ఫామ్ హౌస్ లో కూసుని పిఆర్ సి రాయిస్తివా, కెసిఆర్: బండి నిప్పులు

మాటలు చెప్పి మాయ చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్టైలే వేరు అని   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత వేసిన మొదటి పిఆర్ ఎసి వేదిక  సిఫార్సుల మీద స్పందిస్తూ  ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడని ఒక ప్రకటనలో అన్నారు.

“ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అని వూరించి వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు  బిశ్వాల్ (మాజీ ఐఎఎస్ అధికారి) కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు. అందరినీ మోసం చేసే. ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను.. ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు.. 7.5 శాతం పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా.. మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా,” అని సంజయ్ తన స్టైల్లో  వ్యాఖ్యానించారు.

అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా? స్వతంత్రంగా పని చేయనిచ్చారా, అని అనుమానం వ్యక్తం చేస్తూ ‘ఫాం హౌజ్ ల కూసోని పిఆర్ సి రాయించినవా కేసీఆర్,” అని అన్నారు.

బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే…

*ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వాల్ కమిటీ వేసి ,  ఆ కమిటీ ఏం రాయాలే,  ఎంత రాయాలే  ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి HRA 6 శాతం తగ్గించటం దారుణం. మోసం. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్. ఉద్యోగుల ను మోసం చేసినవ్.  7.5 పిఆర్సీ ఇచ్చి సిపిఎస్  10 శాతం తగ్గిస్తవి.. 30 శాతం ఉన్న సిపిఎష్ ఉద్యోగికి ఈ పిఆర్సీ ద్వారా జీతం పెరగదు.. పైనంగ 2.5 శాతం జీతం తగ్గుతది.

*31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది గిదా? ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43 శాతం ఫిట్ మెంట్ ఇయ్యాలి. వున్న ఉద్యోగులు మన జనాభా కు సరిపోయినట్లు వున్నారా? జనాభా ప్రాతిపదికన లేరు.  ఉద్యోగులపై పని భారం పెరిగింది. ఇంకా కమిటీలు. రిపోర్ట్ లు అన్నీ కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి.

ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు.

సమైక్య పాలకులు 25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు.

పిఆర్ సి వేసిన వెంటనే ఐఆర్ (తాత్కాలిక భృతి) ఇవ్వడం సంప్రదాయం. కానీ ఈ సర్కార్ ఐఆర్ కూడా ఇవ్వలేదు.

ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే హెచ్ ఆర్ ఎ  తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *