స్టైరీన్ బాధితులకు జీవితాంతం ఉచిత చికిత్స: ఆంధ్ర నిర్ణయం

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాద బాధితులపై ఆ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని ‘సీఎస్ఐఆర్ -ఎన్ ఇఇ ఆర్ ఐ (CSIR-NEERI) నిపుణులుచెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గ్యాస్ లీక్ బాధితులకు భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.
విశాఖ సమీపంలోని  ఎల్ జి పాలిమర్స్ నుంచి మే 7 వ తేదీ తెల్లవారుజామున స్టైరీన్ (Styrene)విషవాయువు లీకయి భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వాయువు వల్ల 12 మంది చినిపోయారు. పలువురు దుష్బ్రభావానికి లోనయ్యారు. అక్కడి గ్రామాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సహాయక చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా ఇపుడు స్టైరీన్ బాధితులకు జీవితాంతం ఉచిత చికిత్స అందివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
ఇప్పటికే బాధితుల ఆరోగ్యంపై పూర్తి బాధ్యత తీసుకుని ప్రభుత్వం వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిందని మంగళవారం నాడు విశాఖలో ఆయన చెప్పారు.
బాధితులకు రాబోయేకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా చికిత్స అందిస్తామని కూడా  మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు.
ప్రజలక్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైరిన్ తరలించేందుకు ఆదేశాలిచ్చారని,ఎల్జీ పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న 13వేల టన్నుల స్టైరిన్ ను ఆదేశాలానుసారం దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రలో మరో ప్రమాదానికి అవకాశం లేకుండా 13 జిల్లాలలో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.