పులిగా ధ్వని చేశాడు. పొదల నుంచి పులి మెల్లిగా రొమాంటిక్ మూడ్ తో బయటకు వచ్చింది. అది ఆయన్ను చూసింది. ఏమనుకుందో… ఆయన వైపు రావడం మొదలుపెట్టింది. ఆ దశలో  పులి మీద కాల్పులు జరపక తప్పలేదు….
ఈ అడవిలో తిరుగుతూ ఉంటే… ఈ కథ మొత్తం కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. ఈ ప్రాంతం అడవి గురించి యాండర్సన్ చాలా వివరంగా రాశారు. నిజానికి ఈ పులికి మనిషిని చంపాల్సిన అవసరం లేదంటాడు కెన్నెత్ యాండర్సన్.
కాకపోతే, అక్కడి జనం చెప్పిందానిని బట్టి ఈ పులి అనవరసరంగా, కేవలం తన దారికి అడ్డొచ్చాడన్న కసితో  మనిషి రక్తం రుచి మరిగిందట.
జనమంతా కథకథలుగా  చెప్పుకుంటున్న ఈ పులి సంగతేందో చూద్దామని, దాని గురించి వివరాలు తెలుసుకుందామని మాత్రమే  కెన్నెత్ యాండర్సన్  మామండూర్  ప్రాంతం లో పర్యటించాడు. అయితే, కథ మరోలా సాగింది…
చేరుకోవడం ఎలా?
మామండూరు అడవి కడప-చెన్నై హై వే మీద ఉంటుంది.  బ్రిటిష్ హయాం  నుంచి కూడా ఇది మాంచి ట్రెకింగ్ హబ్.  ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. నిజానికి తెలుగు వాళ్లకంటే, కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చే పర్యాటకులే చాలా ఎక్కువ. పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ  కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం  (CBET)ప్రాజక్టు కింద కొన్ని వసతి ఏర్పాట్లు చేశారు. కడప నుంచి, తిరుపతి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు.  ఈ ప్రాంతమంతా శేషాచలం అడవి కిందికే వస్తుంది.

ఫోటోలు : మధుసూదన్ రెడ్డి (స్విమ్స్ ట్రెకింగ్ టీమ్), తిరుపతి