జగన్ KRMB షిఫ్టింగ్ ప్లాన్ కు మోకాలడ్డిన తెలంగాణ

కృష్ణానదియాజమాన్య మండలి (Krishna River Management Board KRMB) కార్యాలయాన్ని విజయవాడనుంచి  విశాఖపట్టణానికి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలను తెలంగాణ వ్యతిరేకించింది. గతంలో విజయవాడలో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ అంగీకరించింది.  విజయవాడు హైదరాబాద్ కు సమీపానే ఉంటుంది. అయితే, ఈ బోర్డును విశాఖ పట్టణానికి తరలించేందుకు అభ్యంతరం చెప్పింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఒక లేఖ రాసింది.

బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామంటేనే తాము అంగీకరించామని,  ఇపుడు ఏకంగా కృష్ణాబేసిన్ కు బయట ఎక్కడో విశాఖలో ఏర్పాటుచేయడం తమ ఆమోదం కాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీ ధర్ బోర్డు చెయిర్మన్ కు లేఖ రాశారుు. ఈ తరలింపు విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎపెక్స్ మీటింగ్ లో కూడా ప్రస్తావించలేదని కూడా ఆయన చెప్పారు. అందువల్ల  తాము బోర్డు కార్యాలయాన్ని విజయవాడనుంచి విశాఖకు తరలించ వద్దని ఆయన కోరారు.

ఇప్పటికే రాయలసీమ నుంచి విశాఖ తరలింపుకు అభ్యంతరం వ్యక్తమవుతున్నది. రాయలసీమ రైతు నేతలెవరూ ఈ తరలింపును సమ్మతించడం లేదు. కెఆర్ ఎం బి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సింది కర్నూలులోననేది వారి డిమాండ్. ఈ మేరకు వారు చాలా కాలంగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. గత ముఖ్యమంత్రి ఈ డిమాండ్ పట్టించుకోలేదు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తమ కోరిక నెరవేరుతుందనుకున్నారు. అయితే, రాయలసీమకు కార్యాలయాన్ని బదిలీ చేయకపోగా,  ముఖ్యమంత్రి ఏకంగా విశాఖకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బోర్డుకు లేఖ రాశారు.

రాజధానిని విజయవాడనుంచి విశాఖకు తరలిస్తున్నందున కీలకమయిన కార్యాలయాలన్నీ రాజధానిలో ఉండాలి కాబట్టి కృష్ణా బోర్డు కూడా విశాఖలో ఉండాలని, అందువల్లే ప్రభుత్వంబోర్డుకు లేఖ రాసిందని  ముఖ్యమంత్రి జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇపుడు తెలంగాణ కూడా కెఇర్ ఎంబిని విశాఖ తరలించడానికి అభ్యంతరం చెప్పింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యక్తం చేస్తున్న అభిప్రాయలివి:

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయినా రాయలసీమకు KRMB ని సాధించాలి.

కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖలో ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని వార్తలు ఆధారంగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడం సాద్యం కాకపోవచ్చు కానీ రాయలసీమలో ఏర్పాటు చేయాలనే వాదనకు బలం చేకూర్చే అవకాశం ఉంది.

బీజేపీ నేతలు కూడా తమవంతు పాత్ర పోషించాలి. బోర్డు కార్యాలయం ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం లాగా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా కనీసం తెలంగాణ , రాయలసీమ సమాజం నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చు అది ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుంది. రాయలసీమ బీజేపీ నేతలు తమ ప్రయత్నం చేయాలి

రాయలసీమ వైసిపి నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి రాయలసీమలో కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఏ కారణం వల్ల అయినా కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమకు తీసుకురాలేకపోతే సీమకు ప్రభుత్వం చేసిన అన్యాయంగా మిగిలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *