రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు వద్దు : సీమనేతల విజ్ఞప్తి

రాయలసమ ప్రజల చిరకాల వాంఛ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటుచేయాలని ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు హైకోర్టు కేటాయించడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. లేఖ మీద మాజీ ఎంపి గుంగల ప్రతాప్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యడు డాక్టర్ ఎం. వి మైసూరా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్య మధుసూదన్ గుప్తా,పలువురు న్యాయవాదలు, డాక్టర్లు, జర్నలిస్టులు సంతకాలు చేశారు.
 లేఖ పూర్తి పాఠం:
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి,
నమస్తే
 గ్రేటర్ రాయలసీమ వాసులు   2014, మరియు 2019 లో జరిగిన శాసన సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో వైఎస్ ఆర్ సిపి అభ్యర్థులను గెలిపించిన విషయం  గుర్తుంటుంది అని అనుకుంటున్నాము. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రేటర్ రాయలసీకు అధిక ప్రాధాన్యత నిస్తారని ప్రజలు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ నుంచి హైకోర్టును  తరలిస్తున్న సందర్భంలో న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉటంకిస్తూ హైకోర్టును రాయలసీమలో నెలకొల్పాలని విజ్ఞప్తులు చేసిన మాట వాస్తవం. అది ఆనాటి కనీస కోర్కె.
ప్రస్తుతం  పరిపాలన వికేంద్రీకరించాలని సంకల్పించి అందుకు అనుగుణంగా జి.ఎన్ రావు (ఐఎఎస్ ) గారి ఆధ్వర్యంలో కమిటిని నియమించారు.
అలాంటి కమిటీ సిఫార్సులు ముఖ్యమంత్రలు ఆలోచన సరళికి అనుగుణంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం.
కమిటీ రిపోర్టును సమర్పించుటకు రెండు రోజుల ముందు శాసన సభలో జరిగిన చర్చ సందర్భంగా  ప్రజాతంత్ర రాధాని, పరిపాలనా రాజధాని, న్యాయరాజధాని గురించి మీరు ప్రస్తావించారు.
రెండు రోజుల తర్వాత జిఎన్ రావు గారు ఆ విధంగానే సిఫార్సులు చేస్తూ న్యాయరాజధానితో పాటు విశాఖలో ఒక బెంచి,గుంటూరులో ఒక బెంచిఉంటుందని పేర్కొన్నారు.
ఏది ఏమైనా పరిపాలనా వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం. కాని వికేంద్రీకరణ విషయంలో రాయలసీమకు న్యాయం జరగాలనేది మా ఆకాంక్ష.
గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుగా తెలుగు వారి ఐక్యత ఉన్న రాజధానిని త్యాగం చేసినారు. ప్రస్తుతం వికేంద్రీకరణ జరుగుతున్న సందర్భంలో గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించమని కోరుతున్నాం.  ఇది మా కొత్త కోర్కె కాదు. ఆ ప్రాంత ప్రజల త్యాగం వృధా పోకూడదని మా అభిప్రాయం, అభ్యర్థన.