రాయలసీమ హక్కుల నేత ‘పాండు సార్’ మృతి

(Kasipuram Prabhakar Reddy)
 రాయలసీమ హక్కుల నిరంతరం పరితపించిన  సాహితీఉద్యమ కారుడు బి పాండురంగారెడ్డి మరణించారు.  రాయలసీమలోనే కాదు, కవిగా వక్తగా ఆయన  రాష్ట్రమంతా సుపరిచితుడే.
అయన ఎన్నో ఉద్యమాలు చేశారు. సామాజిక అసమానతల పై విప్లవ కవితాఝరి కురిపించారు . పీడిత తాడిత ప్రజల విముక్తి కోరుతూ ఆయన రాసిన “సంకెళ్లను తెంచుదాం ” కావ్యం ఒకప్పుడు సంచలనం .
అలుపెరుగని  సీమ ఉద్యమకారుడాయన.  ఈ  తెల్లవారు జామున 3గంటలకు కన్నుమూశారు.
పాండురంగా రెడ్డి గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు . APTF రాష్ట్ర కార్యదర్శి గా , “ఉపాధ్యాయ ” పత్రికా సంపాదకుడిగా ఉపాధ్యాయ సంఘాలకు చిరపరిచితుడు. ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఆయన అనేక విప్లవ పోరాటాలలో పాల్గొన్నారు .
“విరసం” ఆవిర్భావ సభ్యులలో పాండు రంగారెడ్డి గారు ఒకరు.
ఆయన రాసిన “సంకెళ్లను తెంచుదాం” విప్లవ కావ్యం అప్పట్లో సంచలనం . ఆయన సహచరులు ఇప్పటికి “పాండు ” అనే పిలుస్తారు .
విప్లవోద్యమంలో వచ్చిన విభేదాల రీత్యా రమణా రెడ్డి , భూమన్ , నిఖిలేశ్వర్ , జ్వాలా ముఖి , రంగనాయకమ్మ , రవిబాబు తదితరులతో పాటు విరసం నుంచి బయటకొచ్చి “జనసాహితి” అనే వేదిక ఏర్పాటు చేసుకున్న వారిలో పాండు సార్ కూడా ఒకరు .
APTF ప్రచురించిన “కెరటాలు” అనే కవితా సంకలనం కు ఈయన ప్రధాన సంపాదకులు .
1991 లో ఉవ్వెత్తున ఎగసిన సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దత్తు ఇచ్చారు . 1993 లో పౌరహక్కుల నేత బాల గోపాల్ , కామ్రేడ్ సంధ్య ల నేతృత్వాల్లో ఏర్పడిన ” రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట సమితి” కి వెన్నుదన్నుగా నిలిచారు . ( ఈ సంస్థ పోరాటం వల్లనే రాయలసీమ లో విచ్చలవిడి తుపాకీ లైసెన్స్ లను నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రద్దు చేశారు )
పౌర హక్కుల సంస్థ OPDR కు కర్నూల్ జిల్లా ప్రతినిధులు గా పాండు సార్ , ఆయన తమ్ముడు నరసింహా రెడ్డి లు పనిచేశారు .

1996 లో రాయలసీమ రచయితలను అందరినీ ఏకం చేసి నంద్యాల లో “సీమ సాహితి ” సంస్థను ఏర్పాటు చేశారు. మధురాంతకం రాజారాం , భూమన్ , రామకృష్ణా రెడ్డి తదితర ప్రముఖులను కలుసుకునే అవకాశం నాకు ఈ వేదిక కల్పించింది.

సీమ సాహితి ప్రధాన సంపాదకుడుగా మరుగున పడిన రాయలసీమ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు .
మొట్ట మొదటి ప్రచురణగా 1996 నవంబర్ 16 న “శ్రీబాగ్ ఒడంబడిక ” పై ప్రత్యేక సంచిక ప్రచురించారు . ఇందులో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని నిలదీశారు . ఆ వెంటనే విద్వాన్ విశ్వం విరచిత “పెన్నేటి పాట ” కావ్యాన్ని పునర్ముద్రించారు . 3 వ సంచిక గా “బళ్ళారి రాఘవ ” జీవిత చరిత్రను ముద్రించారు . ఆ విధంగా సీమ సాహిత్యం , సంస్కృతి ప్రతిబింబింబించే నెలకొక ప్రత్యేక సంచిక ను విడుదల చేస్తూ వచ్చారు .
నేటి తరం రాయలసీమ ఉద్యమకారులకు రిఫరల్ బుక్ గా ఉపయోగపడుతున్న ప్రొఫెసర్ భూమన్ రాసిన ” రాయలసీమ ముఖచిత్రం ” కూడా సీమ సాహితి ప్రచురణే. అంతే కాదు .
సీమ పల్లెల బతుకు చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పి .రామకృష్ణారెడ్డి గారి “పెన్నేటి కథలు ” , మనిషి -పశువు పుస్తకాలు కూడా పాండు సార్ సంపాదకత్వం లో సీమ సాహితి ప్రచురించింది .
టెలివిజన్ సంస్కృతి పెరిగిపోతున్న దశలో పాఠక ఆదరణ తగ్గిపోవడం వల్ల నిధుల లేమి వల్ల సీమ సాహితి సంస్థ కునారిల్లిపోయింది .
రేపొద్దున ఏ రాయలసీమ చరిత్రకారుడైనా సీమ సాహిత్య పరిణామాలను అక్షరీకరించేటపుడు పాండు సార్ పాత్రకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదు.
(Kasipuram Prabhakar Reddy, Journalist,Koilakuntla, Kurnool district)