తెలంగాణ పార్టీలకు సవాల్ గా మారనున్న షర్మిల, నిరాహార దీక్షతో జైత్రయాత్ర

 

పోరాటంతో వైఎస్ షర్మిల పార్టీ మొదలు కాబోతున్నది. తెలంగాణలో ఆమె నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నట్లు నిన్నఖమ్మం సభలోప్రకటించారు. తెలంగాణ యువకులకు ఆమె మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం ప్రభుత్వం మీద వత్తిడిపెంచేందుకు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. తనత పాటు జిల్లాకేంద్రాలలో కూడా నిరాహారదీక్షలు సాగుతాయని ఆమె ప్రకటించారు. తెలంగాణలో ప్రజల తరఫున నిలబడానని, ప్రజల సమస్యల కోసం కొట్లాడతానని షర్మిల తన తల్లి విజయమ్మ తో కలసి ఖమ్మలో జరిగిన సంకల్ప సభ లో ప్రకటించారు. ఆమె రాజకీయ యాత్ర చాలా పకడ్బందీగా సాగుతూ ఉంది. ఆమె ఉపన్యాసం చాలా ప్రొవొకేటివ్ గా ఉంది. ఆమె రెండు అంశాలను తెలంగాణ ప్రజల ముందు పెట్టింది. ఒకటి: నేను తెలంగాణ బిడ్డనే. రెండు: తెలంగాణ సమస్యలకు పరిష్కారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్గమే. ఈ విషయాన్ని ఆమె చాలా నిర్మొహమాటంగా నిర్ద్వంద్వంగా ప్రకటించడం విశేషం.

“సరిగ్గా 18 ఏళ్ల కిందట ఇదే రోజున అంటే ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్ చారిత్రాత్మక పాదయాత్ర ‘ప్రజాప్రస్థానం’ ప్రారంభమైంది. ఇప్పుడు అదే ఏప్రిల్ 9న నేను రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నాను,’ అని అనడం విశేషం.
తెలంగాణలో వైఎస్ ఆర్ పేరు వినిపించకుండా చేసేందుకు ప్రయత్నం జరిగిన తెలంగాలో ఇక ముందు రోజూ వైఎస్ ఆర్ పేరు వినిపించేందుకు షర్మిల పూనుకున్నారు.
తెలంగాణ పరిశీలకుల్లో, ప్రజల్లో షర్మిల ఇంకా ప్రశ్నార్థకంగా ఉనే ఉన్నారు. ఆమె కెసిఆర్ వదలినబాణమని, కాదు,బిజెపి వదలిన బాణమనేచర్చ ఇంకా సాగుతూనే ఉంది. తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న చోట ఆమె సమైక్య వాది వైఎస్ఆర్ బాట, రాజన్న రాజ్యం అంటున్నా ఏవైపునుంచి పెద్ద గా విమర్శ రావడంలేదు. ఇది వ్యవూహాత్మకమా లేక తెలంగాణకు ఈ మధ్య అందరిని అక్కున జేర్చుకునే గుణం అబ్బిందా అనేది ప్రశ్న.
తెలంగాణలో రెడ్ల బలం ఎక్కువ. అంతేకాదు,వారు ఆర్థికంగా కూడా బలపడిన వర్గం కూడా. వీళ్లందరు తమ పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు, ఇతర పార్టీలలోకి వెళ్లకుండా ఒక చోట (షర్మిల పార్టీ) గుమికూడేలా చేసేందుకే ఆమె రంగంలోకి దించారనే వాదన బలంగా వినబడుతూ ఉంది. ఇలా ఒక్క శక్తిగా ఆమె తెలంగాణలో బలపడినా, భవిష్యత్తులో ఎవరితోనైనా కలసి ఆమె సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనేది ఈ వాదన. కెసిఆర్ తోకలవచ్చు. బిజెపి తో కలవచ్చు. లేక మరొకరెవరితోనై కలవ్వచ్చు.

మొత్తానికి తలంగాణ రాజకీయాల్లో షర్మిల ఒక ప్రశ్నార్థకంగా మారారు.

పార్టీ పేరును,జండాను, అజండాను ఆమె ప్రకటిస్తారని ఆశించిన అభిమానులకు, రాజకీయ పరిశీలకులకు, మీడియాకు కొంత నిరాశ ఎదురైనా ఎదురైనా ఈవిషయంలో తేదీ ప్రకటించి ఆమె కొంత స్పష్టత ఇచ్చారు.

పార్టీ పేరును జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తానని చెప్పారు.. అదే రోజున పార్టీ జెండా, అజెండా వెల్లడిస్తారు.

ఆంధ్ర పార్టీ అని ముద్ర పడక ముందే ఆమె జాగ్రత్త పడి తాను పుట్టింది పెరిగింది, పెళ్లి చేసుకున్నది అంతా తెలంగాణలోనేనని, తాను తెలంగాణ బిడ్డ అని ప్రకటించారు. “ఈ తెలంగాణ గడ్డ మీదే గాలి పీల్చా, ఈ గడ్డ మీదే నీళ్లు తాగా… నా పిల్లలను ఇక్కడే కన్నాను. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం, రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా?” అని సెంటిమెంట్ బాణం వదిలారు.

షర్మిల రాజకీయ ప్రస్తానం ప్రకటన వచ్చినప్పటినుంచి ఆమెను ఆంధ్ర నాయకురాలని ఎవరూ గట్టిగా అనలేదు. అదే విధంగా తెలంగాణ కోసం పార్టీ పెట్టిన కెసిఆర్ ను ఆ రోజుల్లో మాట్లాడకుండా నోరు మూయించిన రాజశేఖర్ రెడ్డి పేరుతో ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తానని ప్రకటించినా ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇలా తెలంగాణలో ఇపుడు సమైక్యవాది రాజశేఖర్ రెడ్డి పేరు ను ముందుకు తీసుకువచ్చి, అసలు తెలంగాణ సమస్యలకుపరిష్కారం రాజశేఖర్ రెడ్డే అనడం ఒక సాహసపేత ప్రకటనే.
చాలా స్పషంగా ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని, రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తానని, రాజన్న రాజ్యం స్థాపిస్తానని, అసలు తెలంగాకు కావలసింది రాజన్న రాజ్యమే నని ఆమె ప్రకటించారు.

కొత్త గా పార్టీ పెడుతున్నపుడు చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ కోదండ్ రామ్ తదితర నేతలు మాట్లాడినట్లే ఆమె కూడా చెప్పారు. ‘పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడతాను. తెలంగాణ గడ్డమీద ఎలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్నయినా నేను అడ్డుకుంటాను. నాకు అవకాశం ఇవ్వాలో, వద్దో ప్రజలే నిర్ణయిస్తారు,’ అని చెప్పారు. “నేటి కార్యకర్తలే రేపటి నాయకులు,’ అని ఎవరికీ తీసిపోని విధంగా రాజకీయ ప్రసంగం చేశారు.

కెసిఆర్ మీద మెల్లిగా స్వరం పెంచారు. “ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు. ఇది అక్షర సత్యం. తెలంగాణ ఉద్యమంలో వందలమంది అమరులయ్యారు. వారందరికీ తన జోహార్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు,’ అని షర్మిల ప్రశ్నించారు ఆమె ప్రసంగం తెలివిగా తెలంగాణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్క్రిప్ట్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. షర్మిలా తెలంగాణ ఓటర్లకు సవాల్. ఆమె రాజశేఖర్ రెడ్డి మార్క్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ ప్రజలకు తనకు తోడున్నారని అన్నారు. సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. “మీరు ఒంటరి కాదు, మీకు నేను తోడున్నా… అట్టానే నేను కూడా ఒంటరిని కాదు, నాకు మీరు తోడున్నారు” అని షర్మిల అన్నారు.
ప్రతిపక్షాల మీద దాడి

‘‘తెలంగాణలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమేది? అన్నీ ఒక తాను ముక్కలే. నువ్వు కొట్టినట్లు చెయ్యి‌. నేను ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుంది వారి పరిస్థితి. జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా. మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు. ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం’’ అని అన్నారు.

పాత ప్రశ్నలు కొత్త గొంతు

నిన్న ఖమ్మం పెవిలియన్ మైదానంలో వినిపించినవన్నీ పాత ప్రశ్నలే. అయితే, గొంతు కొత్తది. అందువల్ల ప్రజలు ఆసక్తిగా విన్నారు.

“కెసిఆర్‌ అవినీతిని ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. రైతుల పేరుతో అప్పులు తెచ్చి పాలకులు జేబులు నింపుకుంటున్నారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్‌ కలలు కన్నారు. కేసీఆర్‌ చెప్పిన కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? ప్రైవేట్‌ రంగంలోనూ వైఎస్‌ 11 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఏమైంది? వైఎస్‌ హయాంలో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు.కెసీఆర్‌ ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అన్నారు, ఎక్కడ?

ఆంధ్రలో కుమారుడు విజయవంతమయి, ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించిన తల్లి విజయమ్మ, తెలంగాణలో కూతురు విజయవంతమై ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించేందుకు షర్మిల వెన్నంటే ఉన్నారు.

అప్పగింతలు

షర్మిల ఇక నుంచి మీ బిడ్డ. మీకు ఆమెను అప్పగిస్తున్నాను.ఆమె రాజశేఖర్ రెడ్డి బిడ్డ. రాజశేఖర్ రెడ్డి ఆమె తీర్చి దిద్దారు. రాజశేఖర్ రెడ్డి తెలంగానకు నీళ్లు తెచ్చారు. పరిశ్రమలు తెచ్చారు.దానిని షర్మిల కొనసాగిస్తారని ఆమె కూతరుని తెలంగాణకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *