ఆర్టీసి డ్రైవర్ రాజు చక్రం తిప్పుతాడా; అశ్వత్థామ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

ఎవరో ఈ రాజు ఎవరికీ తెలియదు. కూకట్ పల్లి డిపోలోడ్రైవర్ . నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగంతో చాలా స్పూర్తిపొందాడు. దేవుడు వరమిచ్చినట్లు కెసిఆర్ సలహా ఇచ్చారని, దానిని పాటించి బతుకులు బాగు చేసుకుందామని కెమెరాల ముందుకొచ్చి పిలుపు ఇచ్చి వైరలయ్యాడు.
పొట్టి శ్రీరాములు లాకా మమ్మల్ని చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు.
తాను విధులకు హాజరుకావాలనుకుంటున్నట్లు డిపో మేనేజర్కు లేఖ కూడా రాశాడు.
అంతేకాదు,  సమ్మె తమని రెచ్చగొట్టాడని ఏకంగా ఆర్టీసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమ్మెకు ఆయనే కారణమని, అసలు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనంచేయాలనడమే ఒక విషమని రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ ఉద్యోగాలు వూడిపోయే పరిస్థితి తీసుకురావద్దని ఆయన అశ్వత్థామరెడ్డికి సూచించారు.
అంతేకాదు, ఆర్టీసి సమస్యలు పరిష్కాలించాలనుకుంటే ‘నువ్వే ప్రధాని దగ్గిరికి , రాష్ట్రపతి దగ్గిరికిపోయిరా’ అంటూ తమ మద్దతు  ఉంటుందని చెప్పాడు.
ఆయన పోలీసుల కిచ్చిన ఫిర్యాదు లోని అంశాలివి:
‘ అయ్యా ! నా పేరు రాజు. నేను కూకట్‌పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సార్‌ మా యూనియన్‌ లీడర్‌ అశ్వత్థామరెడ్డి కార్మికుల మనసులో (ఆర్టీసి  ప్రభుత్వంలో  విలీనం) అనే విషాన్ని నింపారు. ఆయన మాటలు నమ్మి 22 రోజులుగా జరుగతున్న ఆర్టీసీ సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను. అంతేగాక ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్‌ రావును కొందరు పనికిమాలిన వాళ్లు ‘ మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ’ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
అసలు సమ్మె విషయం హరీష్‌ రావుతో చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం. బుధవారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ఒక్కరే పీఎం, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో రాశాడు.
రేపు చర్చలు?
ఇది ఇలా ఉంటే శనివారం నాడు  ఆర్టీసీ కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు బస్ భవన్లో చర్చలు జరగవచ్చని సమాచారం. ఈడిల స్థాయిలో కార్మిక సంఘాలతో యాజమాన్యం సంప్రదింపులుండవచ్చని ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేని 12 అంశాలపై చర్చలు జరగవచ్చని తెలిసింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
మరొక వైపు కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసి యాజమాన్యం ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రవాణా సదుపాయాల మెరుగుకై  అధికారులు  ప్ర‌య‌త్నిస్తున్నారు. శుక్ర‌వారం సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు న‌డిచిన బ‌స్సుల సంఖ్య‌ను గ‌మ‌నించిన‌ట్ల‌యితే 1928 అద్దె బ‌స్సుల‌ను క‌లుపుకుని మొత్తం 6519 బ‌స్సులను తిప్ప‌గ‌లిగారు.
11వేలకు పైగా తాత్కాలిక డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్లు విధులు నిర్వర్తించ‌గా, 4320 బ‌స్సుల్లో టిమ్స్ ద్వారా, 1402 బ‌స్సుల్లో నేరుగా టికెట్ల జారీ ప్ర‌క్రియ కొన‌సాగిందని ఆర్టీసి ఒకప్రకటనలో తెలిపింది.
కాగా, నిర్దేశించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయ‌డం, విధిగా టిక్కెట్లు ఇచ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టే విష‌యాల‌పై అధికార యంత్రాగం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ విష‌యంపై డిపో నుంచి బ‌స్సు బ‌య‌లు దేరే ముందు తాత్కాలిక సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంస్థ జారీ చేసే బస్ పాసులను త‌ప్ప‌ని స‌రిగా అనుమ‌తించాల‌ని చెబుతూ వాటిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.
రాష్ట్ర ర‌వాణా శాఖా మంత్రి శ్రీ పువ్వాడ అజ‌య్ కుమార్‌, సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్, టి.ఆర్ అండ్ బి ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ సునీల్ శ‌ర్మ‌, ఐ.ఎ.ఎస్‌లు ప్ర‌జా ర‌వాణా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌యాణీకుల‌కు మెరుగైన‌ సేవ‌ల్ని అందుబాటులోకి తీసుకురావ‌డానికి గానూ అవ‌కాశాల‌న్నింటిపై దృష్టి కేంద్రీక‌రించారు. ప్ర‌జ‌ల‌కు ర‌వాణా లోటు క‌న‌బ‌డ‌కుండా చూడాల‌ని, అవ‌స‌ర‌మైన మేర‌కు బ‌స్సు స‌ర్వీసుల్ని తిప్పి ప్ర‌యాణీకుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని వారు కోరారు.