Home Breaking జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు, ఆంధ్రా ఎత్తిపోతల మీద కాంగ్రెస్ నిరసన

జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు, ఆంధ్రా ఎత్తిపోతల మీద కాంగ్రెస్ నిరసన

720
0
ఆంధ్రా జల దోపిడీని అడ్డుకోరేం? కృష్ణ నీళ్లు ఆంధ్రాకు పోతే దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుంది, తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాటలు ఏమయ్యాయి..? కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ కృష్ణా ప్రాజెక్టులపై లేదెందుకు? అని మాజీ ఎమ్మెల్యే డా. వంశీ చంద్  రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ మీద నిప్పులు చెరిగారు.
ఈ రోజు ఆయన ఆంధ్ర ప్రదేశ్ తలపెడుతున్న పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, కొత్త సంగమేశ్వరం లిప్ట్ లకు వ్యతిరేకంగా గాంధీభవన్ లో ఒక దీక్షలో పాల్గొన్నారు.
దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ వస్తనే కృష్ణా జలాలలో మన వాటా మనకొస్తయని 2009 ఎన్నికలలో చెప్పిన కెసిఆర్, ప్రత్యేక తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయ్యాక ఏపీ జల దోపిడీ ఎక్కువైంది, అన్ని తెలిసి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు ఉన్న లాలూచీ ఏమిటని ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం నాడు ఈ అంశంపైన ఆయన ఒక ప్రకటన చేస్తూ కేసీఆర్ ను 2009లో పాలమూరు ఎంపీగా గెలిపించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలు ఊపిరిపోసారని ఆయన గుర్తు చేశారు. కృష్ణ పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టి పూర్తి చేస్తారని నమ్మి 2014 ఎన్నికలలో TRS MLA మరియు MPలను గెలిపిస్తే ఏ ఒక్కటి పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
మళ్లీ 2019 ఎన్నికలలో కాంగ్రెస్ , టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని వాళ్ళు గెలిస్తే మన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అడ్డుపడి చంద్రబాబు నీళ్లను మొత్తాన్ని ఆంధ్రకు తరలించుకపోతాడని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి అన్ని గెలిచారని, ఇప్పుడు మా పాలమూరు ప్రజల అభ్యున్నతిని, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని ఆంధ్ర CM జగన్ కి తాకట్టు పెట్టాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు మన ఉమ్మడి జిల్లా ఏడారి కాకుండా ఆంధ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేయాలని పిలుపిచ్చారు..
ఇప్పుడు గెలిచిన నాయకులే అప్పుడు ఉద్యమ సమయంలో నీళ్ళ కోసం ప్రత్యేక తెలంగాణ కోసం అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా
ఉన్నవారిని రాజీనామా చేసి ఉద్యమం చేయాలని ఒత్తిడి చేసారని, ఇప్పుడు ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని వీళ్ళు కూడా పదవులకి రాజీనామా చేసి మన నీళ్ళ కోసం, మన ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని అన్నారు.
గత కాంగ్రెస్ పాలకులు రూపకల్పన చేసి, కాలువలు తీసి, మోటార్స్ కొనిపెట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసిన KLI ప్రాజెక్టులో ఆరెండ్లు దాటిన ఇప్పటివరకు ఈ ప్రభుత్వం పొలాలకి నీళ్ళు పారించడానికి అవసరమైన డిస్ట్రిబ్యూషన్ పనులను పూర్తి చేయకుండా కేవలం గత కాంగ్రెస్ పాలకులు కొన్న మోటార్లు బిగించి , గత కాంగ్రెస్ పాలకులు కట్టిన కాలువలలో నీళ్ళు పారించీ ఏదో ఉద్దరించినట్టు ఓట్ల కోసం ఎన్నికల ముందు కాలువల వెంబడి పాదయాత్ర చేసారని ఆయన ఎద్దేవా చేశారు.
నిజంగా మన ప్రాంత అభివృద్ది మీద చిత్తశుద్ది ఉంటే ఆంధ్ర రాష్ట్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మన నీళ్ళ కోసం, మన ప్రాజెక్టుల కోసం ఇప్పుడు ఆయకట్టు వెంబడి పాదయాత్ర చేయాలని అన్నారు.
పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల కూసెక్కుల నీటిని తీసుకుపోయేందుకు వైస్సార్ ఉత్తర్వులు ఇస్తే అప్పట్లో తెలంగాణ నేతలు సన్నాసులు, దద్దమ్మలు అని నిందించి తెలంగాణ ఎడారిగా మారిపోతుందని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు 80 వేల కూసెక్కుల కోసం జిఓ 203 ఇచ్చినా నోరు తెరవడం లేదని అన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి ఇంత పెద్దఎత్తున నీరు తరలిస్తే పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి, కొంత నల్గొండ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయంలో అఖిల పక్షం తో సమావేశం ఏర్పాటు చేయాలని, వెంటనే ఏపీ నీటి దోపిడీని అడ్డుకొని తెలంగాణ ఏర్పాటు లక్షాన్ని సాధించాలని, కృష్ణ పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.