రాజన్న రాజ్యమంటే ఇదేనా? : 16న అనంతపురంలో ‘సీమ సత్యాగ్రహం’

రాయలసీమ అంశాల పట్ల పాలకుల దృక్పధంపై చర్చించడానికి రాయలసీమ న్యాయమైన కోర్కెల సాధనకు అనంతపురం లో నవంబర్ 16 న   “సీమ సత్యాగ్రహం” చేపడతున్నారు.
దీనిని  విజయవంతం చేయడానికి కార్యాచరణ రూపొందించడానికి పి.యం.ఆర్ కాలేజి యస్.బి.ఐ కాలని రోడ్డు, నంద్యాలలో ఈ రోజున   సమావేశం జరిగింది. అక్కడ చర్చించిన అంశాలు:
1. రాయలసీమలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టుది ఒక అంతులేని కన్నీటి గాథే :
● ప్రాజెక్టులకు కేటాయించిన నీరు సమృద్ధిగా లభిస్తున్నా, ఏ ప్రాజెక్టు కింద కూడా నిర్దేశించిన ఆయకట్టుకు నీరు అందడం లేదు, కేటాయించిన నీటిని వినియోగించుకునే అవకాశమే లేదు.
● తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె. సి. కెనాల్, ఎస్. ఆర్. బి.సి., తెలుగు గంగ, బైరవాని తిప్పి, గాజులు దిన్నె ప్రాజెక్టుల కింద 19.27 లక్షల ఎకరాలకు నీరు అందించ వలసి ఉంటే ఏ సంవత్సరం కూడా 8లక్షల ఎకరాలకు మించి నీరు అందడం లేదు.
● గాలేరు నగరి మెదటి ఫేజ్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. రెండవ ఫేజ్ ఊసే లేదు.
● హంద్రీ నీవా మెదటి ఫేజ్ పూర్తి అయ్యి 7 ఏళ్ళైన 10శాతం ఆయకట్టుకు కూడా నీరందించే లేని పరిస్థితి. హంద్రీనీవా రెండవ ఫేజ్ లో ఏం జరుగుతుందో, దాని DPR ఏమిటో ప్రభుత్వానికి, సాగునీటి శాఖ కే తెలియాలి.
● శ్రీశైలం రిజర్వాయర్ కు ఈ సంవత్సరం 1700 టి.ఎం.సీ. లో నీరు వచ్చిన (శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యానికి 800 శాతం) కాలువల తదితర నిర్మాణాల పట్ల పాలకుల, అధికారుల నిర్లక్ష్యం వలన రాయలసీమలోని రిజర్వాయర్ల సామర్థ్యంలో 50 శాతం కూడా నీరు నింపలేక పోయారు‌.
2. రాయలసీమకు ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలు శుష్క వాగ్దానాలేనా ?
● 2019 వ సంవత్సరం ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను ఆ పార్టీ అధికారంలోకి రాగానే అమలుపరచడానికి కార్యాచరణ చేపట్టారు. కానీ రాయలసీమకు సంబంధించిన హామీల విషయంలో ప్రభుత్వ తాత్చార్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
● పైన వివరించిన ప్రాజెక్టులకు నీరు సక్రమంగా అందించడానికి చేపట్టవలసిన కాలువల సామర్థ్యం పెంపు, రిజర్వాయర్ల నిర్మాణం తదితర విషయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల సందర్భంగా హామీలను గుప్పించింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. కాని దీర్ఘకాలిక అంశాలైన గోదావరి జలాలను మళ్లించడం అనే విషయాన్ని తెరపైకి తెచ్చి తక్షణమే చేపట్టాల్సిన అంశాలపై నిర్ణయాలు తీసుకోకుండా రాయలసీమ అంశాలు పట్ల ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది.
● ఐదు సంవత్సరాల క్రితమే DPR తయారైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడంపై నిర్ణయాలు, రాయలసీమ ప్రజల హృదయ స్పందన అయిన సిద్దేశ్వరం అలుగు DPR తయారుచేయడంపై నిర్ణయాలు, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఎల్ ఎల్ సి, హెచ్ ఎల్ సి సమస్యల శాశ్వత పరిష్కారం చేపట్టడంలో గాని ప్రభుత్వ చర్యలు ఆశాజనకంగా లేవు.
3. ఆర్థికపరమైన అంశాలు లేని విషయాలపై కూడా అదే నిర్లక్ష్యమా ?
● ఆర్థిక పరమైన అంశాలు లేని పట్టిసీమ ద్వారా ఆదాఅయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాల్సిన విధానపరమైన నిర్ణయాలు, జీవో నెంబర్ 69 రద్దుచేసి శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులకు పునరుద్ధరించడానికి విధానపరమైన నిర్ణయాల పట్ల కూడా నూతన ప్రభుత్వం గత ప్రభుత్వంలాగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది‌.
4. చెట్టు నీరు పథకం :
● చెట్టు నీరు పథకం గత ప్రభుత్వం చేపట్టి కేంద్ర ప్రభుత్వం నుండి గత సంవత్సరం అవార్డులు కూడా పొందింది‌. అవార్డులైతే వచ్చాయి కాని రాయలసీమలో ఈ సంవత్సరం వర్షాలు (ఆలస్యంగా నైనా) అత్యధికంగా పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లి పారిన అనేక చెరువులలోకి చుక్క నీరు కూడా రాలేదు. కర్నూలు జిల్లాలోని 574 చెరువులకు గాను 224 చెరువులో చుక్క నీరు రాకున్నా సాగునీటి శాఖ కు చీమకుట్టినట్టు కూడా లేదు. పాలకులకు ఇవేమి పట్టనే లేదు.
5. అభివృద్ధి వికేంద్రీకరణ :
● అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామని ఎన్నికలలో వాగ్దానం చేసి అధికారంలోనికి వచ్చాక కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటుకై నిర్ణయం, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటుపై నిర్ణయాలు చేయడంలోను నాన్చుడు దోరిణినే ప్రభుత్వం వహిస్తున్నది‌.
6. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల సాధన:

● రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు మరియు పూర్తి చేయడానికి నిధులు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేయడం లేదు.

7. రాజన్న రాజ్యం అంటే ఇదేనా ?
● ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అక్టోబర్ 1, 1953 న జరిగింది. ఈ రాష్ట్ర అవతరణకు రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అత్యంత కీలకమైనది‌. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 1, 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం రాజధాని కర్నూలులో ఏర్పాటయింది. తదనంతరం నవంబర్ 1, 1956 ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ కలిసి చేరడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడంతో 1953లో ఏర్పడిన ఆంద్ర రాష్ట్రమే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గా కొనసాగుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ దినోత్సవం అక్టోబర్ 1న జరపకుండా నవంబర్ 1 జరపడం రాయలసీమ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన ప్రభుత్వం రాయలసీమ వాసులకు కలుగజేసింది.
●  YS రాజశేఖర రెడ్డి గారు నవంబర్ 1 ని విద్రోహ దినంగా ప్రకటించి 1.11.1997 న సత్యాగ్రహ దీక్ష కడపలో చేపట్టారు. కాని రాజన్న రాజ్యం తెస్తామని ఎన్నికల వేళ ప్రచారం చేసిన YSRCP అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరిపారు. రాజన్న ఆశయాలు కు వ్యతిరేకంగా రాయలసీమ హక్కుల పట్ల వివక్ష చూపడంతో రాజన్న రాజ్యం అంటే ఇదేనా అన్న సంశయంలో రాయలసీమ ప్రజలు పడిపోయారు.
8. గత ప్రభుత్వం బాటలోనే నూతన ప్రభుత్వమా ?
● రాయలసీమ పట్ల గత ప్రభుత్వ ధోరణికి నూతన ప్రభుత్వం ఆలోచనలకు పెద్ద మార్పు లేదన్న విషయాన్ని రాయలసీమ ప్రజలు అవగతం చేసుకుంటున్నారు.
9. సమావేశం ప్రతిపాదించే రాయలసీమకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చ.

● సమావేశం ప్రతిపాదించే రాయలసీమకు సంబంధించిన అంశాలపై చర్చించడం.

10. రాయలసీమ భవిష్యత్తు పట్ల గంపెడాశలు పెట్టుకున్న నూతన ప్రభుత్వాన్ని తట్టిలేపుదామా ?
● ఈ నేపథ్యంలో రాయలసీమ బతుకు తెరువు సమస్యలపట్ల మానవీయ కోణంలో స్పందించేలాగా పాలకులను తట్టిలేపడానికి రాయలసీమ హక్కుల దినమైన శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన నవంబర్ 16 న “సీమ సత్యాగ్రహం” ను అనంతపూర్ లో రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై సమావేశం చర్చించి కార్యాచరణ చేపట్టడం.
11. మన భవిష్యత్తుకై ప్రజా స్పందనతో పాలకులను తట్టి లేపే దిశగా కార్యాచరణ:
● రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒడంబడిక లోని అంశాలను విస్తృతంగా ప్రచారం చెయ్యడం.
● సమైక్యాంధ్ర ఉద్యమంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉండాల్సందన్న రాజకీయ పార్టీలు వ్యక్తపరిచిన విషయాలను విస్తృతంగా ప్రచారం చెయ్యడం.
● బిజెపి పార్టీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ కు ప్రజలకు వివరిస్తూ, ముందుగా బిజెపి పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమకు బుందేల్కండ్ ప్యాకేజి, నిర్మాణంలో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ళు, నిధుల కేటాయింపులు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు పట్ల క్రియాశీలకంగ వ్యవహరించేలాగా చేయడానికి ప్రజలను చైతన్యవంతులను చేయడం.
● పైన పేర్కొన్న విషయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు, రాయలసీమ న్యాయమైన కోర్కెల సాధనకు చేపట్టిన “సీమ సత్యాగ్రహం” లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనేలాగ గ్రామ స్థాయి, మండలం స్థాయి సమావేశాలను నవంబర్ 7 నుండి 14 వరకు నిర్వహించేలాగ రైతు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు బాధ్యతల స్వీకరణ.
ఈ సందర్భంగా నవంబరు 16 న అనంతపురం లో జరిగే సీమ సత్యాగ్రహ కరపత్రాలను నాయకులు విడుదల చేసారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో Y.N.రెడ్డి, వెంకటేశ్వరనాయుడు, బాలీశ్వరరెడ్డి, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు రామసుబ్బయ్య,ఓబుళరెడ్డి ఆత్మకూరు బార్ అసోసియేషన్ నాయకులు వరప్రసాద్, కుందూ పరిరక్షణ సమితి నాయకులు కామిని వేణుగోపాల్ రెడ్డి,
రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి, K.కళావతి,
నందిరైతుసమాఖ్య నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, చంద్రశేఖర రెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు M.C.కొండారెడ్డి,మాజీ సర్పంచ్ లు రామసుబ్బారెడ్డి,రామనాగిరెడ్డి, కోటేశ్వరరెడ్డి,బుగ్గరామిరెడ్డి, విశ్రాంత M.E.O. బ్రహ్మానందరెడ్డి, పాణ్యం రైతు సంఘం నాయకులు శంకరయ్య, చాగలమర్రి మండల రైతు నాయకులు రామ గురివిరెడ్డి మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు , రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.