సెక్రెటేరియట్ లో ఉన్న ఆలయాలు ఏమయ్యాయి?: కాంగ్రెస్ ప్రశ్న

(జి నిరంజన్)
సెక్రటెరియట్ కూల్చివేతలో భాగంగా  మసీదులు, ఆలయాలు అర్ధరాత్రి కూలగొట్టడము అన్యాయమని నేను భావిస్తున్నాను.  ఆషాడ మాసంలో, అందులో మంగళవారము రోజున నల్లపోచమ్మ ఆలయము ధ్వంసము చేయడము రాష్ట్రానికి అరిష్టం. ముఖ్యమంత్రి అర్ధరాత్రి ఆదేశాలీయడం- సి.ఎస్, డి.జి.పి సమక్షములొ కూల్చి వేతలు జరపడం ఆక్షేపణీయం.
ఒక వైపు బోనాల పండుగ జరుపుకోకుండా అమ్మవారికి బోనాలు సమర్పించుకొకుండా ప్రజలపై ఆంక్షలు విధించారు. మరొక వైపు   ఏకపక్షం గా అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడము  ప్రభుత్వ బాధ్యారాహిత్యాన్ని వెల్లడిచేసింది.
ఎత్తైన భవనాలు కూలగొడుతుంటే శిథిలాలు పడి ఆలయాలు, మసీదు దెబ్బ తిన్నాయనే ముఖ్యమంత్రి కెసిఆర్ వివరణ నమ్మశక్యమూగా లేదు. అంతకాదు,ఇపుడు కొత్తవి నిర్మిస్తాముంటున్నారు.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు లేదూ ఈ బుజ్జగింపు.అంత అవగాహన లేకుండా ముందు జాగ్రతలు లేకుండా ఎలాకూల్చేస్తారు? ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
అక్కడ మసీదు, శ్రీ నల్లపోచమ్మ ఆలయము ఉన్నాయనే సోయి సి.ఎస్ మరియు డి.జి.పి స్థాయి అధికారులకు కూడా లేకపోవడం ఆశ్చర్యం గా ఉంది.
వాటిని తరలించడానికి మత పెద్దలతో ఆగమ శాస్త్రవేత్తలతో సంప్రదించారా? సంప్రదిస్తే ఎవరిని సంప్రదించారో ప్రజలకు వివరించారు. కూల్చడానికి ముందు హోమం చేశారని పత్రికల్లో వచ్చిన వార్తలలో వాస్తవమెంత?
ఒకవేళ హోమం చేస్తే ఆ అర్ధ రాత్రి ఆ హోమం ఎవరు చేశారు? వారి వివరాలు ప్రజల ముందుపెట్టాలి.
మసీదు లోని పవిత్ర గ్రంథాలు మరియు ఆలయములోని విగ్రహాలు వేరే చోటికి తరలించారనే వార్తలు వచ్చాయి. ఎక్కడకు తరలించారో తెలుపాలి.
విగ్రహాలు భగ్నము కాకుండా ఉన్నాయా? ఉంటే ఆ విగ్రహాలను శ్రాషోక్తము గా తరలించారా? లేదా ప్రజలకు తెలుపాలి.
సచివాలయ ఉద్యోగులు ప్రతి బోనాల పండుగకు ఈ ఆలయము వద్ద అమ్మవారికి బోనాలు సమర్పించుకునే వారు. కరొనా తో ఉక్కిరి బిక్కిరి అవుతూ, అమ్మ వారి దయ తోనే ఈ వ్యాధి కట్టడి సాధ్యమని విశ్వసించే ప్రజలకు ఈ సంఘటన తీవ్ర ఆవేదన ఆందోళనలకు గురి చేసింది.
Niranjan G , Spokesperson,TSPCC
ముఖ్య మంత్రి గారూ మీరు ఎన్ని కోట్ల ప్రజా ధనముతో ఎంత విశాలమయిన మసీదు మందిరాలను పునర్నిర్మిస్తారనే విషయము కాదు. ఎందుకు ధ్వంసము కాకుండా కాపాడ లేక పోయారనేది ప్రశ్న? అర్ధరాత్రి ఈ హడావుడి ఎందుకు చెేశారు.? ముందు జాగ్రతలు లేకుండా ఎందుకు చేశారో వివరించాలి.
ఇప్పుడు అందరితో చర్చించి పునర్నిర్మాణము చేస్తా మంటున్నారు ఆ పని కూల్చడానికి ముందు ఎందుకు చేయలేదు?
అంటు వ్యాధులనుండి తమని కాపాడమని తెలంగాణ ప్రజలు ప్రతి సంవత్సరము వైభవంగా జరుపుకునే బోనాల పండుగపై , ఎవరితో సంప్రదించకుండ, ఏక పక్షముగా కరొనా పేరుతో ఆంక్షలు విధించడము, అమ్మవారిని దర్శించుకోకుండా నిషేధించడము సబబు కాదు . పూరీ లో జగన్నాథ రథ యాత్రకు కరోనా ఉన్నా అనుమతించారు.  విజయవంతంగా చేశారు.  ఇక్కడ అమ్మవారి ఘటాల యాత్రకు పరిమిత సంఖ్యలోనైనా అనుమతించక పోవడము విచారం. రాష్ట్ర ప్రభుత్వ విపరీత ధోరణులకు నిదర్శనము.
కె.సి.ఆర్ గారు ప్రజలకు వాస్తవాలు చెప్పి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఈ సంఘటనను ఒక గుణపాఠంగా తీసుకుని తన విధానాలు మార్చుకోవాలి.
అధికారులు తమ భాధ్యతలను విస్మరించకుండా తమ గౌరవాన్ని కాపాడు కోవాలి. వారు అధికారములో ఉన్నవారికే కాదు ప్రజలకు కూడా జవాబు ఇవ్వాల్సి ఉంటుదని మరిచి పోకూడదు.
అమ్మ వారి భక్తులు స్పందించాలి. ఈ అపచారము పట్ల ప్రభుత్వానికి తమకు తోచిన రీతిలో నిరసన తెలుపుతూ స్పందించాలి. అమ్మవారి కృపకు పాతృలు కావాలి.
(జి.నిరంజన్ , ప్యాట్రన్, శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం, అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)