తెలంగాణలో పెరుగుతున్న పాలాభిషేక బానిస సంస్కృతి, విష సంస్కృతి

2014 నుండి తెలంగాణలో కొనసాగుతున్న పాలాభిషేకాల సంస్కృతి బానిస మనస్తత్వాన్ని పెంచి పోషించే విషసంస్కృతి.

 

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రతి ప్రకటనను ముఖ్యమంత్రి రాజకీయం చేసినట్లుగానే పిఆర్సి వేతన హెచ్చింపు నకు సంబంధించిన ప్రకటన కూడా ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. నాగార్జున  సాగర్ ఉప ఎన్నిక సమయంలోనే పిఆర్ సి అమలు ప్రకటించడం ఉద్యోగ వ్యవస్థ పట్ల గౌరవం కంటే రాజకీయంగా తమ ఏలుబడి సుస్థిరం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించవచ్చు.

వేతన హెచ్చింపు అనేది ఓట్ల పేరుతో ఉద్యోగులకు ఇచ్చే బిక్ష కాదు. ఆ విషయాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ముందుగా ఆలోచించాలి.

పి ఆర్ సి కి సంబంధించి పరిణామాలు

2018 జూలై మాసం నుండి వర్తించ వలసిన వేతన హెచ్చింపు సంబంధించిన పరిణామాలు చూద్దాం.  పక్క రాష్ట్రంలో 20 నెలల క్రితమే మధ్యంతర భృతి ప్రకటించి అమలు చేస్తూ ఉంటే మన తెలంగాణలో  2018, 16 మే రోజున అన్ని సంఘాల తో చర్చ సందర్భంగా లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చినవే నేడు ముఖ్యమంత్రి  సభలో ప్రకటించిన విషయాన్ని మర్చిపోకూడదు.

వేతన హెచ్చింపుకు సంబంధించి శాస్త్రీయ విధానంలో కొనసాగుతున్న  పరిశీలన అంశాలను పక్కన పెట్టి కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాలకు వత్తాసు పలికిన కారణంగా ఇంత జాప్యం జరిగిన విషయాన్ని మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గమనించాలి.

వేతన హెచ్చింపు తో పాటు అనేక అపరిష్కృత సమస్యలపరిష్కారంలో ఇంత జాప్యం జరగడానికి నేడు పాలాభిషేకాలు, సన్మానాలు, అభినందనలు ,సంబరాలు చేసుకుంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కారణమనేది చెప్పక తప్పదు

దాదాపు ముప్పై మూడు నెలల తర్వాత ప్రకటించిన ఈ వేతన హెచ్చింపు లకు సంబంధించినటువంటి అంశాలలో రెండు సంవత్సరములు నామమాత్రంగానే మిగిల్చి 12 మాసాలకు సంబంధించిన నగదుగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రకటించడం దానిని ఉద్యోగ సంఘాలు ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆమోదించడం ఎవరి ప్రయోజనం కోసం సంఘాలు పనిచేస్తున్నాయో కిందిస్థాయి సభ్యులు ఉద్యోగులు ఆలోచించవలసిన అవసరం ఉంది.

రాష్ట్రంలో ఒక వైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉండగానే ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రిని కలవడం, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా ప్రకటించడం కూడా ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి కాదు ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి అని మనం అర్థం చేసుకోవాలి .అంటే ప్రజల ఉద్యోగుల సమస్యలు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రభుత్వాలకు గుర్తుకురావడం, అదే సందర్భంలో కొన్ని సంఘాలు లేదా పార్టీలు ప్రభుత్వంతోని మిల్లి తము కావడాన్ని ప్రజాస్వామ్యంలో జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రభుత్వ వివక్ష

పోరాటం చేయడానికి సిద్ధం గా ఉన్న సంఘాలు గతంలో అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే కొన్ని సంఘాలు మాత్రం పోరాటం చేయకుండా ప్రశ్నించకుండా ప్రభుత్వ ఆదరాభిమానాలు పొందడానికి మాత్రమే తాపత్రంయ పడటడం   దేనికి సంకేతం.

ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రిని మంత్రులను అధికారులను కలవడానికి కొన్ని సంఘాలకు మాత్రమే అనుమతించి మిగతా పోరాడే సంఘాలను అనుమతించక వివక్షత చూపడం కూడా ప్రజాస్వామ్యంలో సరైనది కాదు.

ఈ విషయాలను కూడా బుద్ధిజీవులు మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది. కేవలం ఒక భిక్షగా భావించే బానిస మనస్తత్వం ఉన్నవాళ్లు దయచేసి మారవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

ఇప్పటికీ కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తమ వల్లనే వేతన హెచ్చింపు ప్రకటించబడింది అని అనేక సౌకర్యాలను ప్రకటించడానికి తమ ప్రాతినిధ్యం కారణమని చెప్పడాన్ని ఇకనైనా విరమించుకొవాలి.

నామమాత్రంగా కాకుండా మొత్తము బకాయిలను కూడా వెంటనే నగదు రూపంలో వచ్చే విధంగా ప్రభుత్వంతో ఒప్పించడానికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయుల మన్ననలను పొందగలుగుతారు.
వేతన సవరణ కమిషన్ ఏర్పడిన సందర్భంగా నెలరోజుల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ముప్పై మూడు నెలల తర్వాత కానీ 30 శాతం ట్రీట్మెంట్తో ప్రకటించ లేదంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మధ్యన ఐక్యత లేకపోవడమే కదా కారణం!

వేతన హెచ్చింపు సమస్యల పరిష్కారా
నికి వివిధ దశల్లో పోరాటాలు

వేతన హెచ్చింపు ఇతర సమస్యలను పరిష్కారం కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు తమ ప్రయత్నాల్లో భాగంగా 2018 నవంబర్ 18వ తేదీన వేలాది మందితో హైదరాబాదులో ధర్మాగ్రహ సభ నిర్వహించి శక్తిని చాటారు.

నిర్బంధాలు అక్రమ అరెస్టులను బెదిరింపులను ప్రతిఘటించి 13 మార్చి 2020 న అసెంబ్లీ ముట్టడి లో పాల్గొన్న వేలాది మంది ఉపాధ్యాయుల విజయమే నేటి ప్రభుత్వ ప్రకటన అని చెప్పక తప్పదు.

29 డిసెంబర్ 2020 నా ఇందిరాపార్కు వద్ద ధర్నా ధర్నా, 27 జనవరి న సెక్రటేరియట్ ముందు పిఆర్సి ప్రతుల దగ్ధం సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అనే పాక్షిక ప్రయోజనం వెనుక ఓ పి యస్ సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రేరణగా పనిచేసిందని చెప్పక తప్పదు. మొత్తంగా వివిధ దశల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోరాటాలు నేటి ప్రభుత్వ ప్రకటనకు కారణమని ప్రభుత్వాన్ని సమర్థించే సంఘాలు అంగీకరించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

పాలాభిషేకాలను విడనాడాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాని దేశవ్యాప్తంగా కానీ ఇలాంటి పాలాభిషేకాలు సంస్కృతి గతంలో లేదు. గత పదవ పిఆర్సి కాలంలో 43% ప్రకటించగానే పాలాభిషేకాలు చేస్తే ఆ బానిస విధానాన్ని ఇప్పటికీ అనుసరించడం బాధాకరం.

గతంలో పని చేసిన అనేక మంది ముఖ్యమంత్రులు ప్రకటించిన సందర్భంలో ఏనాడు కూడా పాలాభిషేకాలు అభినందనలు సన్మానాలు ప్రభుత్వ పెద్దలకు చేసిన దాఖలాలు లేవు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టువంటి వార్షిక బడ్జెట్ సందర్భంగా కూడా పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు బుద్ధిజీవులు సైతం పాలాభిషేకాలు వివిధ ప్రాంతాలలో పాల్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరం.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశా వలన కోసం పునర్నిర్మాణం కోసం సమసమాజ స్థాపన కోసం పేదరిక నిర్మూలన కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం కానీ ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ప్రకటన సందర్భంలో కూడా ప్రభుత్వానికి వత్తాసు పలికే సంఘాల నాయకులతో పాటు ప్రజలను కూడా బానిసలుగా తయారు చేసే పాలాభిషేకాల సంస్కృతి, పుష్పగుచ్చాలు లతో అభినందించే సంస్కృతి ,రాచరిక పాలన, సంస్కృతికి అద్దం పడుతుంది. దానిని వెంటనే ప్రభుత్వాలు, సంఘాలు, ప్రజలు వ్యతిరేకించాలి, శాశ్వతంగా విడనాడాలి.

వేతన హెచ్చింపు ప్రకటనకు ఇంత ఆడంబరం అవసరమా

11వ వేతన సవరణ సంఘం సిఫారసు మేరకు ఉద్యోగులకు సంబంధించి నటువంటి వేతన హెచ్చింపు ప్రకటనకు అసెంబ్లీలో ప్రకటించడంతో పాటు పత్రికల్లో పతాక శీర్షికల్లో రావలసిన అటువంటి అవసరం ఆడంబరం అంతగా ఉన్నదా?. ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు లోపల ప్రభుత్వం పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగించుకోవడం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగుల పట్ల ప్రజలకు మరింత వ్యతిరేఖతను కల్పించడానికి కూడా పరోక్షంగా దోహదపడుతుంది.
అర్ధాకలితో బతుకుతున్న అటువంటి దారిద్ర రేఖకు దిగువన ఉన్న అనేక పేద కుటుంబాలకు సంబంధించి పేదరిక నిర్మూలన కానీ నిరుద్యోగ నిర్మూలన చేయకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా సామాన్య ప్రజలను ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రమే పెద్దపీట వేయడం కూడా సరి అయినది కాదు.

ప్రజా సంపదను ప్రజలందరూ కూడా కలిసి పంచుకో వలసిన తరుణంలో అంతరాలు అసమానతలే కాకుండా వేతన వ్యత్యాసం కూడా గణనీయంగా ఉండటం చానల్ లో పని చేస్తున్నటువంటి స్కావెంజర్ లకు1500,2500 ఇవ్వడమే కాకుండా గత నలభై సంవత్సరాలుగా పార్ట్టైమ్ స్వీపర్గా పనిచేస్తున్న వారి యొక్క వేతనం ఇప్పటికి నాలుగు వేలు దాట లేదంటే ఏవర్గ ప్రయోజనం కోసం ప్రభుత్వాలు పనిచేస్తు న్నవి ఉద్యోగుల మధ్యన ఇంత అంతరాలు ఎందుకు ఉన్నవి ఈ విషయాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు.

ఎవరూ కోరని ఎటువంటి ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అని చెప్పుకోవడానికి మాత్రమే ప్రకటించి అమలు చేస్తే ఇప్పటికీ భర్తీ కాకుండా ఉన్న 1,91,000 ఖాళీల సంగతి ఏమిటి? దాదాపుగా 16 లక్షలకు పైగా ఉన్నటువంటి అర్హులైన నిరుద్యోగులకు ఒక భవిష్యత్తు ఏమిటి? ప్రభుత్వం ఆలోచించక పోయినా అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో ద్వారా ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను రద్దు చేయమని ఇప్పటికైనా డిమాండ్ చేయడం ద్వారా తమ విజ్ఞతను ప్రదర్శించాలి. నిరుద్యోగుల భవిష్యత్తు పట్ల తమ బాధ్యతను ప్రకటించాలి.

vaddepalli Mallesamu

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, కవి రచయిత. హుస్నాబాద్,  సిద్దిపేట జిల్లా సెల్: 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *