చంద్రబాబుకే టెన్షన్ పెట్టేస్తున్న ఎంఎల్ఏలు

జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల వివాదం క్లైమ్యాక్స్ కు చేరుకోవటంతో ఇపుడు అందరి కళ్ళూ టిడిపి ఎంఎల్ఏలపైనే పడింది. టిడిపి ఎంఎల్ఏలంటే అందరూ కాదులేండి. పార్టీకున్న 23 మంది ఎంఎల్ఏల్లో ఆరుగురి వ్యవహారంపైనే బాగా చర్చ జరుగుతోంది. క్లైమ్యాక్స్ కు అసెంబ్లీ వేదిక కానుండటం అందులోను వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్ళే అవకాశం ఉండటంతో అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.
ఇప్పటికే పార్టీలోని ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి పార్టీ నాయకత్వానికి ఎదురు తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళిద్దరు ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తారనటంలో సందేహం లేదు. అలాగే విశాఖపట్నంలో రాజధాని అంశానికి విశాఖ నగరంలోని నలుగురు ఎంఎల్ఏలు జై కొట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
అంటే ఉన్న 23 మంది ఎంఎల్ఏల్లో ఆరుగురి వ్యవహారంలో చంద్రబాబుకు తేడా కొట్టేట్లే ఉంది. అందుకనే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకించే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకు విప్ జారీ చేయించారు. దీని ప్రకారం వాళ్ళ మనసులో ఏమున్నా ఓటింగ్ అవసరమైతే మాత్రం కచ్చితంగా టిడిపికి అనుకూలంగా ఓట్లేయాల్సిందే.
ఈ విషయం ఆరుగురు ఎంఎల్ఏలకు కూడా బాగా తెలుసు. విప్ ను ఉల్లంఘిస్తే తమ సభ్యత్వాలు పోతాయని కూడా తెలుసు. ఈ నేపధ్యంలో మరి వీళ్ళారుగురు ఎంఎల్ఏలు ఏం చేస్తారన్నదానిపైనే అందరూ చర్చించుకుంటున్నారు పార్టీలో. బహిరంగంగా విశాఖపట్నం రాజధానికి నలుగురు ఎంఎల్ఏలు మద్దతు పలికి ఓటింగ్ లో వ్యతిరేకం చేస్తారా ? లేకపోతే తమ సభ్యత్వాలు పోయినా పర్వాలేదు అనుకుని జగన్ కు అనుకూలంగానే ఓట్లేస్తారా ? అన్నదే ఇపుడు పెద్ద సస్పెన్సుగా మారింది.
విశాఖనగరంలోని నలుగురు తమ సభ్యత్వాలు పోయినా పర్వాలేదనుకుంటే మరో ఇద్దరు కూడా జత కలిసే అవకాశముంది. సభ్యత్వాలు కోల్పోవటానికి వీళ్ళారుగురు గనుక రెడీ అయితే అపుడు చంద్రబాబు ఏం చేస్తారన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వీళ్ళారుగురిపై అనర్హత వేటు పడితే చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా ఎసరొస్తుంది. మొత్తానికి ఆరుగురు ఎంఎల్ఏలతో చంద్రబాబుకు పెద్ద సమస్యే వచ్చిపడింది.