జవహర్ రెడ్డి గారూ, తిరుమల కాలిబాట ఎందుకిలా ఉందో చూడండి: నవీన్ రెడ్డి విజ్ఞప్తి

(నవీన్ కుమార్ రెడ్డి)
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.  తిరుమలకు  అలిపిరి దారిలో వెళ్లు వారి సంఖ్య ఎక్కువవుతుంది. కాలినడకన కొండ ఎక్కి వెళ్లడమనేది మొక్కుబడిలో భాగం. వెంకన్నదర్శనంలో దీనికి చాలా ప్రాముఖ్యాన్నిస్తారు భక్తులు. అందుకే కాలిబాటన ఒక సారైనా వెళ్లడమే, రావడమో చేయాలనుకుంటారు. ఇలాంటి కాలి బాట ఇపుడు పాదయాత్రకు పనికిరాకుండా పోయింది.  నడక దారిలో జరుగుతున్న రూఫ్ తొలగింపు పనుల కారణంగా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ఈ దారిలో  ఓ భక్తుడు ఈరోజు వెళ్లేందుకు ప్రయత్నించి,  ఆవేదన చెంది ఒక వీడియో షేర్ చేశాడు. కాలినడక ఏడుకొండల వాడిని చేరుకోవాలనుకునే వారు రావద్దని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇదిగో వీడియో…

తితిదే కొత్త కార్యనిర్వహణాధికారిగా  సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి రేపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన కూడా తొలి రోజు కాలిబాటనే తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారంటే కాలిబాట ప్రాముఖ్యమేమిటో తెలుస్తుంది.
రేపు ఈ బాటన తిరుమల వెళ్తున్నపుడు ఈ  రిపేర్లు అవసరమా, బ్రహ్మోత్సవాల సమయంలో ఇలాంటి పనులు చేపట్టి భక్తుల రాకపోకలకు అంతరాయగలించి వారి మనోభావాలను గాయపర్చడం ఎంతవరకు సబబో ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.
టిటిడి ఉన్నతాధికారులు నడకదారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయకుండా చేస్తున్న పనులు కారణంగా నడకదారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రేపు స్వయంగా ఇది కొత్త ఇ.వొ గారికి ఇది అనుభవంలోకి రానుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వెంటనే దృష్టి పెట్టండని టిటిడి అధికారులను కోరుతున్నాను.

నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెలలో ప్రారంభం అవుతాయి. ఈవిషయం  తెలిసి కూడా ఉన్నతాధికారులు నడకదారిలో పనులు ప్రారంభించడం అవసరమా?
అలిపిరి నడక మార్గంలో అవసరమైతే చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సింది పోయి ఓ దాత శ్రీవారికి ఇస్తున్న కానుక నిధి 25 కోట్లతో బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పనులు చేపట్టంలో ఔచిత్యం ఏమిటి? ముందస్తు ప్రణాళిక లేకుండా నడక దారి భక్తులకు అసౌకర్యం కలిగించడం ఏమిటి?

శ్రీవారికి దాత ఇస్తున్న 25 కోట్లు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు కదా.
తిరుమల అధికారుల తీరు చూస్తుంటే అలిపిరి నడకదారి మూసేస్తారా అన్న అనుమానం కలుగుతుంది.
Naveen Kumar Reddy
(నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, తిరుపతి యాక్టివిస్టు)