పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి : టిడిపి

సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి   ఉద్యోగులు సహకరించరని చెపుతున్న పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణం బర్తరఫ్ చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా పని చేయమని ఉద్యోగులను పరోక్షంగా రెచ్చగొడుతున్న పెద్దిరెడ్డిపై కుట్ర కేసు పెట్టాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసి)ని కోరారు.

రాజ్యాంగాన్ని రక్షిస్థానని ప్రమాణం చేసిన మంత్రి రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా మాట్లాడటం నేరంగా పరిగణించాలని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించడం మంత్రి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. వేలాది మందితో ఊరేగింపులు చేస్తున్న నాయకులకు ఎన్నికలనగానే కరోనా గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఎన్నికల పేరు చెప్పగానే భయపడుతున్న రామచంద్రారెడ్డి,
నిమ్మగడ్డతో కొందరు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమని సుధాకర్ రెడ్డి చెప్పారు.
తొలినుంచి కమిషన్ కు సహాయనిరాకరణ చేస్తున్నారని చెబుతూ కనీసం వోటర్ లిస్టును కూడా సవరించలేదని ఆయన అన్నారు. ఈ కారణాన్నే రాష్ట్ర ఎన్నికల కమిషన్  2019 నాటి వోటర్ల జాబితాను వాడాల్సివచ్చిందని, దీని వల్ల సుమారు 3.5 లక్షల మంది యువకులు ఓటు హక్కురాకుండా పోయిందని ఆయన చెప్పారు. దీనికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే నని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని పూర్తిగా రాష్ట్రంలో ఉల్లంఘిస్తున్నారని, దీనికి పర్యవసానాలుంటాయని ఆయన హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *