ఏపీలో కోవిడ్ తో బిజీ గా ఉన్నాం, పంచాయ‌‌తీ ఎన్నిక‌లు వ‌ద్దు: సీఎస్ సాహ్ని

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆంధ్ర  ప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తిప్పికొట్టింది. కరోనా కారణంగా ఇప్పట్లో ఎన్నికలు జరపలేమని, అలాంటి ప్రయత్నం మానుకోవాలని కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలమ్ సాహ్ని లేఖ రాశారు.
గతంలో కోవిడ్ విజృంభిస్తున్నదని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్రఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నపుడు జగన్ ప్రభుత్వం విబేధించింది.
ఈ విషయం కోర్టు దాకా వెళ్లింది. పెద్దదూమారం లేచింది.  రమేష్ కుమార్ కు తెలుగు దేశం బ్రాండ్ వేసింది జగన్ ప్రభుత్వం. ఆయన పదవిలో ఉండగా ఎన్నికలు జరిపించరాదని నిర్ణయించుకుంది. ఆయని పదవీ కాలాన్ని కోత కోసింది. తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తిని కమిషనర్ గా నియమించింది. ఈ వివాదంలో రమేష్ దే పై చేయి అయింది. సుప్రీంకోర్టు ద్వారా ఆయన మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.
ఇపుడు కరోనా తగ్గు ముఖం పట్టిందని, లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయవచ్చని కేంద్రప్రకటించాక ఆయన పంచాయతీ ఎన్నికలు జరపాలనుకుంటున్నారు.
అయితే, రాష్ట్రం వీలుకాదంది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నివారణ లో పూర్తిగా లీనమయి ఉందని, ఇపుడు ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలమ్ సాహ్ని లేఖ రాశారు.
ఇపుడు కమిషన్ , రాష్ట్ర ప్రభుత్వం మధ్యవివాదం రాజుకుంది.  ఏమవుతుందో చూడాలి. ఎన్నికలను రమేష్ కుమార్ జరిపిస్తారా; ఆయన కాలంలో ఎన్నికలు జరిపించరాదన్న జగన్ ప్రభుత్వం పట్టుదల నెరవేరుతుందా?
 ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌మేష్   కుమార్‌కు ఈ రోజు లేఖ రాశారు. “క‌రోనా నివారణ చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నందున రాష్ట్రంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఇప్ప‌ట్లో సాధ్యంకాదు, అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ప‌రిస్థితుల‌కు అనుగుణంగా క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఈ విషయంలో  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని ఆమె పేర్కొన్నారు.
Nimmagadda Ramesh Kumar SEC, AP
నిన్న రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని చేసిన ప్రకటనకు ఇది స్పందన. రమేష్ కుమార్ ప్రకటన:
“ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు.ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదు. నాలుగు వారల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.”
అయితే, రమేష్ కుమార్ నిర్ణయాన్ని కరోనా పేరుతోనే ఎదుర్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి నీలం సాహ్ని కమిషన్ కు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు:
*స్థానిక ఎన్నికల నిర్వహణ పరిస్థితులు లేవు
*ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం లేదు.
*రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రంగం అంతా దానిని ఎదుర్కోవడం లో నిమగ్నమై ఉంది.
*రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
*గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది.
*ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి.
*ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ఖచ్చితంగా ప్రజా హితం కాదు.
*కరోనా మహమ్మరిని ఎదుర్కోవడం లో ఒక్కో రాష్ట్ర ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోంది.
*ఏ రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చడం తగదు. ఆంధ్రని తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దు.
*రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది మరణించారు
కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే చాలాకాలం, రాబోయే నెలల్లో *తీవ్రత ఎక్కువ ఉంటుందని తెలిపింది.
*ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలి
*ఇలాంటి నేపథ్యం ఎన్నికల నిర్వహణ పై మీరు నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ కూడా అవసరం లేదు.
*రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమమయినపుడే  ఎన్నికల నిర్వహణ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలు
*ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిని సానుకూలంగా పరిగణనలోనికి తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *