వరవరరావు విడుదల కోసం ఉపరాష్ట్రపతికి ఎమ్మెల్యే భూమన లేఖ

మహారాష్ట్ర జైల్లో నిర్బంధంలో  ఉన్న విప్లవ రచయిత వరవరరావును విడుదల చేయించాలని కోరుతూ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. ఎమమర్జన్సీ రోజులలో అరెస్టయినపుడు వరవరరావు తో జైలు జీవితం పంచుకున్న రోజులను కరుణాకర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖలో గుర్తు చేశారు.
ఎంతో బరువెక్కిన హృదయంతో రాసిన ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది. ప్రధానమంత్రిని హతమార్చడా‌ని కుట్రపన్నారన్న ఆరోపణపై వరవరరావును‌ కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి నుంచి‌ ఆయన అక్కడి జైల్లోనే ఉన్నారు. ఎనిమిది పదులు పైబడిన వయసులో ఉన్న ఆయనకు కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే శారీరకంగా చిక్కిశల్యమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన్ను బెయిల్ మీద విడిపించడానికి కుటుబ సభ్యులు సహా ప్రజాస్వామికవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కరుణాకర్ రెడ్డి…ఉపరాష్ట్రపతికి‌ లేఖ రాశారు.‌ ఆ లేఖలోని‌ అంశాలు యథాతథంగా….
MLA Bhumana Karunakar Reddy
గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి మాన్య మహోదయులు… శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, హృదయపూర్వక వినమ్ర నమస్సులు…
సంస్కారులు, సహృదయులు, మానవీయ విలువల మహోన్నతులు అయిన మీరు…
ఓ వృద్ధ శరీరుని ప్రాణం కాపాడడానికి స్పందించాలని సహృదయంతో అభ్యర్థిస్తున్నాను.
శ్రీ వర వర రావు గారి నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు.
నలభై‌ ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, అందుకు.
రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం.
శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయన పైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది.
యాభై మూడు సంవత్సరాలుగా అడవులలో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగడా ? ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి.
రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు.
అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు… శ్రీ వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుం టున్నాను.
అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులు లైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను.
-నమస్సులతో మీ భూమన కరుణాకర్ రెడ్డి