టెంపరరీ నియామకాలొద్దు, పర్మినెంట్ కావాలి – నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్

కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులు చాలా ఒత్తిడి మధ్య పనిచేస్తున్నారని, కాంట్రాక్టు/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికకు బదులుగా రెగ్యులర్ విధానంలో నర్సుల నియామకాలను చేపట్టాలని రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని సెక్రటరీ జనరల్ లక్ష్మణ్ రుడావత్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు రోజువారీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించేలా నిర్ణయం తీసుకుందని, కానీ అదే సమయంలో తగిన రక్షణ పరికరాలు లేకుండా ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న డాక్టర్లు, నర్సులు రిస్కులో పడుతున్నారని గుర్తుచేశారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 4,560 పోస్టులను భర్తీ చేసే విధంగా 2017-18లో ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇందులో 3,311 స్టాఫ్ నర్సులు, 398 ఏఎన్ఎంలు, 369 ఫార్మాసిస్టు (గ్రేడ్-2)లు, 325 లేబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2), 105 రేడియోగ్రాఫర్లు, 52 ఫిజియోథెరపిస్టులు ఉన్నాయని, కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అప్పటికే పనిచేస్తున్న నర్సుల సర్వీసును దృష్టిలో పెట్టుకుని 30శాతం వెయిటేజీ మార్కులను ప్రకటించిందని, కానీ కష్టపడి చదివిన అభ్యర్థులకు న్యాయం జరగకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలైందని లక్ష్మణ్ ఆ లేఖలో గుర్తుచేశారు.
సుమారు లక్ష మంది అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పరీక్షలు రాశారని, గతేడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు విచారణ జరిగి తీర్పు రిజర్వులో ఉన్నదని, దీంతో ఉద్యోగంలో చేరలేకపోయిన అభ్యర్థులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నర్సులకు ఉన్న కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై దృష్టి పెట్టి తీర్పు వచ్చేలా చూడాలని ఆయన సూచించారు.
దీనికి తోడు ఆసుపత్రుల్లో నర్సులకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల లభ్యతను పెంచాలని, ఆసుపత్రి నుంచి ఇంటికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని, ఆరు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, రాత్రి షిప్టు డ్యూటీ కూడా ఆరు వర్కింగ్ హవర్స్‌కే పరిమితం చేయాలని, కరోనా సోకిన నర్సులకు స్పెషల్ లీవ్ కల్పించాలని కోరారు.
కరోనా డ్యూటీ చేస్తున్నవారికి రోజుకు రూ. 1,500 అలవెన్సు ఇవ్వాలని, రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే, కరోనా డ్యూటీ చేస్తున్నవారికి బీమా సౌకర్యం కల్పించాలని.. ఇలా మొత్తం 11 డిమాండ్లను సీఎంకు రాసిన లేఖలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రస్తావించింది.