ఢిల్లీ రైతు ఉద్యమానికి ఒపిడిఆర్ మద్దతు

(ఒపిడిఆర్)

కేంద్రంలోని  బిజెపి ప్రభుత్వం  ఏక పక్షంగా ప్రవేశపెట్టిన మూడు నూతన  వ్యవసాయ చట్టాలు  రైతాంగ వ్యతిరేకమైనవని, కార్పొరేటు  కంపెనీలకు లాభాలు చేకూర్చటానికి ఉపయోగపడేవని ప్రకటిస్తూ  రైతులు ఈ నిరంకుశ చట్టాలను ఉపసంహరించాలని  డిమాండ్ చేస్తూ గత నవంబరు 27 నుండి ఢిల్లీ నగర పరిసరాలలో ఆందోళనలు,నిరసన ప్రదర్శనలు  చేస్తున్న విషయం విదితమే.

రైతాంగం నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్) తెలంగాణ రాష్ట్ర శాఖ తన మద్దతును తెలియజేస్తోంది 

తీవ్రమైన అణచివేత,అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఫిబ్రవరి 6 వ తేదీన జాతీయ రహదారుల  బందుకు కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపుకు ఓపిడీఆర్  తన సంఘీభావాన్నిప్రకటిస్తున్నది. 

72 రోజులుగా రైతాంగం నిర్వహిస్తున్న ఈ ఆందోళనను పరిష్కరించకుండా, రైతుసంక్షేమం పేరుతో ప్రజాలందరి పై సెస్సు  విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, వేరొక వైపు  తీవ్రమైన అనేక నిర్బంధ అణచివేత చర్యలకు పాల్పడుతున్నది.తమతమ గ్రామాల నుండి ఢిల్లీ పరిసరాలకు చేరుకుంటున్న రైతాంగ బృందాలను మార్గం మధ్యలోనే  అటకాయిస్తూ,ఎక్కడికక్కడచెదరగొడుతూ,రోడ్లుమూసివేస్తూ,బారికేడ్లు కడుతూ ఆదిలోనే అడ్డుకునే విఫలయత్నం చేసింది. రైతుల ప్రజాస్వామిక హక్కును హరిస్తూ  ఢిల్లీ నగరంలో  ప్రవేశించకుండా నిరోధించింది.రోడ్ల ప్రక్కన టెంట్లు వేసుకుని  రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే , స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే  సాకుతో టెంట్లు పీకివేయడం, విద్యుత్తు నీరు లాంటి అత్యవసర సదుపాయాలను నిలిపివేయడం లాంటి కుటిల విధానాలను అనుసరిస్తున్నది. రైతుల నిరసన కేంద్రాలవద్ద రోడ్లనన్నిటినీ       మూసివేసి,భద్రతా బలగాలతో చుట్టుముట్టి, ఇనుప కంచెలు, ఎత్తైన బారికేడ్లు, ముళ్ళతీగలు, చివరకు సిమెంటు గోడలు సైతం కట్టి  ఆందోళన చేస్తున్న లక్షలాది రైతులను బంధించివేస్తున్నది. యఫ్ ఐ ఆర్ లు బనాయించటం, అక్రమ అరెస్టులు సాగించటంతో పాటు కిరాయి మూకలచే దాడులు జరిపిస్తున్నది.అనేకమంది ఉద్యమకారులు కనిపించకుండా పోతున్నారు. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం  రైతాంగం పై యుద్ధం ప్రకటించినట్లుగా పోలీసులను, రక్షణ  దళాలను  ప్రయోగిస్తున్నది. అంతేగాక, ఇంటర్ నెట్ ను  ఆపివేయటం, ఆందోళనకారులకు చెందిన ట్విట్టర్ ఖాతాలను స్తంభింప చేయటం లాంటి హేయమైన విధానాలకు పాల్పడుతున్నది. జనవరి 26 తరువాత ఈ నిర్బంధ చర్యలను తీవ్రతరం చేసింది. కేంద్రం లోని బిజెపి  ప్రభుత్వం అనుసరిస్తున్న  ఇలాంటిఅమానుష, కఠిననిర్బంధ, అణచివేత, నిరంకుశ విధానాలను ఓపీడిఆర్  తీవ్రంగా ఖండిస్తున్నది. 

వేరొకవైపు ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచివేయటానికి చీల్చటానికి కుటిల యత్నాలు సాగిస్తోంది. అసాంఘిక శక్తుల  ఆసరాతో, రాజకీయ కుట్రలతో, హింసాత్మక చర్యలను ప్రేరేపిస్తూ తమ అనుకూల శక్తుల ద్వారా రైతాంగ  ఉద్యమాన్ని విచ్చిన్నం  చేయ పూనుకుంటోంది. దేశ విద్రోహశక్తులు చేస్తున్న జాతివ్యతిరేక ఉద్యమంగ ఈ రైతు ఉద్యమాన్ని చిత్రీకరిస్తూ అణచివేయ జూస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విచ్చిన్నకర విధానాలను, తప్పుడు ప్రచారాలను ఓపిడిఆర్ తీవ్రంగా  నిరసిస్తున్నది.

 వాస్తవానికి  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టాలు రైతాంగ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైనవి. వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల పంపిణీని బడా  పెట్టుబడిదారుల గుప్పిట్లోకి నెట్టి , వారు పెద్దఎత్తున లాభాలు గడించటానికి  ఈ చట్టాలు వీలుగా ఉన్నాయి. అంతేగాక వ్యవసాయరంగం పై రాష్ట్రాలహక్కులను మరింతగా  హరించివేస్తూ, వాటిపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సాధించటానికి ఈ చట్టాలు ఉపయోగ పడతాయి. గతం లో రైతాంగ సంక్షేమం  పేరుతో తీసుకొచ్చిన చట్టాలేవీ రైతాంగం ఎదుర్కుంటున్న మౌలిక సమస్యలను  పరిష్కరించ లేకపోయాయి. ఈ నూతన చట్టాలు కూడా రైతాంగాన్ని మరింత సంక్షోభం లోకి నెట్టడానికే దారితీస్తాయి. నేటి భూస్వామ్య  విధానాన్ని రద్దుచేసి, దున్నేవానికి భూమిని పంచినప్పుడే ఈ సంక్షోభానికి  మౌలిక  పరిష్కారం లభిస్తుంది. 

కావున ఉద్యమిస్తున్న రైతాంగంతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి  గల చర్చలు  కొనసాగించి, రైతాంగ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న ఈ నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి . రైతాంగంపై  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నిరకాల నిర్బంధ అణచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని ఓపిడిఆర్ డిమాండ్  చేస్తున్నది.

(ఇది Organization for the Protection of Democratic Rights (OPDR), తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు డా. జతిన్ కుమార్, ప్రధాన  కార్యదర్శి డి. విజయేందర్  విడుదల చేసిన ప్రకటన.)

 

               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *