Home Breaking విశాఖ గ్యాస్ లీక్, పవన్ కల్యాణ్ స్పందన

విశాఖ గ్యాస్ లీక్, పవన్ కల్యాణ్ స్పందన

279
0
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన
విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం… 8 మంది మృతి చెందటం… వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం.
మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి.
విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలి. అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను.
– పవన్ కళ్యాణ్
అధ్యక్షులు, జనసేన