అమరావతిలో కొత్త వ్యక్తుల నిషేధం?… క్యాబినెట్ కోసం నిషేధాజ్ఞలు?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనకు  అమరావతి రాజధాని గ్రామాలలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలోకి కొత్త వ్యక్తులు చొరబడకుండా నిషేధం విధించారు.
ఈ మేరకు ప్రజలకు నోటీసులు జారీ చేశారని గ్రామస్థులు చెబుతున్నారు.  ఒక రైతు ఈ నోటీసును ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు అందించారు. అయితే,  ఇందులో పోలీస్ నోటీసు అని మాత్రం ఉంది. నోటీసు మీద పోలీసు ముద్ర లేదు.  క్యాబినెట్ సమావేశం కోసం ఇలా కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా గతంలో ఎపుడూ నిషేధం విధించలేదని  రైతులు చెబుతున్నారు.
 ఈ నెల 27 వ తేదీ అమరావతిలోనే క్యాబినెట్ కీలకసమావేశం జరుగుతున్నందున ఈ నిషేధాజ్ఞలు విధించామని పోలీసులే తమకు చెప్పినట్లు రైతులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మూడు రాజధానుల మీద అసెంబ్లీ చేసిన ప్రకటన, తర్వాత జిఎన్ రావు నాయకత్వంలో వచ్చిన నిపుణుల కమిటీ సిఫార్సుల నేపథ్యంలో అమరావతి భవితవ్యం మీద క్యాబినెట్ 27వ తేదీన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని ప్రజలంతా భావిస్తున్నారు.
దీని వల్ల రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధాని పరిరక్షణ కోసం జెఎసి  ఏర్పాటుచేసి ఆందోళనను ఉధృతం చేశారు. మరొక వైపు హైకోర్టును కర్నూలుకు తరలించరాదని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు కూడా ఆందోళనకు దిగారు.
మందడం రైతులకు  తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.
27న రైతుల నివాసాల్లో కొత్త వ్యక్తులు ఉండకూడదని, కొత్త వ్యక్తులు ఉంటే వెంటనే మాకు తెలియచేయాలని నోటీసులిచ్చిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పినారని రైతులు తెలిపారు.
27న మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో రైతులకు నోటీసులిచ్చామని ఆ రోజు సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదు పోలీసులు చెబుతున్నారని రైతులు తెలిపారు.నోటీసు ఇదే…
**ఎపి మంత్రి వర్గ సమావేశం ది. 27.12.2019 తేదీన వెలగపూడి సచివాలంలో జరుగుచున్నందున మందడం గ్రామం నుండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మరియు గౌరవనీయులలైన మంత్రి వర్గ సభ్యులు, ఇతర అధికారులు సచివాలయానికి మీ వీధి గుండా వెళ్లుచున్నందున భద్రత కారణాల దృష్యా మీ ఇంటిలో గాని, ఇంటి ఆవరణలో గాని, మీ కుటుంబ సభ్యులు తప్పవేరే ఇతర వ్యక్తులు గాని అనుమతించకూడదు. కొత్త వ్యక్తులు పర్యాటకులు వచ్చినట్లు గాని, తిరుగుచున్నట్లు గాని ఎలాంటి సమాచారం ఉన్నచో పోలీసు వారికి తెలియపర్చవలెను. అదే విధంగా పై తెల్పిన మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎటువంటి చర్యలకు ఉపక్రమించ వద్దని కోరుచున్నాము. ఇందుకు వ్యతిరేకంగా ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా మీ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడును.**

కింది తెలిపిన  నోటీపు తూళ్లూరు ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు పేర విడుదలయింది.

లోకేష్ పర్యటన

రేపు అమరావతి రాజధాని గ్రామాలలో నారాలోకేష్ పర్యటిస్తున్నారు.
అమరావతి రాజధాని గ్రామాలైన ,ఎర్రబాలెం,మందడం,వెలగపూడి గ్రామాలలో రేపు జాతీయతెలుగుదేశంపార్టీ ప్రధానకార్యదర్శి  నారాలోకేష్ గారు పర్యటిస్తారని టిడిపి ప్రకటిచింది.
వివరములు :
ఉదయం
10:00 గంటలకు – ఎర్రబాలెం గ్రామం
11:30 గంటలకు- మందడం
12:30 గంటలకు – వెలగపూడి
పై తెలిపిన గ్రామాలలో షెడ్యూలు ప్రకారం ఆయా గ్రామాలలో రైతుల చేస్తున్న నిరసన దీక్షలో పాల్గోని ,వారికి సంఘీభావంతెలియజేస్తారు ..